Tuesday, May 21, 2024

ఇప్పుడు తెలంగాణ ఓ నిండుకుండ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో జూన్ 18వ తేదీన మంచినీళ్ల పండుగను నిర్వహిస్తున్నారు. 18న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాలు, గ్రామాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ సమాజంలోని సకల జనులకు సిఎం కెసిఅర్ అందించిన సంక్షేమ ఫలాలు నేడు ప్రతి కంట్లో సంతోషాన్ని, ప్రతి ఇంట్లో ఆనందాన్ని నింపుతున్నాయి. ఈ సంక్షే మ చర్యల్లో తలమానికంగా నిలిచిన పథకాలుగా సాగునీరు, మంచినీటి పథకాలను పేర్కొనాల్సి ఉంటుంది.ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మకమైన మిషన్ కాకతీయతో చెరువులు నీటికుండలయ్యాయి. మిషన్ భగీరథతో గోదావరి నీళ్లు ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నిరంతరాయంగా అందుతున్నాయి. తెలంగాణలోని కోటి ఎకరాలు మాగాణి భూములయ్యాయి. సాగునీటిసంక్షేమ ప్రాజెక్టులతో మన రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాల సాగు నీరు సాధ్యమైంది.

రాష్ట్ర వ్యాప్తంగా రివర్స్ పంపింగ్ ద్వారా సిఎం కెసిఆర్ చెరువులను నిండుకుండల్లా తయారు చేశారు. 60 ఏళ్ల తెలంగాణ సాగు నీటి గోసను తీర్చిన నాయకుడిగా సిఎం కెసిఆర్ చరిత్రలో నిలిచిపోయారు. నీళ్లు లేవని, చెరువులు అలుగులు పారలేదని ఆడపిల్లలను ఇవ్వడానికి సంకటపడిన గ్రామాలు నేడు జనమే జనంగా కళకళలాడుతున్నాయి. నాడు సమైక్య పాలనలో ఎండిన బోర్లు, బీడు భూములు ఎక్కిరించేవి. నేడు చెరువులు, కుంటలు, బోరు బావులు, కాలువలు ఫుల్లుగా నీళ్లతో కళకళలాడుతున్నాయి. తలాపునా పారుతోంది గోదారి, మన చేను.. మన చెలుక ఎడారి అని నాడు పాటలు పడుకున్న చోట నేడు చెరువులు, చెక్ డ్యాంలు, కాలువలు, రిజర్వాయర్లు మండుటెండల్లో నిండుగా ఉన్న నీళ్లతో రైతులంతా సంబురంగా ఉంటున్నారు.

తొమ్మిదేళ్ల క్రితం సాగు నీటి కష్టాలతో తెలంగాణలో బతుకులు ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లా మారినయ్ అని రైతులు గుండె మీద చేయి వేసుకొని నిమ్మళంగా ఉంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రైతుల సాగు నీటి కళలు నెరవేరాయి. అదే విధంగా ప్రజల తాగు నీటి కష్టాలు కూడా తీరాయి. కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువులను మరమ్మతు చేయడం వల్ల నిండు వేసవిలోనూ గ్రామాల్లోని చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంది. సాగు నీటి తిప్పలు తీర్చిన అపర భగీరథుడుగా కెసిఆర్ చరిత్రలో నిలిచిపోయారు.
కాళేశ్వరం అతిపెద్ద నీటి విప్లవం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాగునీటి రంగంలో ఎంతో అభివృద్ధి సాధ్యపడింది. 2009-10లో మహరాష్ట్రకు చెందిన సిరోంచ నుంచి కాళేశ్వరానికి చేరుకోవాలంటే వర్షాకాలం మినహా అన్ని రోజుల్లో సిరోంచ వరకు జీప్‌లో వెళ్లి అక్కడి నుంచి బోట్ ద్వారా కాళేశ్వరం చేరుకోవాల్సి వచ్చేది. ఇక సిరొంచ నుంచి హైదరాబాద్ రావాలంటే సిరొంచ నుంచి చంద్రాపూర్ మీదుగా ఆసిఫాబాద్ చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకోవాల్సి వచ్చేది. ఈ ఒక్క ప్రయాణానికే దాదాపు 9 నుంచి 10 గంటల సమయం పట్టేది. ప్రస్తుతం సిరొంచ నుంచి కాళేశ్వరం మీదుగా హైదరాబాద్‌కు కేవలం నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. ఈ మార్పు కేవలం ఎనిమిదేళ్ల కాలంలోనే జరిగింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టడం వల్ల వర్షాకాలం తప్ప మిగిలిన అన్ని కాలాల్లో అడుగంటిపోయిన భూగర్బ జాలాలతో బ్లాక్ జోన్‌గా ప్రకటించిబడిన ప్రాంతాలు ఇప్పుడు 365 రోజులు 24 గంటల నీటి వసతిని అందించగలుగుతున్నాయి. పత్తి, మొక్కజొన్న పండించే రైతులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కూరగాయలను పండిస్తూ అధికంగా లాభాలను ఆర్జిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో రూ. 4 లక్షలు పలికిన భూమి ధర ప్రస్తుతం రూ.20 నుంచి 25 లక్షలకు చేరిందంటే అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే జరిగింది. తెలంగాణ మాదిరి ఇరిగేషన్ ప్రాజెక్టులు మరే రాష్ట్రంలో లేవు. పదేళ్లలో ఇంత పెద్ద స్థాయిలో ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టిన ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని గుర్తుంచుకోవాలి.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు
ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ-దశ, బహుళార్ధసాధక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్. నీటిపారుదల, తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించడం జరిగింది. అవసరాలు, వివిధ బ్యారేజీల మీదుగా 160 టిఎంసి అడుగుల నిల్వ సామర్థ్యంతో, రిజర్వాయర్లు ప్రతి రోజు 2 టిఎంసిల అడుగుల నీటిని ఎత్తిపోయడం ద్వారా 180 టిఎంసిల అడుగుల నీటిని వినియోగించుకోవాలని ఈ ప్రాజెక్ట్ ఊహించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందించి మూడేళ్లలో రికార్డు స్థాయి లో పూర్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కూడా పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, సీతా రామ ప్రాజెక్ట్ చేపట్టి పనులను వేగవంతంచేసింది. రాష్ట్రంలో ముందస్తుగా చిన్న నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి సారించి ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన చెరువుల పునరుద్ధరణ దిశగా కాకతీయ రాజుల స్ఫూర్తితో మిషన్ కాకతీయ పథకాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. రాజకీయాల కతీతంగా ప్రతి చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టి చెరువులను మరోసారి గంగాళంలా మార్చారు.
మిషన్ భగీరథ: తెలంగాణ తాగునీటి విప్లవం
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 91 లక్షల ఇళ్లకు పైపుల ద్వారా నీటి సరఫరాను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మిషన్ భగీరథను ప్రారంభించింది. ప్రాజెక్ట్‌లో భాగంగా, కృష్ణా, గోదావరి నదుల నుంచి, ప్రధాన రిజర్వాయర్‌ల నుండి తీసిన ఉపరితల నీటిని సక్రమంగా శుద్ధి చేస్తూ ప్రతి ఇంటికి సురక్షితమైన, శుద్ధి చేయబడిన, సమృద్ధిగా కుళాయి నీరు అందించబడుతుంది. రాష్ట్ర అవసరాలను కూడా ఈ ప్రాజెక్టు తీరుస్తుంది. 1.50 లక్షల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న వివిధ పరిమాణాలలో పైప్‌లైన్‌ల గ్రాండ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ సాధ్యపడింది. ఇది భూగోళాన్ని సుమారు నాలుగు సార్లు చుట్టుముట్టే అద్భుతమైన పొడవు. ప్రస్తుతం ఉన్న తాగునీటి మౌలిక సదుపాయాలు ఈ ప్రాజెక్టుతో అనుసంధానించబడ్డాయి.

43,400 కోట్ల రూపాయలకుపైగా అంచనా వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రం మొత్తానికి ప్రతి రోజూ రక్షిత మంచి నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో దేశంలోనే ప్రతి ఇంటికి సరిపడా సురక్షిత మంచి నీటిని ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ ప్రాజెక్టు పారిశ్రామిక అవసరాలకు 10 శాతం నీటిని కేటాయిస్తుంది. ఇది ఉపాధిని సృష్టిస్తుంది, ఆర్థిక వృద్ధికి ఉత్ప్రేరకమవుతుంది. అంతేకాకుండా, ఫ్లోరైడ్ కలుషితమైన భూగర్భ జలాల వినియోగం వల్ల ఫ్లోరోసిస్ బాధిత ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారని ఒకప్పుడు అపఖ్యాతి పాలైన తెలంగాణలో ఫ్లోరైడ్ లేని సురక్షితమైన తాగు నీటిని సాధించడం ద్వారా మిషన్ భగీరథ కూడా చరిత్ర సృష్టించింది. లోక్‌సభలో పంచుకున్న సమాచారం ప్రకారం, రాష్ట్రం లో ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాల సంఖ్య 2015లో 967 నుండి ప్రస్తుతం సున్నాకి పడిపోయింది.

భూగర్భ జలాల నుండి ఉపరితల నీటికి తాగడానికి నీటి వినియోగాన్ని మార్చడం ద్వారా భూగర్భ జల స్థాయిని దాని అసలు స్థితికి పునరుద్ధరించడానికి ప్రాజెక్టు మరింత సహాయపడుతుందని భావిస్తున్నా రు. మరోవైపు, ఈ ప్రాజెక్టు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు, నిర్మాణ రంగంలో, ఇతర రంగాలలో స్థానిక ఉద్యోగాల అవసరాన్ని తీర్చడానికి సహాయపడింది.
ఈ మిషన్‌తో, కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్‌కు తెలంగాణ రోల్ మోడల్‌గా మారింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్‌సభలో ప్రాజెక్టును, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో ఒక్క ఇంట్లో కూడా మహిళలు, బాలికలు తాగునీటి కోసం కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి లేదని ఆయన అన్నారు. మంచినీటికోసం దశాబ్దాలుగా మహిళలు పడుతున్న కష్టాలు మిషన్ భగీరథతో తీరిపోయాయి. నీటిని తీసుకురావడానికి వినియోగించే సమయం బాగా తగ్గిపోయింది. స్వతంత్ర భారత దేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా సిఎం కెసిఆర్ తాగునీటి కష్టాలను తీర్చారు.

ఇతర రాష్ట్రాలలో సగం గ్రామాలకు కూడా తాగునీరు అందని పరిస్థితి ఉంటే తెలంగాణలో ప్రతి ఇంటికీ తాగు నీరు, వ్యవసాయానికి సాగు నీరు అందించి సిఎం కెసిఆర్ చరిత్ర సృష్టించారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణలో చెరువులు నిండుకుండలయ్యాయి. రిజర్వాయర్లు పోటెత్తుతున్నా యి. ప్రతి ఇంటికి మంచినీరు క్రమం తప్పకుండా అందుతున్నాయి. సాగునీటి కరువును, మంచి నీటి కరువును దశాబ్దిలోపే తీర్చిన తెలంగాణ ప్రభుత్వం, కెసిఆర్ దార్శనికతకు నేడు జరుగుతున్న ఈ మంచినీళ్ల పండగ జయకేతనమెత్తుతుందంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News