Sunday, April 28, 2024

నా భూమికి భరోసా దొరికింది..!

- Advertisement -
- Advertisement -

Telangana new revenue act 2020

తెలంగాణ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెవెన్యూ సంస్కరణలు విప్లవాత్మకమైనవి. ఇది ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే సాధ్యమైంది. అనేక విషయాల్లో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుంది. ఆ ఖాతాలో రెవెన్యూ సంస్కరణల చట్టం కూడా చేరింది. పాలకుడికి విజన్ ఉండాలి. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం కావాలి. అప్పుడే అవి విజయవంతం అయితాయి. ప్రజలు వాటిని స్వాగతిస్తారు. ప్రజా సంక్షేమం, వారి ప్రయోజనమే కేంద్ర బిందువుగా ఆ నిర్ణయాలు ఉండాలి. కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు. ఆ నిర్ణయాలతో అప్పటి దాకా వారికున్నఅధికారాలు, అవకాశాలు తగ్గవచ్చు. దీనితో ఆ వర్గాల నుండి అసంతృప్తి వ్యక్తం కావచ్చు.

ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా పెంచుకోవచ్చు. దీనితో తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందేమో అనే అనుమానంతో పాలకుడు వెనుకడుగు వేయకూడదు. కొందరి కోసం మెజార్టీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టకూడదు. ఈ విషయంలో కెసిఆర్ కఠినంగా ఉంటారనడంలో సందేహం ఏమి లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే , ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కూడా నిండు సభలో అవసరమైతే పన్నులు పెంచుతామని ప్రకటించరు. కానీ కెసిఆర్ ఆ పని చేశారు. ఓట్ బ్యాంకు పాలిటిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని పాలనా చేస్తున్న ఈ రోజుల్లో ఏ ప్రభుత్వమైనా దొడ్డిదారిన పన్నులు పెంచుతుంది. కెసిఆర్ మాత్రం దానికి భిన్నంగా అవసరమైతే పన్నులు పెంచుతామని బాజాప్తాగా నిండు సభలో ప్రకటన చేశారంటే కెసిఆర్ కొన్ని విషయాల్లో ఎంత కఠినంగా ఉంటారో అంటే అర్థం చేసుకోవచ్చు. దీనిని బట్టి కెసిఆర్ ఏదైనా చెప్పి చేస్తారు అని అర్ధం అవుతుంది. అది ఉద్యమ సమయమైనా, పాలనా కాలంలోనైనా ఒకటే ధోరణి కనపడుతుంది.

ఇంటింటికి మంచి నీళ్లు ఇవ్వలేకపోతే ప్రజలను ఎన్నికలలో ఓట్లు అడగమని కూడా గతంలో నిండు సభలో కెసిఆర్ ప్రకటించిన విషయాన్నీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ధైర్యం ఉంటే ఆ ప్రకటన చేసి ఉంటారో ఆలోచించండి. అలాగే సమగ్ర సర్వే కోసం అందరికి సెలవు ప్రకటించి. ఒక్క రోజులో యావత్ తెలంగాణ సమగ్ర సమాచారాన్ని సేకరించిన ఘనత కూడా కెసిఆర్‌కే దక్కింది. ఇలాంటి సంచలన నిర్ణయాలను తీసుకోవాలంటే ప్రజల మీద నమ్మకం ఉండాలి. అలాగే ధైర్యం కూడా కావాలి. అది కెసిఆర్‌లో కనపడుతుంది. ఎవరు ఏమనుకున్నా విపక్షాలు ఎంత గోల చేసినా ఫర్వాలేదు, కొన్ని నిర్ణయాలు కొంత మందికి ఇబ్బంది కలిగించవచ్చు. కానీ అంతిమంగా ప్రజలకు మేలు చేసేవిగా పారదర్శకమైన పాలన అందించే లక్ష్యంగా ఆ నిర్ణయాలు ఉండాలనే భావనతో అయన అడుగులు వేస్తూ వస్తున్నారు. దానిలో భాగమే రెవెన్యూ సంస్కరణలు తెస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అంతులేని కథలా భూ వివాదాలు, కబ్జాలు ఉన్నాయి. కోర్టు కేసు సంగతి సరే సరి. వీటికి కారణం ఏమిటి? భూమి పత్రాలు సరిగ్గా లేకపోవడం, ఉన్నా అవి గందరగోళంగా ఉండడం ఒక కారణమైతే, దీనికి తోడు రెవెన్యూ రికార్డులు కూడా సరిగ్గా లేకపోవడం మరో కారణం. వీటికి తోడు కొంత మంది అవినీతి ఉద్యోగుల అలసత్వం, నిర్లక్ష్యం కూడా భూమి వివాదాలకు, కబ్జాలకు కారణమయ్యాయి. భూమి మీద ప్రతి ఒక్కరికీ మమకారం, ప్రేమ ఉంటాయి. భూమి ఆత్మవిస్వాశానికి ప్రతీక. కుంట ఉన్నా, సెంటు ఉన్నా అది వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి వర్గాల వారు, రైతులు భూమిని నమ్ముకుని బతుకుతారు. ఆ భూమే వారి జీవనాధారం. అలాంటి భూమి వారికి దక్కకుండా పోతేనో… లేదా వారి భూమికి సంబంధించిన పత్రాలు వారికి అందకపోతేనో… ఒక వేళ అందినా ఆ పత్రాలలో తప్పులు దొర్లితేనో వారిలో నెలకొనే ఆందోళన ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

తమ భూమికి సంబంధించిన పత్రాలు లేకపోతే అది తమకు దక్కకుండాపోతుందేమో అనే భయం వారిని వెంటాడుతుంది. దీనికి తోడు కొంత మంది అవినీతి ఉద్యోగుల నిర్లక్ష్యం, అలసత్వం, వేధింపులు రోజుల తరబడి వారిని కార్యాలయం చుట్టూ తిప్పుకోవడంతో వారిలో ఆందోళన పెరిగి వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు కూడా చూశాం. అలాగే అక్కడక్కడా తమలో ఉన్న ఆందోళనతో ఉద్యోగస్థుల మీద దాడులకు పాల్పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఇందుకు రెవెన్యూ సంస్కరణలు చాలా అవసరం . ముఖ్యమంత్రిగా కెసిఆర్ బాధ్యతలు చేపట్టాక రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేసుకోవాలి. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దాలని భావించారు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు.

సాగునీటి, విద్యుత్ రంగాలతో పాటు సంక్షేమ రంగంపై దృష్టి పెడుతూనే చట్టాలలో సంస్కరణలు తేవాలని సంకల్పించారు. మున్సిపల్, పంచాయితీ రాజ్ చట్టాలలో సంస్కరణలు తెచ్చారు. ఇందులో ప్రజాప్రతినిధులను కూడా బాధ్యులను చేశారు. ప్రాజెక్ట్‌లను రీడిజైన్ చేశారు. సకాలంలో కాళేశ్వరం ఇతర ప్రాజెక్ట్ లను పూర్తి చేసి సాగు నీరు, తాగు నీరు అందించారు. దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలు అమలు చేసి దేశం తెలంగాణ వైపు చూసేలా చేశారు. తెలంగాణ పారిశ్రామిక విధానం (TS IPASS) ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించే స్థాయిలో ఉందంటే కెసిఆర్ ముందు చూపుకి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అంతేకాదు వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం తెస్తున్న సంస్కరణాలు కూడా దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపాయి. నియంత్రిత సాగు విధానాన్ని రైతులు స్వాగతించారు. ఇలా చెప్పుకుంటూపోతే అనేక విషయాలలో ముఖ్యమంత్రి కెసిఆర్ తెస్తున్న సంస్కరణలను ప్రజలు స్వాగతిస్తున్నారు. అయన వెంట నడుస్తున్నారు. వారి విశ్వాసాన్ని కెసిఆర్ చూరగొంటున్నారు.

బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెవెన్యూ సంస్కరణలకు కూడా ప్రజలు నీరాజనాలు పట్టారు. దీనిని బట్టి ప్రజలు ఇప్పుడున్న చట్టాలపట్ల , వ్యవస్థ పట్ల ఎంత విసిగి వేసారి ఉన్నారో అర్ధం అవుతుంది. ఇంతగా జనం విసిగిపోయారంటే కారణం ఏమిటి…? కారకులు ఎవరో అర్ధం చేసుకోవాలి. అవినీతి ఉద్యోగులు కొంత కారణం అయితే లోపభూయిష్టంగా, సామాన్యులకు అర్ధం కాని రీతిలో ఉన్న చట్టాలు కూడా మరో కారణం. ప్రభుత్వం వీటన్నిటిని గమనించి చట్టాన్ని సులభతరం చేయడంతో పాటు పారదర్శకతతో కూడినదిగా ఉండాలని భావించింది. అందులో భాగమే ఈ సంస్కరణలు. భూమి కొన్న వెంటనే మ్యుటేషన్ అయ్యే విధంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ను ఒకే గొడుగు కిందకు తెస్తూ చట్టం తెచ్చారు.

అలాగే బ్యాంకు పాస్‌బుక్‌లో ఎలాగైతే డెబిట్ క్రిడెట్ ఉంటుందో పట్టాదారు పాస్ బుక్‌లో కూడా రైతు భూమి కొన్నా, అమ్మినా ఆ పాస్ బుక్‌లో ఎంట్రీ అవుతుంది. అక్కడికీ, ఇక్కడికీ తిరిగే పని లేకుండా, అలాగే భూ వివాదాలను త్వరితిగతిన పరిష్కరించే విధంగా ఇప్పుడున్న రెవెన్యూ కోర్టుల స్థానంలో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ ఈ సంస్కరణలు తెచ్చారు. ఇప్పుడున్న గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తూ కూడా చట్టం తెచ్చారు. దీనిని యావత్ తెలంగాణ సమాజం హర్షించింది. స్వాగతించింది. ఎందుకంటే విఆర్‌ఒ వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు, డబ్బుకు లొంగి రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడం లేదా తప్పులు తడికలా తయారు చేయడం, కొందరికి అన్యాయం చేయడం, వివాదాలకు కారణం కావడం లాంటి చర్యలకు కొందరు పాల్పడుతున్నారు. దీంతో విసిగిపోయిన ప్రజలు బుధవారం ప్రభు త్వం తెచ్చిన కొత్త చట్టాన్ని స్వాగతించారు.

ఏదిఏమైనా ప్రభుత్వం తెచ్చిన రెవెన్యూ సంస్కరణలు పేదలకు, సామాన్యులకు బాసటగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ చట్టం భూబకాసురులకు, భూ కబ్జా కోరులకు మూకతాడు వేస్తుందని చెప్పవచ్చు. అన్నిటి కన్నా ముఖ్యంగా పేద, మధ్య తరగతి వర్గాల వారికి భరోసా దొరికింది. తమ ఎటూ పోదని హ్యాపీగా వారు గుండె మీద చెయ్యి వేసుకొని నిద్రపోయే విధంగా ఈ చట్టం ఉంది.

పి.వి శ్రీనివాసరావు- (సీనియర్ జర్నలిస్టు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News