Saturday, April 27, 2024

ఎరువులకు కేంద్రం లక్ష కోట్ల రాయితీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగిన.. దేశంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఎరువులపై రాయితీ ప్రకటించిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా బిజెపి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 2014 నుంచి తొమ్మిదేళ్లుగా నీతివంతమైన, సమర్థవంతమైన పాలన ప్రధాని నరేంద్రమోడీ అందించారన్నారు. దేశంలో ఎప్పటి నుంచో వున్న సమస్యలను పరిష్కరించారని.. అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. రాచపుండులా మారిన ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, రామ జన్మభూమి లాంటి సమస్యలను.. రక్తపు చుక్క పడకుండా పరిష్కరించారన్నారు. 2024లో భవ్యమైన రామమందిరం ప్రారంభవం కాబోతోందన్నారు.‘గతంలో జమ్ముకశ్మీర్ రావణ కాష్టంలా ఉండేది.

మహబూబ్ నగర్ పట్టణంతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను కూకటి వేళ్లతో పెకిలించాం. కరోనాను ఎదుర్కొన్నాం. పేద వాడికి బ్యాంకు అకౌంట్ అందించాం. దేశంలో మోడీ పాలనలో డిజిటల్ విప్లవం వచ్చింది. అత్యధిక డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారత్‌లోనే జరుగుతున్నాయి. నిత్యావసర ధరలు అదుపులో పెట్టాం. కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి 42 శాతం చెల్లిస్తున్నామని కేంద్రమంత్రి వెల్లడించారు. ఎరువుల ధరలు పెరుగుతున్నా.. మరో లక్ష కోట్ల రూపాయలు రైతులకు సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. రైతులకు అదనపు భారం పడకూడదని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎకరానికి రైతుకు 18 వేల 254 రూపాయలు రాయితీ అందుతుంది. అలాగే రైతుకు 6 వేలు అదనంగా అందిస్తున్నాం. పంటల బీమా పథకానికి కొంత ఇస్తున్నాం. తామే ప్రపంచానికి ఆదర్శం అని కొందరు అంటున్నారు. తెలంగాణను ఉద్దరించామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది.

ప్రతీ ఏడాది ఏదో విధంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. రైతులకు 10 వేల రూపాయలు ఇస్తున్నాం అంటున్నారు. కేంద్రం రూ. 18 వేల 254 రూపాయలు రాయితీ రూపంలో రైతులకు అందిస్తోందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. సమగ్ర పంటల బీమ పథకం కేంద్రం అమలు చేస్తోంది. గిట్టుబాటు ధర కల్పిస్తోంది. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ‘2 వేల నోట్లను దశల వారీగా ఉపసంహరించుకుంటారు. గతంలో కూడా అనేక సార్లు నోట్లను ఉపసంహరించుకున్నారు. 31 మార్చి 2018 నుంచి 2 వేల నోట్ల ముద్రణ ఆర్బీఐ ఆపేసింది. చాలా మంది మేధావులు, నిపుణులు 2 వేల నోట్లు రద్దు అయితే బాగుండు అన్నారని కేంద్రమంత్రి వెల్లడించారు. ఇది దేశ భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

30 శాతం కూడా ఇప్పుడు చలామణి కావడం లేదు. కొంతమంది చేతుల్లోనే ఉన్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు సహకరించాలి.. బిజెపి బలపడాలంటే.. గ్రామాల్లో యువత పార్టీలో చేరాలి. బిజెపి మహా సంపర్క్ యాత్రకు మద్దతు ఇవ్వండి.. ఆశీర్వదించాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News