Tuesday, May 7, 2024

నిరంకుశ చట్టాలపై సమీక్ష!

- Advertisement -
- Advertisement -

SC expressed grave concern over abuse of Section 124A

భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 124ఏ(రాజద్రోహం) దుర్వినియోగంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వలస కాలపు చట్టం స్వతంత్ర భారతదేశంలో ఇంకా అవసరమా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఆ విధంగా స్వతంత్ర భారత దేశంలో స్వరాజ్యంను నిజమైన ప్రజాస్వామ్యంగా మలుచుకోవడంలో నిరంకుశ వ్యవస్థలకు, చట్టాలకు మంగళం పాడవలసిన అత్యవసరాన్ని అత్యున్నత న్యాయస్థానం నేడు దేశం ప్రజలకు గుర్తుచేసిన్నట్లుగా భావించాలి. 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వలస పాలకులు కేవలం నాటి స్వతంత్ర ఉద్యమాన్ని అణచడం కోసం, ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను కట్టడి చేయడం కోసం ఉపయోగించిన నిరంకుశ చట్టాలలో ఇదొక్కటి. స్వతంత్రం అనంతరం కనీసం రెండు హైకోర్టులు ఈ చట్టాన్ని కొట్టివేసిన, సుప్రీం కోర్ట్ దాని రాజ్యాంగబద్దతను పునరుద్ధరించింది. అయితే ఇదొక్క మినహాయింపు మాత్రమే అని, ప్రభుత్వం చాలా అరుదుగా మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది.

అయితే ఈ చట్టం ఉపయోగిస్తున్న తీరుతెన్నులు చూస్తుంటే కేవలం ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేయడం కోసం, రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడం కోసం బ్రిటిష్ పాలకుల అడుగుజాడలలోనే ఉపయోగిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. కేవలం ఇదొక్కటి మాత్రమే కాదు స్వాతంత్య్రం అనంతరం తీసుకొచ్చిన పలు నిరంకుశ చట్టాలను కూడా ఈ సందర్భంగా సమీక్ష చేయవలసిన అవసరాన్ని సుప్రీం కోర్ట్, ప్రభుత్వం గుర్తించాలి. నిరంకుశ బ్రిటిష్ పాలకులు తీసుకొచ్చిన అనేక చట్టాలను మార్చకుండా ౠస్వాభిమాన్ భారత్’ లేదా ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నట్లు ౠనూతన భారత్’ నిర్మించడం సాధ్యం కాదు.

ప్రస్తుతంకు ఈ చట్టంపై కేవలం కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం మాత్రమే కోరిన సుప్రీం కోర్ట్, ఈ చట్టం మౌలిక స్వభావం పట్ల స్వయంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ తన వ్యతిరేకతను వెల్లడించారు. ప్రతిపక్షాలు సహజంగానే ఇటువంటి కోర్ట్ తీర్పులను స్వాగతిస్తాయి. ఈ చట్టాన్ని గత ఏడేళ్లలో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో పాటు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు సహితం విచక్షణారహితంగా ఉపయోగిస్తూ ఉండడంతో సహజంగానే ఆందోళన వ్యక్తం అవుతున్నది. అయితే గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సహితం అందుకు భిన్నంగా వ్యవహరింప లేదని గమనించాలి. సుప్రీం కోర్ట్ ఈ వాఖ్యలు చేస్తున్న సమయంలోనే హర్యానా ప్రభుత్వం ఒక మంత్రిని అడ్డుకొన్న 100 మందికి పైగా రైతులపై ఈ చట్టంను ప్రయోగించడం గమనించే ఎంత బాధ్యతారహితంగా ఉపయోగిస్తున్నారో స్పష్టం అవుతుంది. చివరకు మీడియాపై కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగించాయి. ఈ చట్టం క్రింద అరెస్ట్ అయినా వారికి బెయిల్ సదుపాయం లేకపోవడంతో ఎటువంటి రక్షణలు లేకుండా, సాధారణ పోలీసులు సహితం ఇష్టానుసారం ఉపయోగిస్తూ ఉండడంతో దేశంలో అలజడి రేగుతున్నది.

ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వ్రాసిన జర్నలిస్ట్ లపై కూడా పలు చోట్ల ప్రయోగించారు. ఈ చట్టం క్రింద నమోదయిన కేసులలో 90 శాతంకు పైగా న్యాయస్థానాల ముందు నిలబడకపోవడం చూస్తే ఎంత దారుణంగా దుర్వినియోగం అవుతుందో అర్థం అవుతుంది. నిర్దిష్టమైన నేరారోపణలతో ఎవ్వరిపై అయినా కేసులో నమోదు చేసి, చట్టబద్ధంగా విచారణ జరిపి, కోర్టుల ముందు దోషులుగా నిలబెట్టడం ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. అయితే నేరారోపణ లేకుండా సంవత్సరాల తరబడి నిర్బంధంలో ఉంచడం ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను కాలదన్నడమే అవుతుంది. నేడు దేశంలో అదే జరుగుతున్నది. ఉగ్రవాదం, తీవ్రవాదం, ఆర్థిక నేరాల పేర్లతో పలువురిని అరెస్ట్ చేసి, జైళ్లలో దీర్ఘకాలం నిర్బంధించడం, కనీసం ఎందుకు అరెస్ట్ చేశారో కూడా న్యాయస్థానం ముందుంచకపోవడం జరుగుతున్నది.

ఈ మధ్యనే 84 సంవత్సరాల ఫాదర్ స్టెన్ స్వామి న్యాయ నిర్బంధంలో ఉంటూ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ భృతి పట్ల తమకు మాటలు రావడం లేదని అంటూ ముంబై హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఎల్గార్ పరిషద్ కేసులో గత అక్టోబర్ లో ఎన్‌ఐఎ అరెస్ట్ చేసింది. ఆయనపై ఉగ్రవాదం, రాజద్రోహం వంటి పలు నేరారోపణలు చేసింది. అయితే అరెస్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయనను ఆ ఏజెన్సీ వారు గాని, ఇతరులు కానీ కనీసం ప్రశ్నించనే లేదు. కోర్ట్ లో కూడా విచారణ జరుపలేదు. అసలు ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చిందో కూడా వివరింపలేదు. ఈ సందర్భంగా ఆయన గిరిజన ప్రాంతాలలో క్రైస్తవ సంస్థల ముసుగులో సాగిస్తున్న పలు కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. అవన్నీ నిజమే కావచ్చు. అటువంటి ఆరోపణలపై లోతయిన విచారణ జరిపితే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. అయితే అటువంటి ఆరోపణలు ఏవీ ఆయన మరణంకు దారితీసిన పరిస్థితులను సమర్దింపలేవు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో తీవ్రవాదాన్ని కట్టడి చేయడం కోసం 1950 ప్రారంభంలో తాత్కాలిక ప్రయోజనం కోసమంటూ తీసుకొచ్చిన సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టంను ఇంకా విస్తృతంగా ప్రయోగిస్తున్నారు.

కనీసం ఈ చట్టంను ఏ విధంగా అమలు చేస్తున్నారు? ఇప్పటి వరకు ఎటువంటి ప్రయోజనం సాధించారు? అని సమీక్ష చేయాలని సుప్రీం కోర్ట్ కోరినా కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఈ చట్టం క్రింద సైనికులు ఎవ్వరినైనా అరెస్ట్ చేయవచ్చు, ఎక్కడైనా సోదాలు చేయవచ్చు, ఎవ్వరినైనా కాల్చి చంపవచ్చు. వారిని అదేమని అడిగే అధికారం న్యాయస్థానాలకు కూడా లేదు. ఈ చట్టం వల్లనా ఈశాన్య రాష్ట్రాలలో స్థానిక ప్రజలలో సైన్యం పట్ల వ్యతిరేకత పెరగడం, కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రతికూల భవనాలు వ్యాప్తి కావడం మిన్నగా సాధించిన ప్రయోజనం అంటూ ఏమీ లేదు. స్వయంగా ఈ మాటలను ఒక పుష్కరకాలం క్రితం ప్రస్తుతం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో వ్రాసిన వ్యాసంలో అనడం గమనార్హం. అయితే నేడు ఆమె అటువంటి భావాలను వ్యక్తం చేయగలరని ఆశింపలేము. కేవలం సైనికులలో జవాబుదారితనం లేకుండా చేయడంకు మాత్రమే ఈ చట్టం ఉపయోగ పడుతుంది.

దేశంలో పలు రాష్ట్రాలలో అమలులో ఉన్న ముందస్తు నిర్బంధ చట్టాలు అన్ని దాదాపు దుర్వినియోగంకే దారితీస్తున్నాయి. న్యాయపర సమీక్షకు అవకాశం లేని ఎటువంటి చట్టాలు ప్రజాస్వామ్యం వికసించడానికి దోహదం చేయవని గమనించాలి. ఇదే సమయంలో దేశంలో మహిళలపై అత్యాచారాల నుండి ఎటువంటి తీవ్ర స్వభావం గల నేరానికైనా మరణ శిక్ష విధించాలని డిమాండ్లు సర్వత్రా వినవస్తున్నాయి. దేశ వ్యాప్తంగా తీవ్ర అలజడి సృష్టించిన ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ కేసు తర్వాత సహితం ఇటువంటి డిమాండ్ ముందుకు వచ్చింది. ప్రభుత్వాలు సహితం ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ అటువంటి చట్టం తీసుకు వచ్చింది. కేవలం మరణ శిక్ష నిబంధన చేర్చడం ద్వారా మహిళలపై అత్యాచారాలు తగ్గాయా? పైగా సాక్ష్యం ఇవ్వడమే ప్రమాదభరితంగా మారి, కేసులలో శిక్షలు పడటం తగ్గడం లేదా? నేడు ప్రపంచం మరణశిక్షలు లేని సమాజం వైపు పయనిస్తున్నది. 80 శాతంకు పైగా దేశాలు మరణ శిక్షను తమ చట్టాల నుండి తొలగించడమే లేదా అమలు చేయకుండా ఉండడంతో చేస్తున్నాయి.

మరణ శిక్షను రద్దు చేయడం లేదా అమలు పరచక పోవడం కారణంగా నేరాలు పెరిగిన్నట్లు ప్రపంచంలో ఎటువంటి అధ్యయనం వెల్లడి చేయలేదు. పైగా మరణ శిక్ష అమలు పరచడం ద్వారా నేరాలు తగ్గిన్నట్లు కూడా రుజువు కాలేదు. కారణాలు ఏమైతే నేమి, యుపిఎ ప్రభుత్వం చారిత్రాత్మకమైన అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం, విద్య చట్టం వంటి వాటిని తీసుకు వచ్చింది. కానీ రాను, రాను వాటి అమలు పట్ల ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదు. ప్రజల హక్కులకు భంగం కలిగింతే జోక్యం చేసుకోవలసిన మానవ హక్కుల కమీషన్లు సహితం నిర్వీర్యం అవుతున్నాయి. పైగా వాటిని నిర్వీర్యం చేస్తున్నాయి. కొన్నేళ్లుగా అటవీ హక్కుల చట్టం గురించి ఎవ్వరు పట్టించుకోవడం లేదు. విద్యాహక్కు చట్టం నిబంధనలను ప్రభుత్వ పాఠశాలలే అమలు పరచడం లేదు. నూతన విద్యావిధానంలో ఈ చట్టంకు తగు ప్రాధాన్యత కనిపించడం లేదు. ఇక, సమాచార కమీషన్ లు, మానవ హక్కుల కమీషన్ లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. వీటిని కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసి, సమాచార గోప్యతను గతంలో ఎన్నడూ లేని విధంగా చేస్తున్నారు.

చివరకు కరోనా మహమ్మారి సమయంలో వాస్తవ పరిస్థితులను కూడా తెలపకపోవడాన్ని చూసాము. సమాచార కమిషనర్ లను ప్రభుత్వ అధికారులుగా కుదించివేసారు. వారు స్వతంత్రంగా వ్యవహరింపలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల హక్కులకు, స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు భంగం కలిగిస్తున్న ఇటువంటి అన్ని చట్టాలను పూర్తి స్థాయిలో సమీక్ష జరపడానికి సుప్రీం కోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పూనుకోవాలి. భారత స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా మన స్వాత్రంత్య పోరాట యోధులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అదే కాగలదు.
                                                                                                         చలసాని నరేంద్ర

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News