న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇటీవల ఓ సివిల్‌వివాదాన్ని క్రిమినల్ కేసుగా మారుస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పులతడకగా అభివర్ణించింది. సివిల్ కేసు పరిష్కారానికి సమయం పడుతుందనే కారణంగా సివిల్ వివాదంలో క్రిమినల్ చర్యలను హైకోర్టు సమర్థించడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ చర్యలు న్యాయస్థానం తనకున్న హక్కులను దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడింది. సివిల్ సమస్యలను పరిష్కరించడానికి క్రిమినల్ చట్టాలను ఉపయోగించలేమనే చట్టబద్ధమైన నిబంధనలను, ఆ రెండు కేసుల మధ్య ఉన్న వ్యత్యాసాలను హైకోర్టు అర్థం చేసుకుంటుందని తాము ఆశిస్తున్నట్లు జస్టిస్ పర్దీవాలా, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం పేర్కొంది.
ఇకపై న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చే సమయంలో ఇలాంటి అతిక్రమణలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఆ తీర్పును వెలువరించిన న్యాయమూర్తి పదవీ విరమణ చేసేంతవరకు ఆయనకు ఎటువంటి క్రిమినల్ కేసులు కేటాయించకుండా చూసుకోవాలని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. కాగా ఇప్పటికే పలు కోర్టులు పోలీసులు ఆస్తి వివాదాలకు సంబంధించిన సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చడాన్ని సర్వోన్నత న్యాయస్థానం పలు సారు తప్పుపట్టిన విషయం తెలిసిందే.