Sunday, April 28, 2024

డిజిటల్ విద్య-వ్యత్యాసాలు

- Advertisement -
- Advertisement -

digital education-differences in india విపత్తు మనుషులను కలపాలి. బాధితులందరూ సంఘటితంగా దానిని ఎదుర్కోవాలి. ప్రళయ కాలంలో సాధారణంగా అదే జరుగుతుంది. అందుకు విరుద్ధంగా కరోనా (కోవిడ్ 19) వైరస్ మానవాళిని విడదీస్తున్నది. ప్రాణ భయంతో ఎవరికి వారు మరింత ఒంటరితనంలోకి వెళ్లిపోతున్నారు. అత్యంత సన్నిహితులను సైతం అంటరానివారుగా చూస్తున్నారు. బంధుత్వాలు, స్నేహాలు కూడా దూరానికి అలవాటుపడిపోయాయి. కరోనా కాలంలో వివిధ రంగాలు కుంటువడకుండా చూసేందుకు ఆశ్రయించే తరణోపాయాలు సైతం వ్యత్యాసాలను పెంచేవిగానే ఉంటున్నాయి. ఆరు మాసాలుగా పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులు చదువుకు దూరమయ్యారు.

విద్యా సంవత్సరాన్ని రద్దు చేసుకోక తప్పని దుస్థితి ఎదురవుతున్నది. పరీక్షార్థులను ఎన్నో వ్యయ ప్రయాసలకు గురి చేస్తూ జెఇఇ మెయిన్స్, నీట్‌లను జరిపించడానికి నిర్ణయించారు. వివిధ క్లాసుల విద్యార్థులకు ఆన్‌లైన్ బోధనే శరణ్యమవుతున్నది. ఈ బోధనకు ప్రతి విద్యార్థి ఇంట ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరి. అసలే చెప్పనలవికాని ఆర్థిక వ్యత్యాసాలున్న దేశం మనది. నిరుపేదరికంలో కొట్టుమిట్టాడుతూ రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు అసంఖ్యాకంగా ఉన్న భారత దేశంలో అత్యధిక జనాభా దారిద్య్రంలో మగ్గిపోతున్నది. అందుచేత డిజిటల్ విద్యకు చాలా మంది విద్యార్థులు అనర్హులేనని రూఢి అవుతున్నది. ఇది జ్ఞానార్జనలో అసమానతను మరింత పెంచుతుంది. ఇంటర్నెట్ ఉన్న ఇళ్లల్లోని విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకోడం, జూమ్ తరగతులకు హాజరు కావడం, డిజిటల్ పాఠ్యగ్రంథాలు చదువుకోడం సునాయాసమవుతుంది.

అయితే ఇంటర్నెట్ సౌకర్యం విషయంలో దేశంలో రాష్ట్రాల మధ్య చెప్పనలవికాని తేడాలు బయటపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం గల ఇళ్లు 70 శాతానికి మించి ఉండగా, ఒడిశా గ్రామీణ ప్రాంతాల్లో 6 శాతం కంటే తక్కువ ఇళ్లల్లోనే ఈ సౌకర్యం ఉంది. అంటే ఒడిశాలో ఆన్‌లైన్ విద్యా బోధనా ఎంతటి అసంభవమైన విషయమో స్పష్టపడుతున్నది. 201718 సంవత్సరానికి జాతీయ గణాంక సమాచార సంస్థ (ఎన్‌ఎస్‌ఒ) జరిపిన అధ్యయన నివేదికలో ఈ వ్యత్యాసాలు బయటపడ్డాయి. దేశం మొత్తం మీద సగటున ప్రతి పదింటిలో ఒక ఇంటిలోనే డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ ట్యాబ్లెట్ ఏదో ఒక రూపంలో కంప్యూటర్ ఉన్నట్టు వెల్లడయింది. స్మార్ట్‌ఫోన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే స్థిర లేదా సంచార ఇంటర్నెట్ కనెక్షన్ దేశంలోని నాలుగోవంతు ఇళ్లల్లో ఉన్నట్టు తేలింది. ఇందులోనూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య విపరీతమైన వ్యత్యాసం బయటపడింది.

నగరాల్లో 42 శాతం గృహాలకు నెట్ సౌకర్యం ఉంది. గ్రామీణ భారతంలో కేవలం 15 శాతం ఇళ్లే ‘నెట్టిళ్లు’. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లోనే సగానికి మించిన గృహాల్లో నెట్ సదుపాయం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ అంతగాలేని నేపథ్యంలో కరోనా కారణంగా ఊళ్లకు తరలివెళ్లిపోయిన కోట్లాది విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన ఎలా సాధ్యమనే ప్రశ్న నిలువెత్తున దర్శనమిస్తుంది. నెట్ సౌకర్యం ఉన్న ఇళ్లల్లో కూడా దానికి సంబంధించిన పరిజ్ఞానం గల వారు లేకపోడం మరో సమస్య. ఐదేళ్లు పైబడిన వయసులోని భారతీయుల్లో 20 శాతం మందికే డిజిటల్ అక్షరాస్యత ఉన్నట్టు ఎన్‌ఎస్‌ఒ నివేదిక తెలియజేసింది. 15 నుంచి 29 ఏళ్లు అంటే పై చదువులు, ఉద్యోగాల్లో ప్రవేశించే వయసులోని వారిలో కూడా 40 శాతం మందికే డిజిటల్ జ్ఞానం ఉంది. ఈ శాతాలు బాగా పెరిగితేగాని మొత్తం విద్యాబోధన, ఆర్జన డిజిటల్ రూపెత్తడానికి వీలుండదు. అంతవరకు ముఖ్యంగా నిరుపేద గ్రామీణ నేపథ్యం గల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతి గది బోధనే శరణ్యమవుతుంది.

నిత్యం అధిక లాభార్జన దృష్టితో నడిచే ప్రైవేటు విద్యాలయాల యాజమాన్యాలు ఆన్‌లైన్ విధానం వైపే మొగ్గి సిబ్బందిని తగ్గించుకోడానికి , విద్యార్థుల నుంచి అమితంగా ఫీజులు గుంజుకోడానికి వెనుకాడకపోవచ్చు. ఇది కూడా పేద విద్యార్థులకు హాని చేసే అంశమే. డిజిటల్ విద్యాబోధన పేరు చెప్పి తరగతులకు తాళాలు వేస్తే పేద కుటుంబాలలోని పిల్లలు నిరక్షరాస్యులుగానే కొనసాగి దేశ వికాసానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. అసోం వంటి రాష్ట్రాల్లోనైతే 98 శాతం గ్రామీణ పేద గృహాలకు ఇంటర్నెట్ సౌకర్యం లేదు. సాంకేతిక విప్లవం జన జీవనంలో సంపూర్ణంగా ప్రతిఫలించాలంటే ఆ స్థాయిలో దేశ ప్రజల ఆర్థిక స్తోమత కూడా పెరగవలసి ఉంది. ధనవంతులు మరింత ధనికులై, పేదలు ఇంకా పేదరికంలో కూరుకుపోతున్న కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థలో అటువంటి మార్పు అసంభవమే. అందుచేత దేశ పాలకులు నిరుపేద ఇళ్లకు కూడా కంప్యూటర్, నెట్, టెలివిజన్ అందుబాటును కలిగించడం పట్ల శ్రద్ధ చూపవలసి ఉంది. అది జరిగితేగాని డిజిటల్ విద్య అందరికీ అందుబాటులోకి రాదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News