Saturday, May 4, 2024

వన్డేల్లో తేలిపోతున్న సూర్యకుమార్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టి20లలో పరుగుల వరద పారించే డాషింగ్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ వన్డేలకు వచ్చే సరికి పూర్తిగా తేలిపోతున్నాడు. టి20, ఐపిఎల్‌లో సూర్యకు ఉన్న రికార్డును దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు అతనికి వన్డే ఫార్మాట్‌లో తరచూ అవకాశాలు కల్పిస్తున్నారు. అయితే సూర్య మాత్రం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో పాటు తాజా ఆసియాకప్‌లోనూ అతను పూర్తిగా విఫలమయ్యాడు. వరుస అవకాశాలు లభిస్తున్నా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో వైఫల్యం చవిచూస్తున్నాడు. ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌కు తుది జట్టులో ఛాన్స్ కల్పించారు. కానీ సూర్య మాత్రం తన పేలవమైన ఆటను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. జట్టును ఆదుకుంటాడని భావిస్తే మరోసారి నిరాశే మిగిల్చాడు. వన్డేల్లో సత్తా చాటేందుకు మంచి అవకాశం లభించినా సూర్య దాన్ని వృథా చేసుకున్నాడు.

పేలవమైన ఆటతో జట్టు యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టలేక పోయాడు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను కాదని సూర్యకు వరుస అవకాశాలు కల్పిస్తున్నారు. అతను మాత్రం ఏ ఒక్కసారి కూడా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నాడు. టి20లలో భారీ స్కోర్లతో పెను ప్రకంపనలు సృష్టించే అతను వన్డేలకు వచ్చే సరికి పూర్తిగా చేతులెత్తేస్తున్నాడు. అతని వైఫల్యం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఎంతో ప్రతిభావంతుడైన సూర్య కీలకమైన వన్డే ఫార్మాట్‌లో వరుస వైఫల్యాలు చవిచూడడం నిజంగా ఆందోళన కలిగించే అంశమే. వరుసగా విఫలమవుతున్నా అతని సామర్థాన్ని దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు జాతీయ జట్టులో చోటు కల్పిస్తూనే ఉన్నారు. అయితే ఆసియాకప్‌లో సూర్య విఫలం కావడంతో సెలెక్టర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతనికి వరల్డ్‌కప్ జట్టులో చోటు కల్పించడాన్ని అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు.

వన్డేల్లో పేలవమైన రికార్డు ఉన్న ఆటగాడిని ప్రపంచకప్ వంటి మెగా టోర్నీకి ఎంపిక చేయడాన్ని చాలా మంది క్రికెట్ విశ్లేషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సూర్యతో పోల్చితే దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న క్రికెటర్లను వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు కల్పిస్తే బాగుండేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఆసియాకప్‌లో ఘోర వైఫల్యం చవిచూసిన సూర్యకుమార్ సొంత గడ్డపై జరిగే వరల్డ్‌కప్‌లోనైనా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరుస్తాడా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక మెగా టోర్నీలో విఫలమైతే మాత్రం సూర్యకుమార్‌కు మళ్లీ వన్డే జట్టులో స్థానం దక్కడం దాదాపు అసాధ్యమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలాంటి స్థితిలో మరోసారి ఛాన్స్ లభిస్తే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన బాధ్యత సూర్యకుమార్‌పై నెలకొంది. దీనిలో అతను ఎంతవరకు సఫలమవుతాడో వేచిచూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News