Sunday, April 28, 2024

నా బలం తెలియదు కానీ బలహీనత తెలుసు

- Advertisement -
- Advertisement -

Sharat Mandava interview about 'Ramarao On Duty'

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ’రామారావు ఆన్ డ్యూటీ’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్పీ, రవితేజ టీం వర్క్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శరత్ మండవ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…
మిస్సింగ్ కేసుని డీల్ చేసే…
రవితేజ లాంటి మాస్ స్టార్ చేస్తున్న లార్జర్ దెన్ లైఫ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ’రామారావు ఆన్ డ్యూటీ’. ఒక మిస్సింగ్ కేసుని పోలీసులు లేదా క్రైమ్ డిపార్ట్‌మెంట్ డీల్ చేస్తుంది. కానీ సివిల్ ఆఫీసర్‌గా రామారావు ఈ కేసుని ఎందుకు డీల్ చేశాడనేది ఈ సినిమాలో చాలా యునిక్ పాయింట్. కొన్ని యధార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించాం. ఇందులో ఒక సంఘటన నా అనుభవంలో కూడా వుంది.
అందుకే ఈ పాత్రకు రామారావు అని పేరు పెట్టా…
రామారావు అనేది పవర్ ఫుల్ పేరు. ఆ పేరుకి పరిచయం అవసరం లేదు. పెద్దాయన లేకపోయినా ఒక సర్వే పెడితే నెంబర్ వన్ తెలుగు పర్సనాలిటీగా ఆయన పేరు వచ్చింది. తర్వాత అదే పేరుతో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ బిగ్ హీరో. అలాగే కేటీఆర్ కూడా గ్రేట్ లీడర్. రామారావు అనేది ఒక స్ఫూర్తిని నింపే వ్యక్తిత్వం. అందుకే ఈ పాత్రకు రామారావు అని పేరు పెట్టాను.
లక్కీగా ఆయన ఒప్పుకున్నారు…
ఇందులో చాలా కీలకమైన సిఐ పాత్ర వుంది. ఈ పాత్రకు ఎవరైతే బావుంటుదని ఆలోచిస్తున్నప్పుడు వేణు గుర్తొచ్చారు. ‘స్వయంవరం’ లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన వేణు ఈ పాత్రకు అయితే బావుంటుదని వెళ్లి ఆయన్ని కలిశాను. లక్కీగా ఆయన ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. ఎమోషన్స్‌ని అద్భుతంగా పడించే నటుడాయన.
అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్…
మాళిని పాత్రకు రజిషా విజయన్ సరిగ్గా సరిపోతుందని అనిపించింది. మొదట ఆమె ఒప్పుకోలేదు. కథ పూర్తిగా చెప్పిన తర్వాత ఆమెకు చాలా నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఇక ఇందులో ఫైట్లు అన్నీ కథలోనే వస్తాయి. నిజానికి పెద్ద స్టంట్ మాస్టర్లు ఇతర ఫైట్ మాస్టర్లతో కలిసి పనిచేయడానికి ఒప్పుకోరు. కానీ ఐదు మంది స్టంట్ మాస్టర్లు ఈ సినిమా చేయడానికి ఒప్పుకొని అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లని డిజైన్ చేశారు.
దాసరి మాటలు నాకు స్ఫూర్తి…
కథని బలంగా నమ్ముతాను. కథ నుండి పక్కకు వెళ్ళను. నా వరకూ కథ ఒక దేవాలయం లాంటింది. దానికంటూ ఒక నిర్మాణం వుంటుంది. లెజండరీ దర్శకులు దాసరి నారాయణ రావు మాటలు నాకు స్ఫూర్తి. “ఒక కథ రాసేటప్పుడు ఆ కథే తనకు కావాల్సిన అన్ని సమకూర్చుకుని పూర్తి చేసుకుంటుంది. హిట్, ఫ్లాప్ మన చేతిలో లేదు… మంచి, చెడు మాత్రం మన చేతిలో వుంటుంది”అని దాసరి చెప్పిన ఈ మాటలు జీవితాంతం పాటిస్తాను.
నా బలం తెలియదు కానీ బలహీనత తెలుసు…
నా బలం ఏమిటో తెలీదు కానీ నా బలహీనత తెలుసు. శేఖర్ కమ్ముల లాంటి సినిమాలు చేయలేను. లైటర్ వెయిన్ ఎమోషన్స్‌ని డీల్ చేయడం నా వరకు కష్టం. యాక్షన్, థ్రిల్లర్స్ చేయగలను. ఒక ఫైట్ లేకుండా కూడా యాక్షన్ సినిమా చేయొచ్చు. రాజ్ కుమార్ హిరాణీ తరహాలో ఒక కథ రాసుకున్నా.

Sharat Mandava interview about ‘Ramarao On Duty’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News