Wednesday, May 8, 2024

సురక్షితంగా భూమికి చేరిన అంతరిక్ష పర్యాటకులు

- Advertisement -
- Advertisement -
Space tourists come back to Earth
మానవ సహిత రోదసీ యాత్రల్లో ఇదో కొత్త అధ్యాయం

కేప్‌కెనెవరాల్ : పూర్తి స్థాయి సుశిక్షితులైన వ్యోమగాములు లేకుండా సాధారణ పౌరులతో మూడు రోజుల పాటు భూమి చుట్టూ పరిభ్రమించిన స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూడ్రాగన్ వ్యోమనౌక భూమికి చేరింది. అందులో ప్రయాణించిన నలుగురు వ్యక్తులూ సురక్షితంగా ఉన్నారు. శనివారం ఫ్లోరిడా తీరానికి చేరువలో అట్లాంటిక్ మహా సముద్రంలో క్యాప్సూల్ సురక్షితంగా ల్యాండ్ అయింది. వ్యోమగాములు లేకుండా సాధారణ పౌరులు ఇలా రోదసీ లోకి వెళ్లలడం ఇదే మొదటిసారి. అపర కుబేరుడు జేర్డ్ ఇజాక్‌మన్ నేతృత్వంలో ఈ రోదసీ యాత్ర సాగింది. మానవ సహిత రోదసీ యాత్రల్లో ఇదో కొత్త అధ్యాయం. దీంతో అంతరిక్ష పర్యాటకం దిశగా ముందడుగు పడింది. ఈ యాత్రలో స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్‌మస్క్ కూడా కోట్ల డాలర్ల విలువైన అంతరిక్ష పర్యాటక వ్యాపారం లోకి దిగాడు.

ఇన్‌స్పిరేషన్4 పేరిట ఈ రోదసీ యాత్ర సాగింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి అమెరికా లోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్ రాకెట్ ద్వారా క్రూ డ్రాగన్ వ్యోమనౌక నింగి లోకి వెళ్లింది. ప్రయోగించిన 10 నిమిషాలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక భూ కక్ష లోకి ప్రవేశించింది. చివరకు ఇది భూమికి 575 కిమీ ఎత్తు లోకి చేరింది. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) ఉన్న కక్ష కన్నా 160 కిమీ ఎక్కువ ఎత్తు కావడం గమనార్హం. హబుల్ టెలిస్కోపు ఉన్న ప్రాంతాన్నీ క్రూ డ్రాగన్ దాటి వెళ్లింది. అక్కడ గంటకు 27,360 కిమీ వేగంతో 90 నిమిషాల కోసారి భూమిని చుట్టింది. ఇది ధ్వని కన్నా 22 రెట్లు ఎక్కువ వేగం. మొత్తమ్మీద వ్యోమగాములు మూడు రోజుల పాటు భూ కక్షలో గడిపారు. యాత్ర అనంతరం వీరి వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో సాగర జలాల్లో దిగింది. వెంటనే సహాయ సిబ్బంది వీరిని సమీపం లోని ఒక నౌక లోకి చేర్చారు.

నలుగురు యాత్రికులు స్పేస్‌ఎక్స్ వద్ద ఆరు నెలలపాటు శిక్షణ పొందారు. డ్రాగన్ వ్యోమనౌక నియంత్రణ మొత్తం అందులోని కంప్యూటర్ వ్యవస్థలే నిర్వహించాయి. దీన్ని నేలపై నుంచి స్పేస్‌ఎక్స్ సిబ్బంది పర్యవేక్షించారు. క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)తో అనుసంధానం కావడానికి ఏర్పాటు చేసిన డాకింగ్ వ్యవస్థలను తొలగించి , గుమ్మటం ఆకారంలో ఒక గాజు కిటికీని అమర్చారు. దాని ద్వారా రోదసీని చూడొచ్చు. కక్ష లోకి చేరాక ఈ కిటికీపై ఉన్న తలుపు తెరుచుకోగా, దాని నుంచి వీక్షణ అద్భుతంగా ఉందని ఇజాక్‌మన్ పేర్కొన్నారు. ఈ యాత్రలో వైద్య పరమైన అనేక ప్రయోజనాలను నిర్వహించారు. యాత్రికుల నుంచి బయోమెడికల్ డేటా, నమూనాలు, అల్ట్రా సౌండ్ స్కాన్‌లను సేకరించనున్నారు. ఈ వివరాలను భవిష్యత్ అంతరిక్ష యాత్రల కోసం ఉపయోగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News