Wednesday, May 8, 2024

ఎవ్వరూ ఢిల్లీకీ రావొద్దు..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ ఝలక్…
టాస్క్‌ని అమలుపర్చడంలో వ్యూహాత్మక అడుగులు
అవతలి వర్గం చేజారకుండా బుజ్జగింపుల చర్యలు వేగవంతం
ఈ మారు జిల్లా స్థాయి నేతలతో అభిప్రాయ సేకరణ చేసే ఛాన్స్…!

మన తెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి చీఫ్ ఎంపిక వ్యవహారం పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా పరిణమించడంతో… తాము పిలిస్తే తప్ప తెలంగాణ నేతలెవరూ హస్తినకు రావొద్దని ఎఐసిసి వర్గాలు గురువారం స్పష్టీకరించినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ ఒక రకంగా ఝలక్ ఇచ్చినట్లేనని చెబుతున్నారు. మరోవైపు లీకుల ప్రహసనంతో ప్రతి విషయం బహిర్గతమైన తరుణంలో టిపిసిసి అధ్యక్షుడి ఎంపిక జనవరి మాసానికి వాయిదా పడింది.

తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి హైకమాండ్‌కు మింగుడు పడటం లేదు. పార్టీలో అంతర్గత ప్రజా స్వామ్యం ఇప్పుడు పార్టీకి మైనస్‌గా నిలుస్తోందని చెప్పక తప్పదు. రేసులో ప్రముఖంగా రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఉన్న సంగతి విదితమే. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి సి.వేణుగోపాల్‌లు రేవంత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం బాహాటంగానే ధ్వజమెత్తుతోంది.

అదే క్రమంలో తెలంగాణలో అభిప్రాయ సేకరణ ముందే టిపిసిసి చీఫ్ ఫిక్స్ అయినట్లు.. హైకమాండ్ రేవంత్‌వైపే మొగ్గుచూపినట్లు లీక్‌లు బహిర్గతమైనట్లు సమాచారం. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆయనకు బాసటగా నిలుస్తున్న సీనియర్ నేతలు సైతం ఢిల్లీ బాట పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోనియా, రాహుల్‌ని కలిశారు. తనకు అవకాశమిస్తే పార్టీని బలోపేతం చేస్తానని, 2023లో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని చెప్పినట్లు సమాచారం. రేవంత్ సైతం పార్టీ హైకమాండ్‌కు గట్టి భరోసానే ఇచ్చారని చెబుతున్నారు. రేవంత్ వర్గం సైతం డిల్లీ బాట పట్టేందుకు సమాయత్తమైనట్లు తెలుస్తోంది. టిపిసిసి తాననుకున్న వ్యక్తికి అప్పగిస్తే.. అవతలివర్గం పార్టీని వీడకుండా చూడటమే ప్రస్తుతం హైకమాండ్ ముందున్న ప్రత్యేక టాస్క్ అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులంతా ఢిల్లీకి చేరేందుకు సమాయత్తమవుతుండటంతో ఏఐసిసి అప్రమత్తమైంది. సోనియాగాంధీ ఆరోగ్య కారణాల దృష్టా ఎవరికి అపాయింట్‌మెంట్ ఇవ్వడం కుదరదని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏఐసిసి కార్యాలయం స్పష్టం చేసింది.

ఆ ఇరు వర్గాల్లో ఏ వర్గం చెదిరిపోకుండా ఈ మాసంలో బుజ్జగింపుల ప్రక్రియ కొనసాగించాలని కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌కు పార్టీ హైకమాండ్ దిశానిర్దేశన చేసినట్లు తెలుస్తోంది. తొలుత అభిప్రాయ సేకరణ ద్వారానే ఈ తంతు కొనసాగిందని చెబుతున్నప్పటికీ పార్టీలో లీకులు అసలు విషయాన్ని పసిగట్టడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టిందన్న వాదన లేకపోలేదు. పైపెచ్చు ఆ అభిప్రాయ సేకరణలో పదుల సంఖ్యలో ఎవరికి వారే తమకే పిసిసి పదవి కట్టబెట్టాలంటూ.. తామే అర్హులమంటూ మాణికం ఠాగూర్‌కు విజ్ఞప్తి చేయడం గమనార్హం. సమర్థుడని పేరుగాంచిన మాణికం ఠాగూర్ సైతం ఇక్కడి కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి చూసి కంగుతిన్నట్లు తెలుస్తోంది. ఒకానొక సమయంలో వారిపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఏఐసిసి తాజా ప్రకటన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆశనిపాతంగా మారిందని అంటున్నారు. ఏదో ఒక వంకతో ఢిల్లీకి వెళ్లి టిపిసిసి చీఫ్ ఎంపిక వ్యవహారంపై అధిష్టానం చెవులు కొరికేందుకు ఉన్న ఒక్క అవకాశం మూగబోయింది. ఇదిలా ఉండగా ఢిల్లీలో గురువారం మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

ఎఐసిసి ప్రధాన కార్యదర్శితో విడివిడిగా సమావేశమైన మధుయాష్కీ, సంతోష్‌కుమార్‌లు…
ఏఐసిసి పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన మధుయాష్కీ, సంతోష్‌కుమార్‌లు విడివిడిగా ఎఐసిసి ప్రధాన కార్యదర్శి సి.వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. ఆ ఇద్దరు నేతలు రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయలపైనే మాట్లాడినట్లు సమాచారం. అయితే హైకమాండ్ పెద్దల సూచన మేరకు ఎఐసిసి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని, హైకమాండ్ టాస్క్‌ని అమలయ్యేలా ఒక పక్కా ప్రణాళికను రూపొందించి తదనుగుణంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో సమన్వయం నింపేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా స్థాయి నేతల అభిప్రాయాలను సైతం ఎఐసిసి తెలుసుకోనుందని సమాచారం.

ఈ మారు జిల్లా స్థాయి నేతలతో అభిప్రాయ సేకరణ చేసే ఛాన్స్…!

దీంతో మాణికం ఠాగూర్ త్వరలోనే హైదరాబాద్‌కు వచ్చి జిల్లా స్థాయి నేతల నుంచి మరోమారు అభి ప్రాయ సేకరణ ద్వారా సమాచారాన్ని సేకరించే వీలుందని తెలుస్తోంది. ఓ వైపు నేతల కట్టడి, మరోవైపు సమన్వయం, ఇంకోవైపు అభిప్రాయ సేకరణ తదితర వ్యూహాలతో ఎఐసిసి పార్టీ హైకమాండ్ యోచనను అమలుపర్చబోతోందన్నమాట. జనవరి నాటికి తాననుకున్న విధంగా టిపిసిసి చీఫ్ ఎంపికను ముగించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News