ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బి వీసా నియమాలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో అక్కడి కంపెనీలు మాత్రం సిఇఒ స్థానాలకు భారతీయుల వైపే మొగ్గుచూపుతున్నాయి. తాజాగా అమెరికాలోని రెండు పెద్ద కంపెనీలు భారత సంతతికి చెందిన సిఇఒ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)లను నియమించాయి. దీనిలో మొదటి కంపెనీ అమెరికా టెలికాం దిగ్గజం టిమొబైల్, ఈ కంపెనీకి నవంబర్ 1 నుండి 55 ఏళ్ళ శ్రీనివాస్ శ్రీని గోపాలన్ సిఇఒగా బాధ్యతలు చేపట్టనున్నారు. రెండో కంపెనీ చికాగో కేంద్రంగా ఉన్న బేవరేజ్ దిగ్గజం మోల్సన్ కూర్స్, దీనికి రాహుల్ గోయల్ (49) అక్టోబర్ 1 నుండి కొత్త సిఇఒగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
టిమొబైల్ సిఇఒగా శ్రీనివాస్
ఐఐఎం అహ్మదాబాద్ ఆలుమ్నస్ గోపాలన్, ప్రస్తుతం టిమొబైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. 2020 నుండి కంపెనీని నడిపించిన మైక్ సీవర్ట్, కొత్తగా రూపొందించిన వైస్ చైర్మన్ స్థానంలోకి మారుతున్నారు. టిమొబైల్ తదుపరి సిఇఒగా బాధ్యతలు చేపట్టడం గౌరవంగా భావిస్తున్నానని గోపాలన్ లింక్డ్ఇన్లో ప్రకటించారు. వినియోగదారులకు కొత్త రీతిలో సేవలందించడానికి సాహసోపేత మార్పులు చేయడం తనకెంతో ఇష్టమైందని అన్నారు. గోపాలన్ వృత్తి జీవితంలో అనేక దేశాలు, రంగాలలో పనిచేసిన అనుభవం ఉంది. హిందుస్తాన్ యూనిలివర్‌లో మేనేజ్మెంట్ ట్రైనీగా ప్రారంభించి, భారతి ఎయిర్టెల్, వోడాఫోన్, కాపిటల్ వన్, డాయ్చ్ టెలికాం వంటి కంపెనీల్లో సీనియర్ పాత్రలు నిర్వహించారు. జర్మనీలో మొబైల్ మార్కెట్ షేర్ రికార్డు సాధించి, ఫైబర్ నెట్‌వర్క్‌ను కోట్ల హోమ్‌లకు విస్తరించారు. టిమొబైల్లో 5జి, ఎఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాలను నడిపించారు. ఈ సందర్భంగా సీవర్ట్ మాట్లాడుతూ.. గోపాలన్‌ను అత్యంత నై పుణ్యవంతుడు, అద్భుత అవగాహనతో ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు.
మోల్సన్ కూర్స్ సిఇఒగా రాహుల్
అమెరికాలో బేవరేజ్ దిగ్గజం మోల్సన్ కూర్స్ రాహుల్ గోయల్‌ను అక్టోబర్ 1 నుండి నూతన అధ్యక్షుడు, సిఇఒగా నియమించింది. 49 ఏళ్ళ గోయల్, గేవిన్ హాటర్స్లే స్థానంలో బాధ్యతలు చేపడుతున్నారు. భారతీయుడైన గోయల్ మైసూర్లో ఇంజనీరింగ్ చదివి, డెన్వర్‌లో బిజినెస్ స్టడీస్ కోసం అమెరికాకు వెళ్లారు. గోయల్‌కు అమెరికా, బ్రిటన్, భారత్‌లో కూర్స్, మోల్సన్ బ్రాండ్లలో అనుభవం ఉంది. మోల్సన్ కూర్స్ బోర్డు చైర్మన్ డేవిడ్ కూర్స్ మాట్లాడుతూ, సిఇఒ వారసత్వ ప్రక్రియ తర్వాత రాహుల్ సరైన అనుభవం, విజన్ సంస్థ తదుపరి వృద్ధికి దోహదం చేస్తుందని స్పష్టమైందని అన్నారు.