Monday, May 6, 2024

జర్నలిస్టుల తీసివేత, జీతాల కోతపై స్పందించండి

- Advertisement -
- Advertisement -

Supreme court

 

న్యూఢిల్లీ : కరోనా లాక్‌డౌన్ దశలో జర్నలిస్టుల ఉద్యోగాలపై వేటు, జీతాల కోతలపై సుప్రీంకోర్టు సోమవారం స్పందించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చుకోవాలని ఆదేశించింది. కరోనా సమయంలో ప్రింట్, టీవీ మీడియాలకు చెందిన కొందరు జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తీసివేయడం, నెలవారి జీతాలలో కోతలు విధించడం జరిగింది. యాజమాన్యాలు టర్మినేషన్ నోటీసులు ఇవ్వడం, వేతనాల తగ్గింపులు, లాక్‌డౌన్ ముగిసేవరకూ చెల్లింపులు లేని లీవ్‌లపై వెళ్లాలని ఆదేశించడం వంటి చర్యలపై మూడు జర్నలిస్టు సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిని న్యాయమూర్తులు ఎన్‌వి రమణ, సంజయ్ కిషన్ కౌల్‌తో కూడిన బెంచ్ విచారణకు స్వీకరించింది. కేంద్రానికి, ఇండియన్ న్యూస్‌పేపర్స్ సొసైటీ, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్‌కు నోటీసులు వెలువరించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ప్రస్తుత దశలో కేంద్రానికి దీనిపై ఎటువంటి నోటీసు పంపించాల్సిన అవసరం లేదని, దీనిపై వివరణ తమ పనికాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.

అయితే పిటిషన్లలోని అంశాలను పరిశీలించిన తరువాత తీవ్రమైన విషయాలు తమ దృష్టికి వచ్చినందున కేంద్రం నుంచి వివరణ అవసరం అని తాము భావిస్తున్నట్లు, నోటీసు వెలువరిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కొలిన్ గన్‌సాల్వేస్ ప్రాతినిధ్యం వహించారు. జర్నలిస్టులకు యాజమాన్యం అన్యాయం గురించి తెలియచేస్తూ నేషనల్ అలయెన్స్ ఆఫ్ జర్నలిస్టు, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్టు, బృహన్‌ముంబై యూనియన్ ఆఫ్ జర్నలిస్టు పిటిషన్లు దాఖలు చేశాయి. విపరీత స్థాయిలో వేతనాల కోత, ఏకపక్షంగా ఉద్యోగాలకు ఎసరు. అన్‌పెయిడ్ లీవ్‌పై పంపించడం జరిగిందని, దీనిపై వెంటనే న్యాయస్థానం జోక్యం చేసుకుని తగు ఆదేశాలు వెలువరించాలని పిటిషనర్లు కోరారు. ప్రజావ్యాజ్యం (పిల్)గా దీనిని దాఖలు చేశారు. ప్రస్తుత చర్య అమానుషం, చట్టవ్యతిరేకం అని పేర్కొన్నారు. ప్రధాని, కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖలు ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగులను తీసివేయరాదని పేర్కొన్నా, పట్టించుకోకుండా వ్యవహరించడం దారుణం అని తెలిపారు.

Supreme court notice to central on Journalists problems
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News