షాంఘై నగరవాసులకు ప్రభుత్వం హెచ్చరిక
షాంఘై (చైనా): కొవిడ్ మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చైనా దేశం లోని ఆర్థిక కేంద్రమైన షాంఘై నగరంలో ప్రజలకు “కలిసి నిద్రించ వద్దు… కౌగిలింతలు, ముద్దులు పెట్టుకోవద్దు ” అంటూ ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో సందడిగా ఉండే షాంఘై నగరవీధులు లాక్‌డౌన్ ఆంక్షలతో ఖాళీగా కనిపిస్తున్నాయి. షాంఘై వీధుల్లో కేవలం ఆరోగ్య కార్యకర్తలు మాత్రమే కనిపిస్తున్నారు. కరోనా కట్టడి కోసం షాంఘై వాసులు కఠినమైన జీవితాన్ని గడుపుతున్నారు. చైనా దేశం లోని షాంఘై నగరం కరోనా వ్యాప్తికి హాట్‌స్పాట్‌గా మారింది. దీంతో నగరం లోని 20 మిలియన్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. కొవిడ్ ప్రబలకుండా పరిమితులు పాటించాలని కోరుతూ డ్రోన్లు తిరుగుతున్నాయి. ఇంటి కిటికీలను కూడా తెరువ వద్దని కోరారు. ఈ రాత్రి నుంచి జంటలు విడివిడిగా పడుకోవాలి. ముద్దుపెట్టుకోవద్దు, కౌగిలింతలు అనుమతించం. విడిగా తినాలి. ఆంక్షలు పాటిస్తున్నందుకు ధన్యవాదాలు అని ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు హౌసింగ్ సొసైటీ నివాసితులకు చెప్పారు. షాంఘై వీధుల్లో నాలుగు కాళ్ల రోబోలు గస్తీ తిరుగుతూ ఆరోగ్యప్రకటనలు చేస్తున్నవీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.