Sunday, April 28, 2024

సిద్ధిపేటలో 6200 ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

సిద్ధిపేట: దక్షిణ భారత దేశ ధాన్యగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీర్చిదిద్దారని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. దేశంలో వ్యవసాయం వృద్ధి రేటు 4% శాతం ఉంటే, కేవలం తెలంగాణ రాష్ట్రంలో 7.8% శాతం ఉందని, అన్నీ రంగాలలో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పత్తి మార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పొద్దు తిరుగుడు పువ్వు కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పొద్దు తిరుగుడు పువ్వు సాగు చేసిన రైతులకు శుభవార్తగా చెబుతున్నామని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చాక పొద్దు తిరుగుడు పువ్వు సాగు పెరిగిందని, ఈ యేడు 6200 ఎకరాల్లో రైతులు పొద్దు తిరుగుడు సాగు చేశారని ప్రశంసించారు.

మార్కెట్ ధర తక్కువ ఉన్నదని పొద్దు తిరుగుడు పువ్వు కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ప్రారంభించాలని రైతుల కోరిక మేరకు సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లామని, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిల నిర్ణయంతో ఈ పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో మొదటి పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రం సిద్ధిపేటలో ప్రారంభమైందని, రూ.6400 మద్ధతు ధరతో ప్రభుత్వానికి అమ్మితే రైతులకు ఉపయోగకరమని పేర్కొన్నారు.
జిల్లాలో 60 మెట్రిక్ టన్నుల పొద్దు తిరుగుడు పంట పండుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని, జిల్లాలో 6 వేల మంది రైతులు పొద్దు తిరుగుడు సాగు చేసినట్లు తెలిపారు. సిఎం కెసిఆర్ వచ్చాక రైతుకు భరోసా దొరికిందని, కేంద్రం వడ్లు కొనమని చెప్పినా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొని రైతులకు సహకారాన్ని అందించిందని చెప్పుకొచ్చారు.
సమైక్య రాష్ట్రంలో ఆనాడు అనేక తంటాలు పడేవారని, ఇవాళ తెలంగాణలో ప్రతిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, కెసిఆర్ ప్రభుత్వం సాధించిన అద్భుతమైన విజయమని మంత్రి ధీమాగా చెప్పారు.

ఆనాడు సమైక్య రాష్ట్రంలో యాసంగిలో 10 లక్షలు ఎకరాలు సాగు అయ్యేది కాదని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాసంగిలో 53 లక్షల ఎకరాల వరి సాగు అవుతుందని ప్రశంసించారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా వరి సాగు కావడం లేదని, దేశంలోని ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఆంద్రప్రదేశ్, మధ్యప్రదేశ్ లు భౌగోళికంగా చాలా పెద్దవైన వరి సాగు జరగడం లేదని అన్నారు. ఆనాడు తెలంగాణలో పని దొరకక ఉండేవారనీ, ఇవాళ తెలంగాణలో పని చేసేందుకు 16 రాష్ట్రాల ప్రజలు పని చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ప్రజలకు పని ఇవ్వడంతో పాటు, పక్క రాష్ట్రాలకు ఉపాధి కల్పిస్తుందని హరీశ్ రావు వివరించారు. నాడు-నేడు చూస్తే.. ఒకనాడు వ్యవసాయం దండగ అంటే.. ఇవాళ తెలంగాణలో పండుగ నెలకొందని, తెలంగాణలో నీళ్లు ఫుల్, కరెంటు ఫుల్, చేపలు ఫుల్, పంటలు ఫుల్.. మొత్తంగా తెలంగాణ పవర్ ఫుల్ అని, మడుటెండలల్లో చెరువులు, చెక్ డ్యాములు, వాగులు నిండుగా నీళ్లతో ఉన్నాయని అన్నీ వర్గాల ప్రజలకు పని లభిస్తుందని మంత్రి ధీమాగా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News