Sunday, April 28, 2024

ఏడో సారి కోసం వాళ్లిద్దరు…

- Advertisement -
- Advertisement -

ఎంట్రీ కోసం ప్రత్యర్థులు, పాలకుర్తి, డోర్నకల్‌లో పోటా పోటీ , మంత్రి ఎర్రబెల్లి, మాజీమంత్రి రెడ్యాకు గట్టి పోటీ , ఒంటి చేతితో ఎర్రబెల్లి ప్రచారం,  రెడ్యా కోసం మంత్రి సత్యవతి, ఎంపి కవిత

అత్యధికంగా ఆరుసార్లు విజయం సాధించారు. ఏడోసారి కూడా అసెంబ్లీలో అడుగుపెట్టాలని వాళ్లిద్దరు… తొలిసారి అసెంబ్లీకి వెళ్లాలనే తపనలో ప్రత్యర్థులు. వెరసి మంత్రి ఎర్రబెల్లికి, మాజీమంత్రి రెడ్యానాయక్ లకు గట్టి పోటీ ఎదురవుతున్నది. ఎన్నో ఎన్నికలను సునాయాసంగా ఎదుర్కొన్న ఇద్దరు నేతలు… ప్రత్యర్థుల దూకుడుకు బేజారు అవుతున్నారు. నియోజకవర్గానికి పరిమితమై ప్రచారం చేస్తున్నారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి ఒంటి చేతితో ప్రచారం చేసుకుంటుండగా, డోర్నకల్ లో మాత్రం మాజీమంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ కోసం మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపి కవిత ప్రచారం చేస్తున్నారు. వీళ్ళిద్దరికీ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. మంత్రి ఎర్రబెల్లితో తొలిసారి ఎన్నికల బరిలోకి వచ్చిన యశస్వినిరెడ్డి తలపడుతున్నది. మాజీమంత్రి రెడ్యానాయక్ తో గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన రామచంద్రునాయక్ పోటీ పడుతున్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఇద్దరు నేతలకు ప్రత్యర్థులు సవాల్ విసురుతున్నారు.

రాజకీయ అరంగ్రేటం చేసిన తర్వాత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994, 1999, 2004 లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేశారు. డిలిమిటేషన్ తర్వాత కొత్తగా ఏర్పడిన పాలకుర్తి మారారు. ఇక్కడినుంచి 2009, 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల తర్వాత టిఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో టిడిపిని విలీనం చేశారు. 2018 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జంగా రాఘవరెడ్డిపై గెలుపొందారు. ఆరుసార్లు గెలిచిన ఎర్రబెల్లికి ఈసారి మంత్రివర్గంలో చోటుదక్కింది.

ఇక్కడిదాకా సాఫీ గానే సాగింది. ఈసారి కాంగ్రెస్ కు అభ్యర్థి కూడా లేడనే ప్రచారం నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికాలో ఉంటున్న పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డి తెర మీదకు వచ్చారు. కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం రాగా.. బిఆర్‌ఎస్ లో అలజడి మొదలైంది. ఆమె నియోజకవర్గంలో తిరగడం..ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో సమీకరణాల్లో మార్పులు వచ్చాయి. అయితే ఆమెకు పౌరసత్వం లేకపోవడంతో పోటీ చేయదంటూ ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఢీలా పడ్డాయి. ఇక్కడితో ఆగకుండా ప్రత్యామ్నాయంగా ఝాన్సీరెడ్డి తన కోడలు యశస్వినిరెడ్డిని పొలిటికల్ స్క్రీన్ మీదకు తెచ్చారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమీకరించి హోరాహోరీ గా ప్రచారం చేస్తున్నారు.

ఆరుసార్లు ఎన్నికలను సునాయాసంగా ఎదుర్కొన్న ఎర్రబెల్లి ఈసారి చెమటోడ్చుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబ నేపథ్యం, ప్రచారంలో దూకుడుగా ఉండడంతో ఎర్రబెల్లి విరామం లేకుండా తిరుగుతున్నారు. తొలిసారి ఎన్నికల బరిలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి.. ఎర్రబెల్లికి చెమటలు పుట్టిస్తూ అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నది. తన అనుభవాన్ని అంతా రంగరించి ఏడో సారి అసెంబ్లీకి వెళ్లాలనే పట్టుదలతో ఎర్రబెల్లి పనిచేస్తున్నారు. ఒంటి చేతితో ప్రచారం చేస్తున్నారు.

రిజర్వ్ స్థానమైన డోర్నకల్ నియోజకవర్గం నుంచి కూడా ఎన్నిక ప్రతిష్టాత్మకం కానుంది. ఇక్కడినుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన డిఎస్ రెడ్యానాయక్ తో కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రు నాయక్ తలపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగ్రేటం చేసిన రెడ్యా… ఒకసారి టిడిపి గాలిలో ప్రస్తుత మంత్రి సత్యవతి రాథోడ్ చేతిలో ఓడిపోయారు. తర్వాతనుంచి ఏకధాటిగా గెలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఏడో సారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఎలాగైనా మరోమారు అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. ఆయన విజయం కోసం మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపి కవిత ప్రచారం చేస్తున్నారు.

రెడ్యా కూతురు కవిత ఊరూరా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన అనుభవం అంతా కూడగట్టి రెడ్యా ముందుకు వెళ్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రునాయక్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వీరిద్దరే ముఖాముఖి తలపడినప్పటికీ కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఈసారి ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ కలగంటున్నది. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతికి తోడు ప్రభుత్వ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలని కాంగ్రెస్ ఆరాట పడుతున్నది. తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రునాయక్ పోరాడుతున్నారు. ఏడో సారి కోసం ఇద్దరు…తొలిసారి అడుగు కోసం ఉద్దండులతో ఇద్దరు పోటీ పడుతున్న తీరు ఆసక్తిగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News