Sunday, May 5, 2024

స్వచ్ఛభారత్‌లో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ

- Advertisement -
- Advertisement -

Telangana is best state in Swachh Bharat all over india

రాష్ట్రాల కేటగిరీలో టాప్

మనతెలంగాణ/హైదరాబాద్ : స్వచ్ఛభారత్ మిషన్ అవార్డుల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల కేటగిరిలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైంది. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులకు తోడు మరో మూడు అవార్డులను రాష్ట్రం దక్కించుకుంది. రాష్ట్రాల కేటగిరిలో, సఫాయి మిత్ర సురక్ష కేటగిరిలో, గార్బెజ్ ఫ్రీ సిటీ రేటింగ్‌లోనూ అవార్డులను దక్కించుకుంది. గత బుధవారం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా తొమ్మిది అవార్డులను దక్కించుకోగా ఈ అవార్డులను ఈనెల 20న ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతు ల మీదుగా అధికారులు అందుకోనున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్ర పట్టణాల్లో చేపట్టిన కార్యక్రమాలకు అవార్డులకు కీలకంగా మారాయి. సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్‌లో భాగంగా రాష్ట్రాల కేటగిరిలో తెలంగాణను ఎంపిక చేశారు. దేశంలోనే రెండు రాష్ట్రాలకు మాత్రమే రాష్ట్ర కేటగిరి అవార్డును ప్రకటించారు.

సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అవార్డులో మూడు లక్షల జనాభా కంటే తక్కువ ఉన్న విభాగంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంపిక కాగా, గ్రేటర్ హైదరాబాద్ గార్బెజ్ ఫ్రీ సిటీ విభాగంలో ఎంపికయ్యింది. సఫాయి సురక్ష మిత్ర ఛాలెంజ్ అవార్డును తొలిసారిగా ప్రవేశపెట్టారు. ఈ అవార్డులో ఎంపికైన పట్టణాలకు నగదు బహుమతిని అందించనున్నారు. మొదటి బహుమతి కింద రూ.8 కోట్లు, రెండో బహుమతి కింద రూ.4కోట్లు, మూడో బహుమతి కింద రూ.2కోట్లను అందించనున్నారు. కరీంనగర్ మరో అవార్డుకు ఎంపిక కాగా ఏ బహుమతికి ఎంపికయ్యిందన్న విషయం అవా ర్డు ప్రదానోత్సవం రోజున ప్రకటించనున్నారు. చెత్త రహిత నగరంగా గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రకటించారు. బుధవారం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో గ్రేటర్ హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, నిజాంపేట, ఇబ్రంహీంపట్నం, కొస్గీ, హుస్నాబాద్, ఘట్‌కేసర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతాలు ఎంపికయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News