Friday, September 26, 2025

ఉపాధ్యాయులకు టెట్ ని‘బంధనలు’

- Advertisement -
- Advertisement -

వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది విద్యా హక్కు చట్టం అమలుపై సుప్రీంకోర్టు తీర్పు. విద్యా హక్కు చట్టం- 2009 సెక్షన్ 23(1) ఆధారంగా జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సిటిఇ) 23-ఆగస్టు, -2010 నోటిఫికేషన్ ప్రకారం ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేసింది. టెట్ అంశం పై ‘అంజుమన్ ఇషాత్-ఎ-తలీమ్ ట్రస్ట్ vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర & ఆర్శ్’ కేసు విషయంలో జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ ఉపాధ్యాయులుగా నియమించబడ్డ వారు ప్రస్తుతం సర్వీస్ కొనసాగించాలన్నా, పదోన్నతి పొందాలన్నా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిందేనని ఇటీవల తీర్పునిచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 25 లక్షలమంది ఉపాధ్యాయులు, తెలంగాణలో 70 వేలమంది ఉపాధ్యాయులు, ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మంది ఉపాధ్యాయుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1.5 లక్షల మంది ఉపాధ్యాయులలో ఆందోళన నెలకొని ఉంది.

ఎప్పుడో 20, 25 సంవత్సరాల క్రితం పాఠశాల ఉపాధ్యాయులుగా నియమించబడ్డ వారు ప్రస్తుతం సర్వీసు కొనసాగించాలన్నా, పదోన్నతి పొందాలన్నా ఈ వయసులో టెట్‌రాసి ఉత్తీర్ణత సాధించడం సాధ్యమవుతుందా?. ఐదు సంవత్సరాలు కన్నా ఎక్కువ సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలన్నా, ఐదు సంవత్సరాలకు తక్కువ సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలన్నా టెట్‌లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలనే సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వ పాఠశాలలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 15 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం 2012 డిఎస్‌సి, 2017 టిఆర్‌టి, 2024 టిఆర్‌టి ద్వారా నియామకమైన సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ అర్హత ఉంది. ఇప్పటికే సుమారు 20 వేల మంది ఉపాధ్యాయులు టెట్ పాస్ అయి ఉండవచ్చు. మొత్తంగా 50 వేల మంది ఉపాధ్యాయులు మాత్రమే టెట్‌లో అర్హత కలిగి ఉన్నారు. సుమారు 70 వేల మంది ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాయలేదు. టెట్ అర్హత నేపథ్యంలో రెండు సంవత్సరాల్లో టెట్ పాస్ కావాలన్నా నిర్ణయం వల్ల, పదోన్నతులకు టెట్ కచ్చితంగా పాస్ కావాలనే షరతు వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రమవుతుంది. దాని వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు నష్టపోతారు.

ప్రధానోపాధ్యాయుల, ఇతర శాఖలలో పదోన్నతుల కోసం జిఒ టిఇఒటి లాంటి శాఖాపరమైన పరీక్షలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అదే మాదిరి విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చినప్పటి (2010) నుంచే ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ పదోన్నతులకు కూడా టెట్ తప్పనిసరి చేస్తూ అమలు చేసి ఉంటే ప్రారంభంలోనే ఉపాధ్యాయులు దానిపై దృష్టి పెట్టి పరీక్షలు రాసి పాస్ అయ్యి ఉండేవారు. 2010లోనే ఎన్‌సిటిఇ ఈ నిబంధనలు అమలులోకి తెచ్చింది. 2012, 2017, 2024 ఉపాధ్యాయ నియామకాల్లో ఈ నిబంధనలు అమలు చేసిన విద్యాశాఖ పదోన్నతిలో కూడా ఎందుకు అమలు చేయలేదు? విద్యా హక్కు చట్టం ప్రకారం పదోన్నతిలో టెట్ తప్పనిసరి కావడంతో 2015 లోపు ఉత్తీర్ణులు కావాలని ఎన్‌సిటిఇ గడువు ఇచ్చింది. అయినా ఆ దిశగా విద్యాశాఖ చర్యలు ఎందుకు తీసుకోలేదు? మరొకసారి సుమారు 4 సంవత్సరాల గడువు పెంచుతూ 2019 వరకు ఉత్తీర్ణులు కావాలని ఎన్‌సిటి ఉత్తర్వులు జారీ చేసింది. అయిన అప్పుడెందుకు విద్యా శాఖ అమలు చేయలేదు? పరిష్కారం ఏమిటి? విద్యాహక్కు చట్టం -2009 సెక్షన్ 23 (2) ప్రకారం టెట్‌కు తాత్కాలిక మినహాయింపు ఇవ్వవచ్చు. కాబట్టి 23 -ఆగస్టు -2010 కంటే ముందు నియామకమైన ఇన్స్ సర్వీసు టీచర్లకు సర్వీసు లో కొనసాగడానికి, ప్రమోషన్ పొందడానికి టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చే విధంగా చట్ట సవరణ చేయాలి.

అది సాధ్యం కాకపోతే 44 సంవత్సరాలు దాటిన వారికి టెట్ రాసే అర్హత లేదు, కాబట్టి సుమారు 20, 25 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులకు వారి బోధన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈ వయసులో వారికి ఉన్న బరువు, బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని 45 సంవత్సరాలు దాటిన ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగడానికి, 50 సంవత్సరాలు దాటిన వారికి పదోన్నతి పొందడానికి టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి. లేదా ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతూ టెట్ పాస్ కావడానికి ఐదు సంవత్సరాలు, పదోన్న తర్వాత టెట్ పాస్ కావడానికి మూడు సంవత్సరాల సమయాన్ని ఇవ్వాలి. ప్రస్తుతం పేపర్ 2 అభ్యర్థులు రాస్తున్న టెట్‌లో ఉపాధ్యాయులు అర్హత సాధించడం కొంత కష్టం. ఎందుకంటే ఉపాధ్యాయులు పదోన్నతి పొందే సబ్జెక్టులో తప్పనిసరిగా డిగ్రీ లేదా తత్సంబంధ అర్హత సాధించి ఉంటారు. కొందరైతే పిజి అర్హత సాధించి ఉంటారు. టెట్‌లో ఆ సబ్జెక్టులో ఎంత కఠినమైన ప్రశ్నలు అడిగిన సమాధానాలు రాయగలరు. కాబట్టి సులభంగానే టెట్ పాస్ కాగలరు. కానీ పేపర్ 2 అభ్యర్థులు రాస్తున్న టెట్‌లో అడుగుతున్న ప్రశ్నలు విచిత్రంగా ఉన్నాయి. సాంఘిక శాస్త్ర పదోన్నతి కోసం అర్హత ఉన్న ఉపాధ్యాయులకు టెట్ లో తెలుగు పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి.

జీవశాస్త్ర పదోన్నతి కోసం అర్హత ఉన్న ఉపాధ్యాయులు టెట్‌లో గణిత సంబంధ ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. గణిత శాస్త్ర పదోన్నతి కోసం అర్హత ఉన్న ఉపాధ్యాయుడు టెట్‌లో జీవశాస్త్ర సంబంధ ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. 20, 25 సంవత్సరాల సర్వీసు ఉన్న సీనియర్ ఉపాధ్యాయులు ఇప్పుడు తమ సబ్జెక్ట్ కాకుండా ఇతర సబ్జెక్టను ఎలా ప్రిపేర్ కాగలరు. టెట్ అర్హత లేకుండా సర్వీస్ లో కొనసాగించనీ యెడల, పదోన్నతి ఇవ్వని పక్షంలో ఇన్ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి. సాధారణంగా నిర్వహించే టెట్‌లా కాకుండా ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు వారు బోధించబోయే సబ్జెక్టునీ, బోధన అనుభవాన్ని, బోధన మెలకువలను పరీక్షించే విధంగా సులభతరంగా ఉండేటట్లు ప్రత్యేక టెట్ నిర్వహించాలి. ఇంకా అవసరమైతే జిఒటిఇఒటి మాదిరి చూసి రాసే పద్ధతిలో టెట్ నిర్వహించాలి. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం వలే సెప్టెంబర్ 30 లోపు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. కేంద్ర ప్రభుత్వపై ఒత్తిడి తెచ్చి విద్యకు హక్కు చట్టం -2009 సెక్షన్ 23 కి సవరణలు చేయాలి. ఎన్‌సిటి ఈ నిబంధనలు మార్చాలి. దేశ వ్యాప్తంగా 25 లక్షల మంది ఉపాధ్యాయులు, తెలంగాణలో 70 వేల మంది ఉపాధ్యాయులు, ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మంది ఉపాధ్యాయుల భవిష్యత్‌ను ప్రభుత్వాలు కాపాడాలి.

నారాయణ యాదవ్
94940 19270

Also Read: సెబీకి విశ్వసనీయత ఉందా!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News