Tuesday, April 16, 2024

రూ.62 వేల కోట్ల నుంచి 1.84 లక్షల కోట్లు పెరిగింది: గవర్నర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: పుట్టుక నీది… చావునీది… బతుకంతా దేశానిది అనే కాళోజీ సూక్తితో ప్రసంగాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంబించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు. తెలంగాణ సాధిస్తున్న సమగ్రాభివృద్ధి దేశానికి ఆదర్శప్రాయంగా ఉందని కితాబిచ్చారు. ప్రతీ రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయేలా అద్భుత ప్రగతిని తెలంగాణ సాధిస్తోందని కొనియాడారు. ప్రజల ఆశీస్సులు, సిఎం కెసిఆర్ పాలనాదక్షత, అంకితభావం వల్లనే అపూర్వ విజయాలు సాధించామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త ఆయకట్టును అభివృద్ధి చేశామని ఆమె చెప్పారు.

24 గంటల కరెంటు సరఫరాతో వెలుగు జిలుగుల తెలంగాణ సాధ్యమైందన్నారు. దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారంగా తెలంగాణ అవతరించిందని ప్రశంసించారు. వంద శాతం గ్రామాల్లో ఇంటింటికి స్వచ్చమైన తాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మెచ్చుకున్నారు. తెలంగాణ గ్రామాలు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శంగా మారాయన్నారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలకు నేడు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని, ఐటి రంగంలో మేటిగా తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు తీస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుదలలో ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకున్నాయన్నారు. ఆదర్శవంతమైన పరిస్థితికి చేర్చే క్రమంలో తన ప్రభుత్వం అనేక సవాళ్లను దీటుగా ఎదుర్కొన్నదన్నారు. ఎనిమిదిన్నరేళ్ల స్వల్ప వ్యవధిలో దేశం నివ్వెరపోయే అద్భుతాలను సాధించామన్నారు.

అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ ఎదిగిందన్ని తమిళిసై కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రూపుదాల్చిందన్నారు. 2014-15లో తెలంగాణ ఆదాయం రూ.62 వేల కోట్లు మాత్రమే ఉందని, 2021 నాటి 1 లక్షా 84 వేలకోట్ల రూపాయలకు పెరిగిందన్నారు. తలసరి ఆదాయం రూ.లక్షా 24 వేల 104 నుంచి రూ.3 లక్షల 17 వేల 115కు పెరిగిందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి గతం కన్నా రెట్టింపు స్థాయిలో పెరిగిందన్నారు. పెట్టుబడి వ్యయాన్ని పెంచుతూ అనూహ్య ప్రగతిని సాధించిన ప్రభుత్వాన్ని హృదయాపూర్వకంగా అభినందిస్తున్నామన్నారు. భారత దేశ చరిత్రలో తెలంగాణ నూతన చరిత్రను లిఖించిందన్నారు. గతంలో దండగా అన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చింది తన ప్రభుత్వమని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News