Sunday, April 28, 2024

పోడు పట్టాల పంపిణీలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ

- Advertisement -
- Advertisement -

గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత సిఎం కెసిఆర్‌దే
రిజర్వేషన్‌ల పెంపుతో గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు
గిరిపుత్రులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్ : ఆదివాసీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని గిరిజన మహిళా – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిపుత్రులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేకంగా గిరిజనులకు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగమని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా గిరిజనుల వెనుకబాటును తొలగించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని తెలిపారు. ఆదివాసీలకు అన్ని మౌళికవసతులు కల్పించడానికి రూ.కోట్లలో నిధులు మంజూరు చేస్తోందన్నారు. ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా గుర్తించి. ‘మా తండాలో మా రాజ్యం’ అనే గిరిజన ప్రజల కలను సాకారం చేసిందన్నారు. గిరిజనులకు పాలనఅధికారం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. గిరిజన రిజర్వేషన్ 10 శాతానికి పెంచి గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు.

అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరి పుత్రులకు ముఖ్యమంత్రి కెసిఆర్ వారిని ఆ భూములకు యజమానులు చేసారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 లక్షల 6 వేల 369 ఎకరాలకు గాను 1లక్ష51వేల 146 పోడు రైతులకు పట్టాలు అందజేయడం జరిగిందన్నారు. అటవీ ఉత్పత్తులపై ఆధారపడ్డ అడవి బిడ్డలకు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. గిరిజన విద్యాభివృద్ధి కోసం రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఇక దక్షిణ భారత కుంభమేళాగా చెప్పుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఉనికిగా చెప్పుకునేలా ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీకైన కుమ్రం భీం జయంతిని అధికారికంగా ఘనంగా జరుపుకుంటున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున బంజారా హిల్స్‌లో 25 కోట్లతో కొమురం భీమ్ ఆదివాసి భవన్ లను నిర్మించుకున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 ఆదివాసీ భవన్ లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందన్నారు. కేస్లాపూర్‌లోని నాగోబా జాతర, కొమురం భీం, జంగు భాయ్ వంటి అనేక ఉత్సవాలకు ప్రతి ఏటా ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తున్నదని వెల్లడించారు. ఈ సందర్భంగా మరో సారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సంద్భ్రంగా గిరిజనులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News