Wednesday, May 8, 2024

స్పైస్‌జెట్ క్యాబిన్‌లో పొగల ఘటన… డీజీసీఎ సీరియస్

- Advertisement -
- Advertisement -

Smoke incident in SpiceJet cabin... DGCA is serious

న్యూఢిల్లీ : గత వారం స్పైస్‌జెట్ సంస్థకు చెందిన ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. క్యాబిన్‌లో పొగలు కమ్మేయడంతో విమానాన్ని హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించేశారు. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటన నేపథ్యంలో స్పైస్‌జెట్‌కు పలు ఆదేశాలు జారీ చేసింది. సంస్థకు చెందిన క్యూ 400 విమానాల్లో ఇంజిన్ ఆయిల్ శాంపిళ్లను తనిఖీ చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 12న గోవా నుంచి హైదరాబాద్ వస్తోన్న విమానంలో క్యాబిన్‌లో పొగలు కమ్ముకున్నాయి. దీంతో విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దించారు. దీనిపై డీజీసీఎ దర్యాప్తు చేపట్టగా ఇంజిన్ బ్లీడ్‌ఆఫ్ వాల్వ్‌లో ఇంజిన్ ఆయిల్ ఉన్నట్టు గుర్తించారు. దీనివల్లే ఎయిర్ క్రాఫ్ట్ ఏసీ వ్యవస్థ లోకి ఆయిల్ వెళ్లి క్యాబిన్‌లో పొగలు వచ్చినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో స్పైస్‌జెట్ కు డీజీసీఎ సోమవారం పలు ఆదేశాలిచ్చింది. సంస్థకు చెందిన క్యూ 400 మోడల్ విమానాల ఇంజిన్ ఆయిల్ శాంపిళ్లను వెంటనే ఆయిల్ అనాలసిస్ టెక్నాలజీ తనిఖీల కోసం పంపించాలని సూచించింది.

ఇంజిన్ ఆయిల్‌లో ఏదైనా లోహ, కార్బన్ పరమాణువులు ఉన్నాయో లేదో ఈ పరీక్షలు నిర్ధారిస్తాయి. దీంతో పాటు బ్లీడ్ ఆఫ్ వాల్వ్‌లను కూడా తనిఖీ చేయాలని సూచించింది. ఈ తనిఖీలు పూర్తయ్యేవరకు ఏ విమాన ఇంజిన్‌లను స్టాండర్డ్ ఏరో సింగపూర్‌కు పంపించొద్దంటూ ఆదేశించింది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా సంస్థపై తగిన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. స్పైస్‌జెట్‌లో ప్రస్తుతం క్యూ 400 మోడల్‌లో 14 విమానాలు సర్వీస్‌లో ఉన్నాయి. ఆ మధ్య స్పైస్‌జెట్ విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు బయటపడిన విషయం తెలిసిందే. 18 రోజుల వ్యవధిలో ఎనిమిది స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు వెలుగు చూశాయి. దీంతో ఆందోళన చెందిన డీజీసీఏ … సంస్థపై కొన్ని ఆంక్షలు విధించింది. 50 శాతం సామర్ధంతో మాత్రమే విమానాలు నడపాలని ఆదేశించింది. ఈ ఆంక్షలు అక్టోబర్ 29 వరకు అమల్లో ఉండనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News