Saturday, April 27, 2024

సిలిం’ఢర్’

- Advertisement -
- Advertisement -

Rs.50 hike on Domestic LPG Cylinder

మళ్లీ ప్రేలిన గ్యాస్ సిలిండర్ ధరలు
రూ.50 పెంచిన చమురు కంపెనీలు
డిల్లీలో రూ.1053..హైదరాబాద్‌లో రూ.1105
తక్షణం అమల్లోకి వచ్చిన కేంద్రం ఆదేశాలు
రాష్ట్రంలో కోటి18లక్షల కుటుంబాలపై ప్రభావం
ఏటా రూ.1600కోట్లు అదనపు భారం
మనతెలంగాణ/హైదరాబాద్: వంటగ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పేలాయి. వంటింట్లో ధరల మంటలు ఎగిసి పడుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడి ప్రభుత్వం వంటింట్లో గ్యాస్ ధరల మంటలు పుట్టిస్తోంది. గృహ వినియోగ అవసరాలకు సంబంధించిన సిలిండర్‌పై తాజాగా రూ.50 పెంచింది. దీంతో 14.2కిలోల ఎల్పీజి సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1003నుంచి 1053కు పెరిగింది.హైదరాబాద్‌లో 1055నుంచి రూ.1105కు పెరిగింది. 5కిలోల సిలిండర్ ధర రూ.18కి పెంచింది. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. పెరిగిన వంటగ్యాస్ సిలెండర్ ధరల ప్రభావం దేశంలోని 35కోట్ల కుటుంబాలపై పడుతోంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే గృహ అవసరాలకు వంటగ్యాస్ సిలిండర్లు కోటి18 లక్షలు వినియోగిస్తున్నారు. ప్రతిరోజూ 1.20లక్షల సిలిండర్లు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి డెలివరీ అవుతున్నాయి. రాష్ట్రంలో సగటున 70శాతం పైగా వినియోగదారులు ప్రతినెల గ్యాస్ సిలిండర్లను కోనుగోలు చేస్తున్నారు. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరల పెంపుదల కారణంగా రాష్ట్రంలోని వినియోగదారులపైనే ఏటా రూ.1600 కోట్లు అదనపు భారం పడనుంది.
అచ్చేదిన్ అంటూనే రూ.635 పెంపుదల!
తాము అధికారంలోకి వస్తే మంచి రోజులు వస్తాయని చెప్పి ప్రజల ఆశీస్సులతో ప్రధాని పదవిని చేపట్టిన నరేంద్ర మోడి వంటింట్లో ధరల మంటలు పుట్టించి అచ్చేదిన్‌కు అర్ధమేంటో తెలియజెప్పారని వినియోగదారులు ఆందోళన వెలి బుచ్చుతున్నారు. కేంద్రంలో బిజేపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2014లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.470 ఉండేది. దీన్ని అంచెలంచెలుగా పెంచూతూ వినియోగదారులకు కేంద్రం చుక్కులు చూపుతూ వచ్చింది. 2017లో రూ.646కు పెంచింది. 2020లో రూ.910కి పెంచింది. 2022లో ఇప్పటికే తొమ్మిదిసార్లు పెంచింది. తాజాపెంపుదలతో దీని ధర రూ.1105కు చేరింది. ప్రధాని మోడి ప్రభుత్వం ఏడేళ్ల తన ఏలుబడిలో వంటగ్యాస్ ధరలను రెట్టింపు పెంచింది.
ఎక్కడ రూ.57 ఎక్కడ రూ.1105:
వంటగ్యాస్ ధరల మంటలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. దేశంలో 1989నాటికి 14కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.57.60 మాత్రమే ఉండేది. అప్పటిదాక పుల్లా పుట్రా ఏరి వంటచెరుకు ద్వారానే వంటింటి అవసరాలు తీర్చుకునే గ్రామీణులకు సైతం కేంద్ర ప్రభుత్వం పర్యావరణ చైతన్యం పేరుతో గ్యాస్ వైపుమళ్లించింది. సిలిండర్లు, గ్యాస్ స్టౌలకు కూడా రాయితీలు ఇచ్చి ప్రోత్సహించింది. రెక్కాడితే డొక్కాడని నిరుపేద కూలీలకు సైతం గ్యాస్ అవసరం నిత్యకృత్యంగా మార్చివేసింది. తీరా ఇప్పుడు ధరల పెంపుదలతో పేదలు గగ్గోలు పెడుతున్నారు. ఒక్క గ్యాస్ సిలిండర్ కోసమే రూ.1105 భరించాల్సి రావటం తలకు మించిన భారంగా మారింది. ఇంతటితోనైనా గ్యాస్ ధరల మంటలు ఆగుతాయన్న గ్యారెంటీ లేదు. ఈ పరిస్థితుల్లో అన్నివర్గాల ప్రజలు కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తి జ్వాలలు వెళ్లగక్కుతున్నారు.

Rs.50 hike on Domestic LPG Cylinder

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News