Thursday, May 2, 2024

సంపాదకీయం: శ్రీలంక కీలక రాజ్యాంగ సవరణ

- Advertisement -
- Advertisement -

China army again try to shift boundary at LAC

కీలక పాలక నిర్ణయాధికారాలు పార్లమెంటు చేతిలో ఉండే వ్యవస్థ స్థానంలో మళ్లీ అధ్యక్ష నిరంకుశత్వానికి తెరలేపే రాజ్యాంగ సవరణకు, మొత్తంగా సరికొత్త రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకునేందుకు శ్రీలంకలో రంగం సిద్ధమైంది. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించేందుకు నిపుణుల కమిటీని ప్రధాని మహింద రాజపక్స మంత్రి వర్గం నియమించింది. ప్రధానమైన వ్యవహారాలన్నింటిలోనూ పార్లమెంటుకు పై చేయి ఇస్తూ, దేశాధ్యక్షుని అధికారాలను కత్తిరిస్తూ పూర్వపు ప్రభుత్వం 2015లో అమల్లోకి తెచ్చిన 19వ రాజ్యాంగ సవరణను రద్దు చేసే ప్రక్రియ ఇంతకు ముందే మొదలయింది. ముందుగా ఆ పని కానిచ్చివేస్తామని, ఆ తర్వాత కొత్త రాజ్యాంగాన్ని అమల్లోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 19వ సవరణను రద్దు చేయడానికి తీసుకు వచ్చే 20వ సవరణకు పార్లమెంటు చేత ఆమోద ముద్ర వేయిస్తారు.

సరికొత్త రాజ్యాంగాన్ని కూడా వీలైనంత తొందరలోనే అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ఎప్పటికప్పుడు తలెత్తే పరిణామాలు, పరిస్థితులను బట్టి, సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంటు వద్ద ఉండడమే ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం. అటువంటి వ్యవస్థకు ప్రాణం పోస్తూ 2015 ఏప్రిల్ 28వ తేదీన శ్రీలంక పార్లమెంటు 19వ రాజ్యాంగ సవరణకు ఆమోదం తెలిపింది. 1978 నుంచి అప్పటి వరకు కొనసాగిన అధ్యక్ష కేంద్రక, కేంద్రీకృత అధికార వ్యవస్థకు అది చరమగీతం పాడింది. అటు పార్లమెంటు కాలాన్ని, ఇటు దేశాధ్యక్ష పదవీకాలాన్ని ఆరు నుంచి ఐదు సంవత్సరాలకు తగ్గించింది. ఒకే వ్యక్తి అధ్యక్ష స్థానంలో రెండు పదవీ కాలాలకు మించి కొనసాగడానికి వీలు లేకుండా చేసింది. అలాగే పార్లమెంటు ఎన్నికైన నాలుగున్నర సంవత్సరాల తర్వాతనే దానిని రద్దు చేసే అధికారం దేశాధ్యక్షునికి ఉండేలా సవరణ తెచ్చింది. ఆ విధంగా పార్లమెంటుకు సుదీర్ఘమైన, స్థిరమైన ఆయుష్షును కల్పించింది.

రాజ్యాంగ మండలిని పునరుద్ధరించింది. స్వతంత్ర కమిషన్లకు ప్రాణం పోసింది. ఈ మొత్తం ప్రజాస్వామిక ఏర్పాటును ప్రస్తుత రాజపక్సల ప్రభుత్వం రద్దు చేయదలచింది. కొత్త సవరణ ప్రకారం పార్లమెంటును దానిని ఎన్నుకున్న ఏడాది కాలానికే రద్దు చేసి ఎన్నికలు జరిపించే అధికారం దేశాధ్యక్షునికి సంక్రమిస్తుంది. కీలక పదవుల్లో నియామకాల అధికారం కూడా అధ్యక్షునికి దఖలుపడుతుంది. పూర్వపు అధ్యక్ష, ప్రధానులు మైత్రీపాల సిరిసేన, రణిల్ విక్రమ సింఘే తీసుకు వచ్చిన సర్వ ప్రజాస్వామికమైన 19వ రాజ్యాంగ సవరణకు 2015లో పార్లమెంటులోని మొత్తం 225 మంది సభ్యులలో 215 మంది మద్దతు తెలిపారు. ఇప్పుడు దానిని రద్దు చేయనున్న 20వ సవరణ కూడా పార్లమెంటులో మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు సునాయాసంగా పొందుతుంది. గత నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ప్రధాని మహింద రాజపక్స నాయకత్వంలోని శ్రీలంక పొదుజన పెరమున (ఎస్‌ఎల్‌పిపి) పార్టీ 145 స్థానాలు గెలుచుకుంది. ఇది ఐదు స్థానాలు తక్కువగా మూడింట రెండొంతుల బలం. అందుచేత 20వ రాజ్యాంగ సవరణగాని, కొత్త రాజ్యాంగం గాని పార్లమెంటు ముద్రను సునాయాసంగా సాధించుకోగలుగుతాయి.

ఓడలు బళ్ల్లు, బళ్లు ఓడలు కావడమంటే ఇదే. గతంలో ప్రజాస్వామిక ఆదర్శాలు గల రాజకీయ అమరికను గెలిపించుకున్నవారే ఇప్పుడు నిరంకుశ రాజకీయాలను నెత్తిన పెట్టుకున్నారు. ఇందుకు మూలాలు గత ఏడాది ఏప్రిల్‌లో శ్రీలంకను రక్తసిక్తం చేసిన ఉగ్రవాద దాడుల్లో ఉన్నాయి. ఐసిస్ అనే అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జరిపించినవని భావించిన ఆ దాడులు చర్చీల మీదా, పెద్ద పెద్ద హోటళ్ల మీద జరిగాయి. 300 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. 500 మంది గాయపడ్డారు.

అప్పటి అధ్యక్ష, ప్రధానులు సిరిసేన, రణిల్ విక్రమ సింఘేల మధ్య ఐక్యత లోపించి వారు పాలనపై పట్టు కోల్పోవడం వల్లనే ఆ దాడులను గురించి ముందుగా సమాచారమున్నా వాటిని నిరోధించలేకపోయారని ప్రజలు భావించారు. దాని ఫలితంగానే గత ఏడాది నవంబర్‌లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో కరడుగట్టిన మైనారిటీల వ్యతిరేకి గోటాబయ రాజపక్స (ప్రధాని మహింద రాజపక్స సోదరుడు) 52 శాతం ఓట్లతో గెలుపొందాడు. అదే క్రమంలో గత నెల పార్లమెంటు ఎన్నికల్లో వారి పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. 19వ రాజ్యాంగ సవరణను రద్దు చేస్తామని ఈ ఎన్నికల్లో మహింద రాజపక్స పార్టీ వాగ్దానం చేసింది. ఆ మేరకే 19వ సవరణ రద్దు, కొత్త రాజ్యాంగ రచన అధ్యాయాలు ఊపందుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News