Tuesday, April 30, 2024

అసలు మీది ఇండియానే కాదు: స్మృతి ఇరానీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారంటూ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగాకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారని ఆమె మండిపడ్డారు. లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించిన తర్వాత తొలిసారిగా బుధవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, మణిపూర్ భారత దేశంలో భాగమనే విషయాన్ని ప్రధాని పూర్తిగా మరిచిపోయారని, మణిపూర్‌లో భారత మాతను చంపేశారనివిమర్శించారు. బిజెపి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఒకే దేశంలో రెండు మణిపూర్‌లను సృష్టించిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ మాట్లాడిన తర్వాత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ రాహుల్ వ్యాఖ్యలను అంతే స్థాయిలో తిప్పికొట్టారు. మణిపూర్ విభజింపబడలేదు.. ఒక్కటిగానే ఉందన్నారు.‘ఆయన మణిపూర్‌లో మాత చంపబడిందన్నారు. దానికి ఆయన మద్దతుదారులంతా చప్పట్లు కూడా కొట్టారు. కుటుంబ పాలనలో దేశం చాలా నాశనమయింది.

అందుకే కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి. అవినీతికి స్వస్తి పలకాలి. మీరనుకున్న ఇండియా కాదిది. అవినీతి రహిత ఇండియా.ఇక్కడ కుటుంబ పాలనకు స్థానం లేదు. అసలు మీరు ఇండియాకు చెందిన వారే కాదు. నాడు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నినదించినట్లు ఇప్పుడు మీ కుటుంబ పాలనకు, అవినీతి పాలనకు వ్యతిరేకంగా మరోసారి క్విట్ ఇండియా అంటూ నినదించాలి’ అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురించి కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ ఆయన కీళ్ల నొప్పులు గురించి నేను మాట్లాడను. అయితే కాశ్మీర్ లోయ రక్తంతో తడిసి ముద్దవడం దేశ ప్రజలు చూశారు. కానీ వాళ్లు( రాహుల్ గాంధీ) అక్కడికి వెళ్లినప్పుడు వాళ్లు మంచు బంతులతో ఆడుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆర్టికల్ 370ను రద్దు చేయడం వల్లనే అది సాధ్యమయింది. తాను కశ్మీర్‌కు యాత్ర చేశానని, తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చామని చెప్తున్నారు. ఆర్టికల్ 370 ఎప్పటికీ పునరుద్ధరించడం జరగదు’ అని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.ఆమె ఈ సందర్భంగా ఎమర్జెన్సీ సమయంలో జరిగిన దారుణాలు, 1984 నాటి సిక్కు వ్యతిరేక ఘర్షణలు, కాంగ్రెస్ హయాంలో కశ్మీర్‌లో జరిగిన అల్లర్ల గురించి కూడా మంత్రి ప్రస్తావించారు.

నేడు మణిపూర్‌లో జరిగింది
రేపు మిజోరాం, నాగాలాండ్‌లో కూడా జరగొచ్చు
కాగా అవిశ్వాస తీర్మానంపై చర్చలో జెడి(యు) సభ్యుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ మాట్లాడుతూ మణిపూర్‌లో పరిస్థితిని తేలిగ్గా తీసుకోరాదన్నారు. ‘ఈ రోజు మణిపూర్‌లో జరిగిన ఘటన రేపు మిజోరాంలో.. ఆ మర్నాడు నాగాలాండ్‌లో జరగవచ్చు. అది మొత్తం ఈశాన్య సరిహద్దుపైనా ప్రభావం చూపిస్తుంది. సమస్య తీవ్రతను మీరు అర్థం చేసుకోవడం లేదు’ అని ఆయన అన్నారు. మణిపూర్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని, అయినా అక్కడి ప్రజలు ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని కోల్పోతున్నారన్నారు. ఈ విషయంలో ప్రధాని మోడీ మౌనం పాటించడంపై కూడా ఆయన మండిపడ్డారు.‘ మణిపూర్ మండుతోంది. అయినా ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంత పెద్ద సంఘటన జరిగినా ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేశంలోని ఇతర ఘటనలతో పోలుస్తూ మణిపూర్‌లో జరిగిన ఘటనలను మీరు సమర్థించుకుంటున్నారు. ఈ విషయంలో మాట్లాడాల్సిన బాధ్యత ప్రధానికి లేదా?’ అని ఆయన అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News