Tuesday, April 30, 2024

కెసిఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ రైతుబంధు ఆగదు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్

మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ రైతుబంధు ఆగదని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో కుమ్మక్కయిన రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతుల నోట్లో మన్ను కొడుతూ రైతుబంధును నిలిపివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ నాయకులు, మాజీ ఎంఎల్‌సి శ్రీనివాసరెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ సోమభరత్‌లతో కలిసి దాసోజు శ్రవణ్ ‘రైతుబంధు భరోసా పత్రం’ విడుదల చేశారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. పేదరైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతుందని మండిపడ్డారు. పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారాయని చెప్పారు.

వ్యవసాయం దండగా అనే నానుడి నుంచి.. వ్యవసాయం పండుగ అనే స్థాయికి సిఎం కెసిఆర్ తీసుకొచ్చారని, అందుకు రైతుకు ఇచ్చిన ప్రభుత్వ ప్రోత్సాహకాలు చాలా ఊతం ఇచ్చాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే పేద రైతులకు సిఎం కెసిఆర్ అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతు రుణమాఫీ, రైతులకు ఉచిత కరెంటు, చెరువుల పునరుద్ధరణ, ఎరువుల పంపిణీ, కల్తీ ఎరువుల బాధ నుంచి విముక్తి కల్పిస్తూ.. గిట్టుబాధర వంటి ఎన్నోపథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. కెసిఆర్ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు రైతుబంధు ఆగదని, రైతులకు ఉచిత కరెంటు ఇస్తారని, కల్తీలు లేని వ్యవసాయాన్ని మన రైతులు త్వరలోనే చూడబోతున్నారని తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులంతా ఈ విషయంపై ఆలోచించి కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. రైతుల అభ్యుదయవాది సిఎం కెసిఆర్ అని వ్యాఖ్యానించారు. పేద రైతుల జీవితాలు బాగుపడుతుంటే.. రేటెంతరెడ్డి ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెప్పించి రైతుబంధును ఆపి, పేద రైతుల నోటికాడ ముద్దను లాక్కున్నారని చెప్పారు. ఈ విషయమై తెలంగాణ రైతాంగం ఆలోచించాలని కోరారు. రైతుబంధుకు పూర్తిగా ఎసరు పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కెసిఆర్‌ది రైతుది పేగుబంధం అని పేర్కొన్నారు. ఓట్ల కోణంలో రైతుబంధును ఆపించిన కాంగ్రెస్ పార్టీ ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. రైతుల్లో నెలకొన్న అభద్రతను తొలగించేందుకు, రైతుల్లో భరోసా కల్పించేందుకు ‘రైతుబంధు భరోసా పత్రం’తో సిఎం కెసిఆర్ అన్నదాతలకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ పత్రంపై ఆయనే సంతకం పెట్టి రైతుల్లో ధైర్యం నింపారని శ్రవణ్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News