Friday, March 29, 2024

మజ్లిస్ శాసనసభ్యులతో మంత్రి తలసాని భేటి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంతో చరిత్ర కలిగిన పాతబస్తిలోని లాల్ దర్వాజ అమ్మవారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం అసెంబ్లీలోని సమావేశ మందిరంలో మజ్లిస్ పార్టీ శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ, బలాలతో కలిసి పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన సందర్భంలో ఆలయం అభివృద్ధి, విస్తరణ చేపడతామని ప్రకటించారని గుర్తు చేశారు. ఆ హామీ మేరకు ఆలయ విస్తరణ కు అవసరమైన 1100 గజాల స్థలాన్ని గుర్తించడం జరిగిందన్నారు. భూ యజమానులు కూడా స్థలం అప్పగించేందుకు సానుకూలంగా ఉన్నారని తలసాని తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం భూమి అప్పగిస్తున్న వారికి పరిహారంగా అందించేందుకు సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ.8.95 కోట్లు మంజూరు చేసిందన్నారు.

అదే విధంగా పేద ప్రజల అవసరాల ను దృష్టిలో ఉంచుకొని పెండ్లిళ్ళు, ఇతర శుభ కార్యాలు జరుపుకునేందుకు మూడు నూతన మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణం కోసం రూ.19 కోట్లను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఇందులో కంచన్‌బాగ్, ఉప్పుగూడ, జంగంమెట్‌లలో మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మించడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా ఉప్పుగూడ హాల్‌కు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన రెండు హాల్స్ కు కూడా త్వరితగతిన టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. 10 రోజులలో భూమి పూజ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News