ఓవల్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌పై మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాదేళ్ల తన ఎక్స్‌లో స్పందించారు. ఇది కేవలం గేమ్ కాదని, కాలాతీతమైన టెస్ట్ క్రికెట్ వైభవానికి చిహ్నంగా నిలుస్తుందని కొనియాడారు. 25 రోజులు ఐదు మ్యాచ్‌లు 2-2తో సమం చేయడం గొప్పగా ఉందని కితాబిచ్చాడు. కొన్ని తరాలకు సరిపడా సిరీస్‌ను అందించారని, నాటకీయతలో గొప్పతనం, దైర్యంతో కూడిన పోరాటపటిమ తనని అబ్బురపరిచిందని ప్రశంసించారు. భారత్-ఇంగ్లాండ్ జట్లకు హ్యాట్సాఫ్ చెప్పారు.
అమెరికా దిగ్గజ కంపెనీల్లోని భారతీయ సిఇఒలు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు చాలామంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఆల్ఫాబెట్, గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ చివరి టెస్టులో ఓవల్ స్టేడియంలో కనిపించాడు. మూడో రోజు వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచాయ్ కామెంటరీ బాక్స్‌లో కనిపించారు. హర్ష భోగ్లేతో కలిసి కొంచెంసేపు సరదాగా మాట్లాడారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.