Tuesday, April 30, 2024

పరంబీర్ …. ఇదేం తీరు?

- Advertisement -
- Advertisement -
Supreme Court seeks whereabouts of Param Bir Singh
ఎక్కడున్నారు? వేరే దేశంలోనా? ఇక్కడనా?
తెలియచేస్తేనే రక్షణలు, విచారణలు
పవర్ ఆఫ్ అటార్నీతో పిటిషనా?
నిలదీసిన సుప్రీంకోర్టు ధర్మాసనం

న్యూఢిల్లీ : ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరం బీర్ సింగ్ అరెస్టు నుంచి తప్పించాలని చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మహారాష్ట్రలో ప్రత్యేకించి ముంబైలో బలవంతపు వసూళ్ల కేసులో నిందితుడైన సింగ్ ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. బొంబాయిలోని మెజిస్ట్రేట్ కోర్టు సింగ్‌ను, ఇతరులను ప్రకటిత నేరస్థుల జాబితాలోకి చేర్చింది. సింగ్‌ను పరారీలో ఉన్న నేరస్థుడిగా తెలిపింది. తనను సంబంధిత కేసులో అరెస్టు చేయకుండా రక్షించాలని సింగ్ తమ లాయర్ ద్వారా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందించింది‘ ముందు మీరు ఎక్కడ ఉన్నారో మాకు తెలియాలి. అప్పటివరకూ మీకు అరెస్టు నుంచి మినహాయింపు ఆదేశాలు రక్షణ ఉండదు. పిటిషన్ విచారణ కూడా కుదరదు’ అని న్యాయమూర్తి ఎస్‌కె కౌల్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది.

సింగ్ లాయర్‌ను ఉద్ధేశించి ఇంతకూ మీ క్లయింట్ ఎక్కడున్నారో తెలియచేయండని తెలిపింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పోలీసు అధికారి తనకు అరెస్టు నుంచి రక్షణ కావాలనే పిటిషన్‌ను పవర్ ఆఫ్ అటార్నీ రూపంలో దాఖలు చేయడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. ఇదేం పద్ధతి అంటూ అభ్యంతరం తెలిపింది. తీర్పు అనుకూలంగా ఉంటే ఇక్కడకు వస్తారా? లేకపోతే వేరే విధంగా వ్యవహరిస్తారా. ముందు మీ మైండ్‌లో ఏముందో తెలియాలని ధర్మాసనం ఘాటుగా స్పందించింది. సింగ్ ఈ ఏడాది మే నెలలో విధులకు హాజరు అయ్యారు. తరువాత సెలవుపై వెళ్లారు. అప్పటి నుంచి తిరిగి ఆఫీసుకు రాలేదు. ఆయన ఎక్కడున్నారనేది తెలియడం లేదని మహారాష్ట్ర పోలీసులు గత నెలలో బొంబాయి హైకోర్టుకు తెలియచేశారు. ఆయనకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు కూడా జారీ అయింది. ఈ దశలో సింగ్ తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడం కీలక పరిణామం అయింది. ‘ మీరు ఈ దేశంలోనే ఉన్నారా? వేరే దేశంలో ఉన్నారా? లేక ఇక్కడనే వేరే రాష్ట్రంలో ఉంటున్నారా? ముందు మీరు ఎక్కడున్నారో మాకు మీద్వారానే తెలియాల్సి ఉంది. అప్పుడే మిగిలిన విషయాలు గురించి మేం ఆలోచిస్తాం. అంతే ’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ కేసులో ముంబై మాజీ పోలీసు ఇన్‌స్పెక్టర్ సచిన్‌వాజే కూడా నిందితులుగా ఉన్నారు. ఆయనతో పాటు సహ నిందితులు వినయ్ సింగ్, రియాజ్ భట్టిలను కూడా ఈ కేసుకు సంబంధించి దోషులుగా ముంబై కోర్టు బుధవారం ప్రకటించింది.

కేసు పూర్వాపరాలు బార్ల మూలాలు

ముంబై పోలీసు అధికారులు తరచూ బలవంతపు వసూళ్లకు దిగుతున్నారని, సొమ్ము ఇవ్వకపోతే దాడులకు దిగి కేసులు పెడుతున్నారని బార్ల ఓనర్లు తరచూ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బిమల్ అగర్వాల్ అనే రియల్టర్, హోటలియర్ సింగ్‌పై తీవ్ర ఆరోపణలకు దిగారు. బార్లపై దాడులకు దిగకుండా ఉండాలంటే రూ 9 లక్షల ముడుపులు ఇచ్చుకోవాలని బెదిరించారని తెలిపారు. పైగా స్మార్ట్‌ఫోన్లు కూడా కొనివ్వాలని తెలిపారని చెప్పారు. ఈ ఫిర్యాదుల ఫలితంగా సింగ్ ఇతరులపై ఐపిసి సెక్షన్ల పరిధిలో ఆయనపై మరో ఐదుగురిపై కేసులు నమోదు అయ్యాయి. సింగ్‌పై థానేలో కూడా వసూళ్ల కేసు ఉంది. మహారాష్ట్రకు అప్పట్లో హోం మంత్రిగా ఉన్న అనిల్ దేశ్‌ముఖ్ ప్రోద్బలంతోనే తాను ఇతరులు వసూళ్లకు దిగాల్సి వస్తోందని సింగ్ ఆరోపించడం రాజకీయ మలుపు తిరిగింది. అనిల్‌పై మనీలాండరింగ్ పరిధిలో కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు ఆయన జైలులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News