జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(79) (Satyapal Malik) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ఖాతా నిర్వహించే టీమ్ ధృవీకరించింది. ఆగస్టు 23 ,2018 నుంచి అక్టోబర్ 30, 2019 వరకూ ఆయన జమ్ముకశ్మీర్‌లో గవర్నర్‌గా సేవలు అందించారు. ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఉన్నారు. బిహార్, గోవా, మేఘాలయ గవర్నర్‌గా కూడా ఆయన పని చేశారు. ఒడిశా గవర్నర్‌గానూ ఆయన అదనపు బాధ్యతలు నిర్వహించారు.
మాలిక్ (Satyapal Malik) 1970వ దశకంలో ఎమ్మెల్యేగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాజకీయాల్లో ఆయనకు 50 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. పశ్చిమ యూపీలోని బాగ్‌పట్‌కు చెందిన ఆయన మొదట చౌదరి చరణ్ సింగ్ ఆధ్వర్యంలోని భారతీయ క్రాంతి దళ్ పార్టీలో చేరారు. ఆ పార్టీ టికెట్‌పై ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 1980లో చరణ్ సింగ్ నేతృత్వంలోని లోక్‌దళ్ ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది. కానీ, 1984లో కాంగ్రెస్‌లో చేరి 1986లో రాజ్యసభకు వెళ్లారు.
ఆ తర్వాత ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు. ఇటీవల ఆయన నివాసాల్లో సోదాలు జరిపి, సిబిఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన అస్వస్థతకు గురై.. ఆస్పత్రిలో చేరారు. సత్యపాల్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన పార్థివదేహాన్ని ఢిల్లీ ఆర్కేపురంలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. బుధవారం లోధి స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.