Monday, May 13, 2024

చాపకింద నీరులా స్వైన్‌ఫ్లూ

- Advertisement -
- Advertisement -

Swine

 

సీజన్ మారినా తగ్గని ప్రభావం
పెరుగుతున్న కోవిద్ 19 అనుమానితులు
కోవిద్ 19, స్వైన్‌ఫ్లూ పట్ల
నిరంతరం అప్రమత్తంగా ఉంటున్న ఆరోగ్య శాఖ

మనతెలంగాణ/హైదరాబాద్ : ఒక వైపు కోవిద్ 19 వైరస్ అనుమానాలు వణికిస్తుంటే.. చాపకింద నీరులా స్వైన్‌ఫ్లూ విస్తరిస్తోంది. దాంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సాధారణంగా స్వైన్‌ఫ్లూ ప్రభావం చలికాలంలోనే ఉంటుంది.. కానీ సీజన్ కాని సీజన్‌లో స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో మళ్లీ స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ 15 స్వైన్ ఫ్లూ కేసులు నమోదవ్వగా.. ఫిబ్రవరి నెలలోనే 8 కేసులు నమోదయ్యాయి. జలుబు, జ్వరం, దగ్గు, శ్వాస కోశ సమస్యలతో కరోనా వైరస్ అనుమానంతో ఆసుపత్రులకు వెళ్తున్నవారికి పరీక్షలు నిర్వహిస్తే స్వైన్‌ఫ్లూ బయటపడుతుంది. రాష్ట్రంలో రెండు నెలల వ్యవధిలో 119 కేసులు నమోదు కాగా, కొందరికి వ్యాధి నయం అయి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

చలి తీవ్రత తగ్గినా ప్రభావం తగ్గలేదు..
సాధారణంగా స్వైన్‌ఫ్లూ ప్రభావం చలికాలంలోనే ఉంటుంది. డిసెంబరు లేదా జనవరి నెలాఖరు వరకూ ఉంటుంది. వేసవి ప్రారంభం కాగానే వైరస్ ప్రభావం తగ్గుతుంది. కానీ చలి తీవ్రత తగ్గినా స్వైన్‌ఫ్లూ తీవ్రత తగ్గలేదు. ప్రస్తుత వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల దాని ప్రభావం తగ్గలేదని వైద్యులు చెబుతున్నారు. స్వైన్ ప్లూ బారి నుంచి తప్పించుకోవడానికి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.

గత ఏడాదితో పోల్చితే తగ్గిన కేసులు
స్వైన్ ఫ్లూ కేసులు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది చాలా వరకు తగ్గాయి. గత ఏడాది జనవరిలో 296 మంది స్వైన్‌ఫ్లూతో ఆసుపత్రుల్లో చేరగా, ఈ ఏడాది జనవరిలో 73 మంది చేరారు. అలాగే గత ఏడాది ఫిబ్రవరిలో 417 మంది స్వైన్‌ఫ్లూతో ఆసుపత్రుల్లో చేరగా, ఈ ఏడాది ఫిబ్రవరి 20 వరకు 119 మంది చేరారు. గత ఏడాది స్వైన్‌తో కొంతమంది మృత్యువాత పడగా, ఈ సారి మాత్రం ఒక్కరు చనిపోలేదు.

పెరుగుతున్న కోవిద్ 19 అనుమానితులు
రాష్ట్రంలో కరోనా అనుమానితులు రోజురోజుకు పెరుగుతున్నారు. చైనా, జపాన్, సౌత్ కొరియా,హాంకాండ్, థైలాండ్, సింగపూర్ దేశాలతో పాటు కోవిద్ 19 ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కానప్పటికీ ప్రభుత్వం ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇప్పటివరకు 12,159 మంది విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. 257 మంది కోవిద్ 19 అనుమానితుల్లో ఒకరు 28 రోజుల పాటు ఇంటి వద్దనే(హోమ్ ఐసోలోటెడ్) జాగ్రత్తగా ఉంటూ తన ఐసోలోటెడ్ పీరియడ్‌ను పూర్తి చేశారు. మరో ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా, మిగిలిన 254 మంది హోమ్ ఐసోలేటెడ్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కోవిద్ – 19 పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. శనివారం వరకు మొత్తం 101 మంది కోవిద్ – 19 అనుమానితులకు నిర్వహించిన పరీక్షల్లో నిర్వహించగా వైరస్ లేదని నిర్థారణ అయ్యిందని తెలిపింది. ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కానప్పటికీ ప్రభుత్వం ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటోంది. కోవిద్ 19 వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

జలుబు ఉన్న దగ్గినప్పుడు ముఖానికి కర్చీఫ్ అడ్డం పెట్టుకోవాలని, రెగ్యులర్‌గా సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది. కోవిద్ 19 వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కరోనా లక్షణాలు ఉన్నా, లేకపోయినా 28 రోజుల పాటు కచ్చితంగా ఇంటి వద్దనే(హోమ్ ఐసోలేటెడ్) జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్ 040 – 24651119కు ఇప్పటివరకు 487 ఫోన్ కాల్స్ వచ్చాయని ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది.

Swine flu cases again
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News