Wednesday, May 15, 2024

ఫుల్‌టైమ్ ప్రెసిడెంట్‌ను నేనే

- Advertisement -
- Advertisement -
Sonia Gandhi says she is full-time president
నేను చురుగ్గానే పని చేస్తున్నా
మీడియా ద్వారా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు
సిడబ్లుసి సమావేశంలో జి23 నేతలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చురకలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలంటున్న నేతలకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఘాటుగా జవాబిచ్చారు. శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సిడబ్లుసి) సమావేశంలో మాట్లాడుతూ, పార్టీకి పూర్తిస్థాయి అద్యక్షురాలిని తానేనని, తాను చురుగ్గా పని చేస్తున్నానని చెప్పారు. మీడియా ద్వారా తనతో మాట్లాడాల్సిన అవసరం పార్టీ నేతలకు లేదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రావాలని పార్టీ నేతలంతా కోరుకుంటున్నారని, అయితే దీనికోసం ఐకమత్యం అవసరమని, పార్టీ ప్రయోజనాలకు పెద్దపీట వేయడం ముఖ్యమని అన్నారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి రెగ్యులర్ కాంగ్రెస్ చీఫ్‌ను ఎన్నుకునేందుకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసిన విషయాన్ని సోనియా గుర్తు చేస్తూ అయితే కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ ప్రక్రియను నిరవధికంగా వాయిదా వేసినట్లు చెప్పారు.

సంస్థాగత ఎన్నికల గురించి పూర్తి స్పష్టత ఇచ్చే సమయం వచ్చిందని తెలిపారు. ‘ నేను పూర్తికాలం పని చేసే, చురుగ్గా వ్యవహరించే అధ్యక్షురాలిని’ అని సోనియా తెలిపారు. తాను నిజాయితీని ఇష్టపడతానని, తనకు ఏదైనా చెప్పాలనుకుంటే మీడియా ద్వారా తనతో మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. మనమంతా కలిసి నిజాయితీగా, స్వేచ్ఛగా చర్చించుకుందామన్నారు. ఈ గది నాలుగు గోడల వెలుపల తెలియజేయాల్సింది సిడబ్లుసి సమష్టి నిర్ణయమేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో వరస పరాజయాలు ఎదురవుతుండడంతో ఆ పార్టీకి చెందిన 23 మంది నేతలు గత ఏడాది ఆగస్టులో సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వీరు డిమాండ్ చేశారు. గత నెలలో పంజాబ్ ముఖ్యమంత్రి మార్పు నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ పార్టీకి ప్రెసిడెంట్ లేరని, ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదని అన్నారు.

వెంటనే సిడబ్లుసిని సమావేశపరచాలని డిమాండ్ చేశారు. మరో సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కూడా దాదాపుగా ఇదే డిమాండ్ చేశారు. గత ఏడాది సోనియాకు లేఖ రాసిన 23 మంది నేతల్లో సిబల్ ఒకరు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాధ్రా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లోట్( రాజస్థాన్), భూపేశ్ బాఘెల్(చత్తీస్‌గఢ్), చరణ్‌జిత్ చన్నీ (పంజాబ్) ఈ రోజు సమావేశంలో పాల్గొన్నారు. అంతేకాకుండా గత ఏడాది సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ కూడా కొవిడ్ మహమ్మారి ప్రబలిన తర్వాత తొలిసారి భౌతికంగా జరిగిన ఈ సమావేశానికి హాజరయ్యారు.

కేంద్ర విధానాలపై విమర్శలు

కాగా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపైనా సోనియా గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మూడు నల్ల చట్టాలను పార్లమెంటు ఆమోదించి ఏడాదైంది. రైతుల, రైతు సంఘాల ఆందోళనలు కొసాగుతున్నాయి. కొన్ని ప్రైవేటు సంస్థల ప్రయోజనాల కోసమే ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చారు. నల్ల చట్టాల ఆమోదానికి అందర్నీ నరక యాతన పెట్టారు. నిరసనలతో రైతులు ఎంతో నష్టపోయారు. లఖింపేర్ ఖేరీ ఘటన బిజెపి మనస్తత్వాన్ని బయటపెట్టింది. రైతుల పట్ల ఆ పార్టీకి ఎలాంటి ఆలోచన ఉందో ఈ సంఘటనద్వారా తెలిసింది’ అని దుయ్యబట్టారు. ‘దేశ ఆర్థిక పరిస్థితి ఎంతో ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి చర్యలు తీసుకోవడం లేదు. దశాబ్దాల కలంగా నిర్మించిన ఆస్తులను అమ్మేస్తున్నారు.ఆర్థిక పునరుద్ధరణకు ప్రభుత్వం వద్ద సమాధానం,లేదు.

ఎస్‌సి, ఎస్‌టి, వెనుకబడిన వర్గాల సాధికారత ప్రమాదంలో పడింది. రక్షిస్తున్నామనే పేరుతో మరింత ప్రమాదంలోకి నెడుతున్నారు’ అని సోనియా విమర్శించారు. పెట్రోల్, గ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలను పెంచేశారు. రాష్ట్రాల డిమాండ్‌తోనే టీకాసేకరణలో కేంద్రం మార్పులు చేసింది. మైనారిటీలే లక్షంగా జమ్మూ, కశ్మీర్‌లో జరుగుతున్న హత్యలను ఖండిస్తున్నాం. అనాగరిక నేరాలకు పాల్పడుతున్న వారిని కేంద్రం కఠినంగా శిక్షించాలి. పొరుగు దేశాలతో అనుసరించే విధానాలపై కేంద్రం విపక్షాలను పట్టించుకోవడం లేదు. సరిహద్దులోల ఇతర రంగాల్లో దేశం సవాళ్లను ఎదుర్కొంటోంది. చైనా ఎలాంటి ఆక్రమణలు చేయలేదని ప్రధాని గతంలో చెప్పారు. ప్రధాని మౌన దేశాన్ని తీవ్రంగా నష్టపరుస్తోంది అని ఆమె అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News