Sunday, April 28, 2024

రూపాయి భారీ పతనం

- Advertisement -
- Advertisement -

Fuel, food crisis with Russia Ukraine war

 డాలర్‌తో రూపాయి పతనం అదే పనిగా, హద్దు, ఆపు లేకుండా సాగిపోతున్నది. ఈ నెల 5 తేదీన డాలర్‌కు 79.37 రూపాయలై అత్యధమ స్థాయికి దిగజారిపోయింది. స్టాక్ మార్కెట్ 100 పాయింట్లు పతనమైంది. మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోడం కొనసాగుతున్నది. మనం దిగుమతి చేసుకొంటున్న బ్రెంట్ మార్క్ క్రూడాయిల్ ధర బ్యారెల్ 112.25 డాలర్లకు చేరుకొన్నది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదార్లు రూ.2149.56 కోట్ల షేర్లను ఉపసంహరించుకొన్నారు.

దిగుమతుల భారం నానాటికీ పెరుగుతూ పోడమే రూపా యి మారకపు విలువను దెబ్బ తీస్తున్న ప్రధానమైన అంశమని స్పష్టపడుతున్నది. దేశ ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం అధికమవుతూ ఉన్నంత కాలం యీ పతనావస్థ నుంచి విముక్తి లభించదు. డాలరుతో రూపాయి విలువ త్వరలోనే 79.50 కి అటు పిమ్మట 80 రూపాయిలకు చేరుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పతనం కొనసాగుతున్న కొద్దీ దిగుమతుల వ్యయ భారం పెరిగిపోతుంది. క్రూడాయిల్, బొగ్గు దిగుమతుల ఖర్చు మితిమించడంతో జూన్ నెల వాణిజ్య లోటు రికార్డు స్థాయికి (25.63 బిలియన్ డాలర్లు ) చేరుకొన్నది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో దేశ కరెంటు ఖాతా లోటు స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 3.2 శాతానికి చేరుకొంటుందని అంచనా. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో యీ లోటు 1.2 శాతమే. డాలర్‌తో రూపాయి ప్రస్తుత పరిస్థితి ఇలా వుంటే తొమ్మిది నెలల క్రితం 2021లో యింతకంటే యే మాత్రం గొప్పగా లేదు. గత అక్టోబర్ 21న డాలర్‌తో రూపాయి విలువ రూ. 75.65. అప్పటికి 15 మాసాల్లో యెన్నడూ యెరుగనంత పతనం. అప్పుడు కూడా దేశ దిగుమతుల బిల్లు భరించలేని స్థాయికి చేరుకోడం వల్లనే రూపాయికి ఆ దుర్గతి పట్టింది.

అందులో ప్రధాన పాత్ర క్రూడాయిల్ దే. అప్పటికి అంతర్జాతీయ మార్కెట్‌లో మనం కొనుక్కొనే క్రూడ్ ధర బ్యారెల్ 84.38 డాలర్లు. దిగుమతుల వ్యయం డాలర్లలో భరించవలసి వుంటుంది. ఆ ఖర్చు పెరిగే కొద్దీ డాలర్ల అవసరం పెరిగి రూపాయితో దాని విలువ యెగబాకుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడ్ 70-75 డాలర్ల వద్ద ఉంటే భారత ఆర్ధిక వృద్ధి గణనీయంగా పెరుగుతుందనుకొన్నారు. డాలర్ తో ఇతర కరెన్సీల విలువలకు అనేక కారణాలుంటాయి. మనం యేయే దేశాల నుంచి సరకులు దిగుమతి చేసుకొంటామో ఆయా దేశాల కరెన్సీల విలువల ప్రభావమూ దానిపై పడుతుంది. చైనా నుంచి చేసుకొనే దిగుమతులపై అమెరికా సుంకాలు పెంచితే దాని వల్ల సైతం ప్రభావితమవుతుంది. మన షేర్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబదుల రాకడ పోకడల ప్రభావం అమితంగా ఉంటుంది.

ఈ యేడాది యింత వరకు 28.4 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోయాయి. 2008 అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభంలో వెళ్ళిపోయిన పెట్టుబడుల కిమ్మత్తు 11.8 బిలియన్ డాలర్లు మాత్రమే. మన దేశానికి మామూలుగా జరిగే సరకుల రాకడకు ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతరాయం కలగడం కూడా రూపాయితో డాలర్ విలువ పెరగడానికి దోహదం చేస్తున్నది. క్రూడాయిల్‌ను రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకొంటున్నప్పటికీ అది పరిమితమే. అందుచేత డాలర్‌తో రూపాయి విలువ పతనం కాకుండా అది ఆపలేకపోతున్నదనుకోవాలి. డాలర్‌తో రూపాయి విలువ వొక స్థాయి మీరి పడిపోతే దాని దుష్ప్రభావం దిగుమతులపై చూపి దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. దానిని అరికట్టడానికి రిజర్వు బ్యాంకు తన వద్ద గల డాలర్లను కొంత వరకు మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. డాలర్ గిరాకీకి సరఫరాకు తేడా కొంత మేర తగ్గి రూపాయి ఆ మేరకు నిలబడుతుంది. అయితే ఈసారి ఆర్‌బిఐ యీ పనిని తగినంతగా చేయడం లేదని చెబుతున్నారు.

గత ఫిబ్రవరి 25 నుంచి ఇప్పటి వరకు మన విదేశీ మారక నిల్వలు 40.94 బిలియన్ డాలర్లు తగ్గాయని సమాచారం. మొత్తం నిల్వలు 600 బిలియన్ డాలర్‌ల వరకు ఉంటాయని తెలుస్తున్నది. ప్రస్తుత ఉపద్రవం నుంచి రూపాయిని రక్షించడానికి బంగారం దిగుమతులను కూడా ప్రభుత్వం నిరుత్సాహపరుస్తున్నది. వాటిపై సుంకాన్ని 5 శాతం పెంచింది. 7.5 శాతాన్ని 12.5 శాతం చేసింది. అలాగే దేశం నుంచి జరిగే పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై సుంకాన్నీ పెంచినట్టు సమాచారం. ఎన్ని చేసినా సముద్రం ముందు నీటిబొట్టు మాదిరిగానే నిష్ఫలమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం తన పాలన ప్రాథమ్యాలను మార్చుకొని దేశాన్ని మత విద్వేషానల శ్మశానంగా మార్చడాన్ని మాని గట్టి ఆర్ధిక శక్తిని చేయడం వైపు దృష్టి సారించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News