Tuesday, April 30, 2024

మా లోయ మాదేనన్న పంజ్‌షీర్లు

- Advertisement -
- Advertisement -

Talks between Taliban and Panjshir leaders failed

తాలిబన్లతో చర్చలు విఫలం
ఇక ప్రతిఘటనపై పోరే
సర్కారు ఖరారు దశలో తకరారు

కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లకు మారుమూల ప్రాంతంలోని పంజ్‌షీర్ విసిరిన సవాలు మరింత తీవ్రతరం అయింది. తాలిబన్లకు, పంజ్‌షీర్ల నేతలకు మధ్య బుధవారం జరిగిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా విఫలం అయ్యాయి. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థలు నిర్థారించాయి. తాలిబన్ల ఆధిపత్యానికి ఈ లోయ ప్రాంతం నుంచి వెలువడుతున్న తీవ్రస్థాయి ప్రతిఘటన ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం అయింది. తాలిబన్ల తదుపరి ప్రభుత్వ స్థాపనకు విఘాతం కాకపోయినా విఘ్నం అయింది. తాలిబన్లు ఇప్పటికే పలు అంశాలపై సరైన వాతావరణం ఏర్పాటుకు వివిధ మండళ్లు ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో ఒక్కటైన మార్గదర్శకం, ప్రోత్సాహకాల కమిషన్ అధినేత ముల్లా అమీర్ ఖాన్ మోతాఖీ విలేకరులతో మాట్లాడుతూ పంజ్‌షీర్ నేతలతో జరిపిన చర్చలు విఫలం అయిన విషయాన్ని నిర్థారించారు. పంజ్‌షీర్, పర్వాన్ ప్రొవిన్స్‌లకు చెందిన గిరిజన నేతలతో జరిపిన సంప్రదింపులు తాము చేసిన రాజీ యత్నాలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయని తెలిపారు. వారు తలపడాలనుకుంటున్నట్లుగా ఉందని, తలపడే వారితో మాటలు కలపవచ్చా?

అనే సందేహాలు రేకెత్తుతున్నాయని అన్నారు. పంజ్‌షీర్ ప్రజలకు ఆ తరువాత ఆయన తరఫున ఓ ఆడియో సందేశాన్ని అమీర్‌ఖాన్ వెలువరించారు. ‘ సోదరులారా..పంజ్‌షీర్ సమస్యను చర్చలతో పరిష్కరించాలని రంగంలోకి దిగాం. అయితే ఫలితం లేకుండా పోయింది’ అని ఇందులో తెలిపారు. తాలిబన్లను ఈ లోయలోకి రానిచ్చేది లేదని పంజ్‌షీర్ నేత అహ్మద్ మసూద్ తేల్చిచెపుతున్నారు. ఇతరులకు దుర్భేధ్యం అయి, స్థానిక గిరిజనులకు కంచుకోట అయిన ఈ లోయ, కొండల ప్రాంతం తమ వశం చేసుకునేందుకు తాలిబన్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అవి బెడిసికొట్టాయి. మరోవైపు వారితో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీనితో తాలిబన్లకు ఎదురవుతున్న ప్రతిఘటన ఇప్పటికీ కొనసాగుతూ జటిలం అయింది. సోవియట్ యూనియన్‌లు తమ లోయలోకి రాకుండా అప్పట్లో యత్నించి తరువాత వధించిబడ్డ నేత అహ్మద్ షా మసూద్ కుమారుడు, విద్యాధికుడు అయిన జూనియర్ మసూద్ నాయకత్వంలో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరు సాగుతోంది. వీరికి దేశ మాజీ ఉపాధ్యక్షులు అమ్రుల్లా సలేహ్ సారథ్యపు బలగాలు మద్దతు ప్రకటించాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News