Tuesday, April 30, 2024

ఓటర్ ఐడి కార్డే పనికిరాకుంటే.. అదే కార్డుతో గెలిచిన మోడీ ఉన్నట్టా? లేనట్టా?…

- Advertisement -
- Advertisement -

CAA

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందని, అందుకే ఆ చట్టాన్ని పార్లమెంట్‌లోనే వ్యతిరేకించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్‌సిఆర్, ఎన్‌పిఆర్‌ కు వ్యతిరేకంగా సిఎం కెసిఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. సిఎఎ అనేది ఏ మతం సమస్యో కాదని, యావత్ దేశ సమస్య అని పేర్కొన్నారు. కేరళ, పంజాబ్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో కూడా సిఎఎ, ఎన్‌సిఆర్, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయని తెలియజేశారు. వందల సంవత్సరాల మెట్రో పాలిటన్ కల్చర్ ఉన్న దేశంలో ఇప్పుడు తెలంగాణ వైఖరేంటో చెప్పాల్సిన అవసరం ఉందని, తీర్మానంలో సోదాహరణంగా వివరించామన్నారు. విశ్వమానవ సౌభ్రాతృత్వం కోరుకుంటున్న సమయంలో ఇలాంటి చట్టాలు దేశ ప్రతిష్టను దిగజారుస్తాయని కెసిఆర్ పేర్కొన్నారు.

దేశం జిడిపికి అతి ఎక్కువ దోహదపడే అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటనలో ఉండగా దేశం రాజధాని నడిబొడ్డున చెలరేగిన హింసలో 50 మందికిపైగా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ అల్లర్లపై కేంద్ర మంత్రులు, ఎంపిలు కూడా దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారని, ఒకరేమో గోలీమారో అని విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేయడంతోనే ఢిల్లీలో హింస చెలరేగిందన్నారు. ఎవరి శ్రేయస్సును ఆశించి ఇదంతా జరుగుతోందని ప్రశ్నించారు. కొందరు భక్తులు ఉద్రిక్తలు సృష్టించి రాక్షసానందం పొందుతున్నారన్నారు. 45 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నాను, ఇలాంటి సందర్భాలు తాను ఎప్పుడు చూడలేదన్నారు. దేశంలో సమస్యలేనట్టు తెరపైకి పౌరసత్వాన్ని తెచ్చారని దుయ్యబట్టారు. తనకు ఎలాంటి బర్త్ సర్టిఫికెట్ లేదని, జన్మనామం మాత్రమే ఉందన్నారు. ఒక స్థాయిలో ఉన్న మా కుటుంబంలో తనకే బర్త్ సర్టిఫికెట్ లేదని, దేశంలో ఉండే కొన్ని కోట్ల మంది పేదల పరిస్థితి ఏంటని మోడీ ప్రభుత్వాన్ని  కెసిఆర్ ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టం 130 కోట్ల మందికి సంబంధించిన అంశమన్నారు. ఎన్‌పిఆర్‌కు ఓటరు గుర్తింపు కార్డు పనికిరాదట, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు ఏదీ పనికి రాదని ఎట్లా చెప్తారని, దేశ ప్రధానిని ఎన్నుకున్న ఓటర్ ఐడి కార్డు పనికిరాదంటే… అదే ఓటర్ ఓటర్ కార్డుతో గెలిచిన ప్రధాని పదవిలో ఉన్నట్టా? లేనట్టా అని ప్రశ్నించారు.

 

Telangana assembly introduced on CAA, NRC, NPR
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News