Tuesday, May 7, 2024

నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై ఉక్కుపాదం మోపాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై ఉక్కుపాదం మోపాలని, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రాష్ట్రానికి సరఫరా అవుతున్న మద్యం సురక్షితం కాదనీ పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. నారాయణ పేట జిల్లాలోని తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధ్వర్యంలో నడుస్తున్న కృష్ణ చెక్‌పోస్ట్‌ను మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్‌గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌లో తగినంత సిబ్బంది లేకపోవడంతో పాటు ఉన్న సిబ్బంది నిర్లక్యంగా వ్యవహారించడాన్ని గమనించిన మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్‌తో మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సెల్ ఫోన్‌లో మాట్లాడి చెక్ పోస్ట్‌లో తగినంత సిబ్బంది ని నియమించాలని ఆదేశించారు. అలాగే రవాణా శాఖ, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు సమన్వయం చేసుకొని చెక్ పోస్ట్ ద్వారా తెలంగాణకు ఇతర రాష్ట్రాలైనా కర్ణాటక, గోవా, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి అక్రమంగా సరఫరా అవుతున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై ఉక్కు పాదం మోపాలని ఆయన కమిషనర్‌ను ఆదేశించారు.

కృష్ణా బ్రిడ్జి సమీపంలో ఉన్న అంతరాష్ట్ర చెక్‌పోస్టును సైతం…
అనంతరం రాయచూరు నుంచి మహబూబ్ నగర్‌కు వస్తున్న మంత్రి కృష్ణా బ్రిడ్జి సమీపంలో ఉన్న అంతరాష్ట్ర ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో నడుస్తున్న చెక్ పోస్ట్‌ను తనిఖీ చేశారు. ఆ సమయంలో అక్కడ తగినంత సిబ్బంది లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉండాల్సిన అధికారి ఎక్కడికి పోయారని మంత్రి ఆరా తీశారు. ఎక్సైజ్ విజిలెన్స్ సరిగా లేరని, ఇలా అయితే అక్రమంగా వచ్చే మద్యాన్ని అడ్డుకట్ట వేయడం ఎలా సాధ్యమవుతుందని ఆయన సిబ్బందిని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల నుంచిఅక్రమంగా సరఫరా అవుతున్న మద్యాన్ని నియంత్రించాలని మంత్రి ఆదేశించారు.

చెక్‌పోస్ట్‌లను మరింత పటిష్ట పరుస్తాం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతరాష్ట్ర సరిహద్దులో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధ్వర్యంలో ఉన్న చెక్‌పోస్ట్‌లను మరింత పటిష్ట పరుస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, రవాణా శాఖ అధికారులతో కలిసి అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్ట్‌ల వద్ద మరింత భద్రతను పెంచడంతో పాటు తగినంత సిబ్బందిని నియమిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న దళారుల వలలో పడొద్దని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాయచూరు నుంచి మక్తల్ వైపు వస్తున్న పలు వాహనాలను మంత్రి స్వయంగా తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన వాహనాలను ఆపాలని, తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆయన సిబ్బందిని, అధికారులను ఆదేశించారు. ఇలాంటి పొరపాటు మరోసారి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని అధికారులను మంత్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ తదతరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News