Friday, March 1, 2024

గజిబిజి సర్వేలతో ప్రజల్లో ఉత్కంఠ..

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల : తెలంగాణలో ఎంతో ఉత్కంఠ రేపిన అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. ఎన్నికలకు ముందు ప్రీపోల్ సర్వేలు హడావుడి చేస్తే, పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ నాయకులలో, ఓటర్లలో మరింత సందడి చేయడం ప్రారంభించాయి. ప్రాంతీయ, జాతీయ వార్త ఛానల్స్ తలా ఒక్కొక్కరీతిగా తమతమ సర్వే రిపోర్టులను ప్రసారం చేయడం మొదలుపెట్టడంతో ఇటు నాయకుల్లో, అటు ప్రజల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల ఫలితాలు వెలువడాలంటే ఆదివారం వరకు ఆగవలసి రావడంతో ఈ ఎగ్జిట్పోల్ సర్వేల పై రకరకాల వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. అదీకూడా అన్ని ఛానళ్లు కనీసం కొంచం దగ్గర దగ్గరగా ఫలితాలను ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఆదివారం వచ్చే ఫలితాల కోసం ఎదురుచూసే జనాలకు ఈ ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఎన్నికలకు ముందు నిర్వహించే ప్రీపోల్ సర్వేలతో పాటు, ఓటింగ్ ముగిశాక వెలువడే ఎగ్జిట్ పోల్స్ పై కూడా భారీగా అంచనాలు ఉండడంతో వీటికి ప్రాధాన్యత పెరిగింది. ఎన్నికలకు ముందు నిర్వహించే ప్రీపోల్ సర్వేల కోసం నియోజకవర్గాల వారీగా కొంతమంది ఓటర్లను ర్యాండమ్గా ఎన్నుకొని వారితో స్వయంగా మాట్లాడి ఏ పార్టీకి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయనే విషయం సేకరిస్తారు.

తాము ఎన్నుకున్న పోలింగ్ కేంద్రాలకు ప్రతినిధులను పంపి ఓటర్లతో స్వయంగా మాట్లాడించి ఎక్కువ మంది ఏ పార్టీకి ఓటు వేస్తారో ఒక అంచనాకు వస్తారు. దీన్ని ఆధారంగా చేసుకొని ఆయా పోలింగ్ కేంద్రాల్లో సేకరించిన సమాచారంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా ప్రకటిస్తారు. నిజానికి, ఎన్నికలకు ముందు నిర్వహించే ప్రిపోల్ సర్వేలకు కాస్తోకూస్తో ఖచ్చితత్వం ఉంటుందనే అభిప్రాయముంది. నియోజకవర్గాల వారీగా ఓటర్ల నాడిని పసిగట్టి ఆయా పార్టీలు గెలిచే సీట్లను ప్రీపోల్స్ సర్వేల్లో ప్రకటిస్తాయి. అయితే అభ్యర్థులను ప్రకటించకముందే సర్వేలు చేయడం, ఓటింగ్ నాటికి చాలా ముందుగా ప్రిపోల్స్ నిర్వహించడం చేస్తుంటారు. అంటే ప్రిపోల్స్ లో ఎవరిదైతే అభిప్రాయం తీసుకుంటారో వారు అప్పటికే ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్దిష్ట నిర్ణయం తీసుకోకపోవచ్చనే భావన ఉంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఎప్పుడో జరిగే ఎన్నికలకు అప్పుడు తమ తీర్పు చెప్పే ఓటర్లు అసలు పోలింగ్ సమయానికి ఓటు వినియోగించుకుంటారా అనేది కూడా ప్రశ్నార్ధకమే. అందుకే ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరంగా మారుతాయి.

ఎందుకంటే ఓటు వేసి బయటకు వచ్చిన వ్యక్తులతో మాట్లాడడం, ఏ పార్టీకి ఓటు వేశారో స్వయంగా తెలుసుకోవడం లాంటి అంశాలు ఖచ్చితమైన ఫలితాలు ఇస్తాయనే ఒక నమ్మకం ఉండటంతో ఎగ్జిట్ పోల్స్ ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అంతేగాకుండా ఓటింగ్ శాతం కూడా ఎగ్జిట్ పోల్స్ సమయంలో పరిగణలోకి తీసుకుంటారు. పోలింగ్ ముగిసిన వెంటనే రెండు మూడు గంటల పాటు ఆయా సంస్థల చే ప్రతినిధులు ఓటర్లను కలవడం, ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల సరళిని కూడా పరిశీలనలోకి తీసుకోవడం జరుగుతుంది. అందువల్లనే వేర్వేరు సంస్థలు ప్రకటించే ఎగ్జిట్ పోల్స్ వేర్వేరుగా ఉంటాయి. ఇప్పుడు నడుస్తున్న పోటీ ప్రపంచంలో మేము ముందుండాలంటే, మేము ముందుండాలని పోటీ పడుతుండడంతో ఆయా సంస్థల సర్వే రిపోర్టులు భిన్నంగా ఉంటున్నాయి. ఒక పార్టీకి వంద స్థానాలు వస్తాయని ఒక సంస్థ చెబితే, మరో సంస్థ 70 నుంచి 80 సీట్లు వస్తాయని ప్రకటిస్తుంది.

దీంతో ఎగ్జిట్ పోల్స్ చర్చనీయాంశంగా తయారయ్యాయి, కొన్ని సందర్భాల్లో సంస్థలు ప్రకటించే ఎగ్జిట్ పోల్స్ ఒక పార్టీకి పట్టం కడితే మరికొన్ని సంస్థలు మరో పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతాయి. ఇటువంటి నేపథ్యంలో కొంత కన్ఫ్యూజన్ రావడం సహజం. అయితే కొన్ని పేరున్న సంస్థలు వెలువడించే ఎగ్జిట్ పోల్స్ మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే అది వారివారి విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటుంది. కాగా మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించినప్పటికి గెలుపు ఎవరిని వరించేనో ఈ నెల 3 వ తేదీన తేలనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News