Sunday, April 28, 2024

అఫ్గాన్‌లో తాలిబన్ల విస్తరణ

- Advertisement -
- Advertisement -

Taliban Capture Two More Provincial Capitals

 

కీలక ప్రాంతాలలో ముందుకు
ప్రధాన నగరాల కైవస దిశతో బలోపేతం
కుందూజ్‌లో సైన్యం కందకాల పాలు

కాబూల్: అప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మరింతగా తమ ప్రాబల్యాన్ని విస్తరించుకున్నారు. దేశంలోని మరో రెండు ప్రాంతాల రాజధానులను ఆదివారం తాలిబన్లు అదుపులోకి తెచ్చుకున్నట్లు స్పష్టం అయింది. ఇటీవలికాలంలో దేశంలోని అత్యధిక భూభాగం తాలిబన్ల ఉడుంపట్టులోకి వెళ్లింది. ఇక ప్రత్యేకించి ప్రధాన నగరాలు, పట్టణాలను కూడా తమ అదుపులోకి తెచ్చుకునే దిశలో తాలిబన్లు తమదైన గెరిల్లా తరహా పోరుతో ముందుకు సాగుతున్నారు. దేశంలో నుంచి అమెరికా సారథ్యపు సంకీర్ణ సేనల ఉపసంహరణ ప్రక్రియ జోరందుకోవడం ఇదే దశలో ఇంతకాలం దెబ్బతిన్నట్లుగా ఉన్న ఈ సాయుధ దళం ఇప్పుడు తన ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకుంటూ వస్తోంది. శుక్రవారం నుంచి ఇప్పటివరకూ తాలిబన్లు నాలుగు ప్రొవినిషియల్ క్యాపిటల్స్‌ను కైవసం చేసుకున్నారు.

దీనితో ప్రభుత్వ ఆధ్వర్యపు సేనలు వెనకకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది . ఉత్తర ప్రాంతంలోని కుందూజ్, సార్ ఏ పుల్ గంటల వ్యవధిలోనే ఆదివారం తాలిబన్ల వశం అయినట్లు స్థానిక ఎంపీలు , స్థానికులు నిర్థారించారు. అయితే ఎటువంటి భీకర పోరుకు అవకాశం లేకుండానే ఇక్కడ తాలిబన్లు తమ బలం చాటుకున్నట్లు వెల్లడైంది. అయితే కుందూజ్‌లో ఇప్పుడు అల్లకల్లోల పరిస్థితి ఏర్పడిందని స్థానికుడు ఫోన్‌లో చెప్పారు. ఇక కుందూజ్‌లో కొద్దిపాటి భీకర పోరు తరువాత ముజాహిద్దిన్‌లు అల్లా దయతో సత్తా చాటుకున్నారని తాలిబన్లు ఓ ప్రకటన వెలువరించారు. ఇక మరో ప్రధాన నగరం సార్ ఏ పుల్ సిటిని కూడా తాలిబన్లు వశపర్చుకున్నారు. అక్కడి ప్రభుత్వ భవనాలు ఇతరత్రా ప్రధాన కేంద్రాలు అన్నీ వారి ఆధీనంలోకి వెళ్లాయి. తాలిబన్లు తరలిరావడంతో అక్కడ ప్రభుత్వ అధికారులు, మిగిలిన సైనిక బలగాలు నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలోని బారాక్‌లకు తరలివెళ్లారని అక్కడ తలదాచుకున్నారని స్థానికంగా ఉండే మహిళ హక్కుల నాయకురాలు పర్వీనా అజిమీ వార్తాసంస్థలకు ఫోన్ సమాచారం అందించారు.

ఇక్కడికి ఓ ప్రయాణికుల విమానం వచ్చింది కానీ పరిస్థితి తీవ్రతతో వెనుదిరగాల్సి వచ్చిందని తెలిపారు. అయితే పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నట్లు , కీలకమైన స్థావరాలను, కేంద్రాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ, ప్రభుత్వ బలగాల ప్రతినిధులు తెలిపారు. ఇక దేశంలోని ఉత్తర ప్రాంతంలో ప్రాబల్యం కాపాడుకోలేకపోతే ఇకపై ప్రభుత్వ సుస్థిరతకు, ఉనికికి రాబోయే రోజులలో ముప్పు వాటిల్లుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. పాకిస్థాన్ నుంచి అందుతోన్న వ్యూహాత్మక, అజ్ఞాత భారీ సాయంతోనే తాలిబన్లు ఇటీవలి కాలంలో దేశంలో ప్రాబల్యం చాటుకుంటున్నారని ఐరాసలో తాజాగా అఫ్ఘనిస్తాన్ ప్రతినిధి ఆరోపించారు. పాకిస్థాన్ దుర్నీతిని ఎండగట్టారు. ఇక ప్రస్తుత తాలిబన్ల ఆధిపత్య పరిస్థితి తరువాతి పరిణామాలపై చర్చించేందుకు రష్యా ఆధ్వర్యంలో కీలక భేటీ జరుగనుంది. దీనికి చైనా, అమెరికా, పాకిస్థాన్ ప్రతినిధులను ఆహ్వానించిన రష్యా ఇండియాను దీని నుంచి మినహాయించింది. అఫ్ఘన్‌లో ప్రస్తుత పరిస్థితి భారత్ వంటి దేశాలకు ఉగ్రవాద ముప్పును. ప్రత్యేకించి సీమాంతర విద్రోహ చర్యలను తీవ్రతరం చేస్తాయని ఇండియా చెపుతూ వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News