Friday, March 29, 2024

తెలంగాణ కవిత్వాన్ని తూచిన తరాజు

- Advertisement -
- Advertisement -

ప్రాంతీయ అస్తిత్వ స్పృహ, లోతైన విశ్లేషణ, తులనాత్మక పరిశీలన, ఖచ్చితమైన సూత్రీకరణ కాంచనపల్లి విమర్శకు ప్రధాన లక్షణాలు. కవిగా, జర్నలిస్టుగా సుప్రసిద్ధులైన కాంచనపల్లి గోవర్ధన రాజు మంచి విమర్శకులు కూడా . ఇటీవల విడుదలైన వీరి తరాజు సాహిత్య వ్యాసాలు తెలుగు సాహిత్యానికి ఒక మంచి చేర్పు. ఒక వ్యాసం రాయవలసి వస్తే ఎంత లోతుగా అధ్యయనం చేయాలో కాంచనపల్లి వ్యాసాలను పరిశీలిస్తే అవగతం అవుతుంది. సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతనే అంశానికి సంబంధించి ఆధార గ్రంథాలను పరామర్శ గ్రంథాలను లోతుగా పరిశీలించిన తర్వాతనే వ్యాసం రాయడం మొదలుపెడతారని తరాజు వ్యాసాలు నిరూపిస్తున్నాయి. ‘కవిత్వమైన తెలంగాణ’ అనే వ్యాసంలో తెలంగాణ సాహిత్య వికాసాన్ని సంక్షిప్తంగా ఆవిష్కరించారు. ఆధునిక కవిత్వంలోని తెలంగాణ ఔన్నత్యాన్ని, భాషా స్పృహను, వస్తు స్పృహను సోదాహరణంగా పరామర్శించారు. వికేంద్రీకృత పాలనతో పాటు వికేంద్రీకృత సాహిత్యము సంస్కృతి సమర్థించతగినది స్వాగతించదగినది అనే విమర్శకుడి సూత్రీకరణ అతని ప్రాంతీయ ఆస్తిత్వ స్పృహ ను తెలియజేస్తున్నది.

‘కవిత్వం వ్యక్తీకరణ నైపుణ్యాలు’ అనే వ్యాసం నూతనంగా సాహిత్యంలోకి ప్రవేశించే యువకవులకు దిక్సూచి వంటిది. ఈ వ్యాసంలో కవిత్వ ఆవిర్భావ వికాసాలతో పాటు వస్తువులు ఎన్నుకోవడం గురించి తెలియజేస్తూ కవి వస్తువును ఎన్నుకోవడానికి ప్రధానంగా సమకాలీన సామాజిక పరిస్థితులు తాత్విక నేపథ్యం కవి వ్యక్తిత్వం దోహదం చేస్తాయని తెలియజేశారు. కవిత్వ నిర్మాణంలో మరొక కీలకమైన అంశం శీర్షిక. శీర్షికను ఎంపిక చేయడంలో కవులు ఎంచుకునే వివిధ టెక్నిక్స్ ఉదాహరణలతో సహా వివరించారు. కవిత్వ నిర్మాణంలో ఎత్తుగడ ప్రధానమైనది.పాఠకుడిని చదివించగలిగేది ఎత్తుగడ మాత్రమే. అందుకే కాంచనపల్లి ’కవి రచనాభ్యాసం ఎంత పదునుగా ఉంటే అంత గాఢంగా అతని నిర్వహణ ఉంటుంది. నిర్వహణ ఎంత పటిష్టంగా ఉంటే ఎత్తుకోవడం అంత ప్రభావవంతంగా ఉంటుంది ’ అని తేల్చి చెప్పారు. కవిత్వం నిర్మాణంలో నిర్వహణ ముఖ్యమైనది.

తాను చెప్పదలుచుకున్న అంశాన్ని పాఠకుడికి పూర్తిస్థాయిలో చేరవేయాలి అంటే కవి సమర్థవంతమైన నిర్వహణ చేయగలగాలి. ప్రతీకలు అనుభూతి వంటి ఈస్తటిక్స్ కవిత్వ నిర్వహణలో ఎంతో దోహదపడతాయన్నారు. ఒక వస్తువును కవిత్వాన్ని చేయడంలో ప్రతీకలు ప్రధానమైనవి. వీటిని ఎలా ప్రయోగించాలో అనేక ఉదాహరణల ద్వారా కాంచనపల్లి వ్యాసంలో సమగ్రంగా వివరించారు. పద చిత్రాలు భావ చిత్రాలు కవిత్వానికి ఎలాంటి సొగసులు అద్దుతాయో తెలియజేశారు. కవిత్వం రాయడం మొత్తం ఒక ఎత్తు అయితే ముగింపు అనేది మరొక ఎత్తు. మొత్తం కవిత చదివిన పాఠకుడికి ముగింపు చక్కని అనుభూతిని కలిగించాలి. మార్మిక ప్రతీకలతో, సంభోదనాత్మక అభ్యర్థనతో, కొన్నిసార్లు ఆశ్చర్య ప్రశ్నార్థకాలతో కవిత ముగిసే సందర్భాలను ఊటంకించారు.

‘దీర్ఘ కవితల్లో తెలంగాణ’ అనే వ్యాసంలో తెలంగాణ ఉద్యమంలో కవుల కాంట్రిబ్యూషన్, అందులోనూ ప్రత్యేకించి దీర్ఘ కవితలు వ్యక్తీకరించిన ఆకాంక్షలను కాంచనపల్లి పరిశోధనాత్మకంగా వివరించారు. ప్రజల ఆర్తిని వాంఛను బలంగా సమగ్రంగా దీర్ఘ కవితలు చిత్రీకరిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాసంలో దీర్ఘ కవిత పరిణామ క్రమ చరిత్రను వివరించడంతో పాటు దీర్ఘ కవిత లక్షణాలు, తెలంగాణ నుండి వచ్చిన దీర్ఘ కవితలను సవివరంగా తెలియజేశారు. పసునూరి రవీందర్ లడాయి, అందోజు పరమాత్మ డిసెంబర్ 9, వి ఆర్ శర్మ తెలంగాణ, హిమ జ్వాలా తెలంగాణ పల్లె, కందుకూరి శ్రీరాములు నన్నుగన్న నా నేల, డప్పోళ్ల రమేష్ వలపోత, ఏనుగు నరసింహారెడ్డి మట్టి పాట, వాసరవేణి పరశురాం ఓ స్వార్థ రాజకీయ నాయకుల్లారా!, కాంచనపల్లి ఇప్పుడు నీ తెలంగాణ, తండ్లాట, ప్రసేన్ కలిసి ఉందాం రా, జూలూరు గౌరీ శంకర్ రాసిన చెకుముకి రాయి, నా తెలంగాణ వంటి అనేక దీర్ఘ కవితలు ఈ వ్యాసంలో సందర్భానుసారం చర్చించబడ్డాయి. ఉద్యమ ఆవేశంలో, సూటిగా చెప్పాలన్న కోరిక వల్ల కొన్నిచోట్ల దీర్ఘ కవితల్లో వచనం డామినేట్ చేసిందన్న సత్యాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు కాంచనపల్లి. నిజమైన విమర్శకుడి లక్షణం ఇది. ఉద్యమ కవిత్వానికి ఇదొక లక్షణం కూడా అని తేల్చి చెప్పారు..

తరాజులో మరొక పరిశోధనాత్మక వ్యాసం ’సాహిత్యంలో ఎలిజి పరిణామ దశ’. ప్రాచీన గ్రీకు సాహిత్యం మొదలు ఆధునిక కవిత్వంలో ఎలిజీల వరకు స్మృతి కావ్యాల చరిత్రను చక్క గా వివరించారు. ఇటీవల కాలంలో విరాటపర్వం సినిమాగా వచ్చిన సరళ హత్యోదంతంపై 1994 లోనే డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి సరళా ఓ సరళా! అనే కవిత రాశారు. ఆ కవితను కాంచనపల్లి తన వ్యాసంలో కవి సరళ స్మృతిని వ్యక్తీకరించిన విధాన్ని ప్రస్తావించారు. హృదయ వాదం ఎలిజికి మాతృక అని, ఎలిజికి ప్రతీక అనివార్యం కాదని చక్కని సూత్రీకరణ చేశారు. ఈ వ్యాసం రాసి సుమారు మూడు దశాబ్దాలు గడిచినా నేటికీ ఎంతో ప్రాసంగికతను కలిగి ఉన్నది.

కాంచనపల్లికి తెలంగాణ నేలపై ఎనలేని ప్రేమ. తన వ్యాసాల్లో అగ్ర భాగం తెలంగాణ ఔన్నత్యాన్ని చాటే కవిత్వం పైనే కనిపిస్తాయి. ఆ కోవలోనిదే మరొక వ్యాసం’ కవుల సంగమమైన తెలంగాణ ఉద్యమం’ తెలంగాణ భావజాల వ్యాప్తిలో భాగంగా కవులు సృజించిన కవిత్వం తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిందని, అందుకోసం తెలంగాణ ఉద్యమం కవిత్వం మమేకమైన తీరును కాంచనపల్లి ఈ వ్యాసంలో చర్చించారు. 1952 కాలంనుండి ప్రధాన స్రవంతిలో ఉన్న కవి గొంతుకలు విశాలాంధ్రకు తలలూపినవి అనే చారిత్రక సత్యాన్ని తెలియజేశారు. దాశరధి సినారె కాళోజి గర్రెపల్లి సత్యనారాయణ రాజు వంటి కవులు కూడా ఇందుకు మినహాయింపు కాదని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో పుట్టిన కవిత్వంలో ఆర్తి ఆవేశం ధ్వనిస్తే ఉద్యమానంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత వచ్చిన కవిత్వంలోని పరిణామాలను చక్కగా చిత్రించిన వ్యాసం’ తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతర కవిత్వం – ఒక పరిశీలన’. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం కొంతమంది కవులు ప్రభుత్వ విధేయులుగా ముద్ర వేయించుకున్నారని, మరి కొంతమంది ప్రభుత్వ వ్యతిరేక దృక్పథాన్నే ప్రదర్శించడం జరుగుతుందని ఈ సంఘర్షణలో సాహిత్యం కొంత స్తబ్దతకు లోనైనదని విశ్లేషించారు. సామాజిక మాధ్యమాల పుణ్యమా అని వస్తున్న అకవిత్వాన్ని కూడా ఈ వ్యాసంలో ప్రస్తావించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు కొత్త కవులను సమాజానికి పరిచయం చేశాయి అనడంలో అతిశయోక్తి లేదు. అనేకమంది కవులు ప్రత్యేకించి కవయిత్రులు ప్రపంచ మహాసభల స్ఫూర్తితో నూతనంగా పుస్తకాలు అచ్చు వేస్తున్న విషయాన్ని గమనిస్తాం. ఈ అంశం వ్యాసకర్త ప్రస్తావించి ఉంటే బాగుండేది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కొన్ని సంఘటనల పట్ల ఉద్యమాల పట్ల స్పందనగా రావలసినంత కవిత్వం రాలేదనే వ్యాసకర్త అభిప్రాయం అక్షర సత్యం.
తెలంగాణ కవనజ్వలనం దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కవిత్వంలో ఉద్యమ ఆవేశం ఎంతగా ఉంటుందో అంతే స్థాయిలో సౌందర్యోపాసనను గమనించవచ్చు. దీనిని పట్టి చూపే వ్యాసం ’దాశరధి కవిత్వం సౌందర్య దృక్పథం.’ సాంప్రదాయక కవిత్వ ప్రతినిధి విశ్వనాథ, భావ కవితా ప్రతినిధి కృష్ణశాస్త్రి, అభ్యుదయ కవితా ప్రతినిధి శ్రీశ్రీ ల ప్రభావం దాశరథిపై ఉంది అని ఈ వ్యాసంలో సాధికారికంగా నిరూపించారు. దాశరధి కవిత్వంలోని అనుభూతి సౌందర్యం, రస నిష్పత్తి తదితర అంశాలను క్షుణ్ణంగా చర్చించారు.
మహాకవి సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని పరామర్శించిన వ్యాసం ’అజేయ సాహితీ జైత్రయాత్రికుడు సినారె’. సినారె సాహిత్యం పై ఆయన పుట్టి పెరిగిన ప్రాంతాల,పరిస్థితుల ప్రభావం, గేయ నిర్మాణంలో సినారె శైలి ఈ వ్యాసంలో స్పృశించారు. డాక్టర్ సినారె పై ఈ వ్యాసకర్తకు అభిమానం మెండు. అందుకే సి నారాయణ రెడ్డి పై రాసిన మరొక వ్యాసం కూడా తరాజులో దర్శనమిస్తుంది. నా జ్ఞాపకాల్లో సినారె అనే వ్యాసంలో సినారెతో కాంచనపల్లికి గల గురు శిష్య అనుబంధాన్ని కళ్ళ ముందు ఉంచారు. ఈ వ్యాసం సినారె వ్యక్తిత్వాన్ని పట్టి చూపుతుంది. తెలుగు సాహిత్యంలో పరిచయం అక్కరలేని మరొక ప్రసిద్ధ అభ్యుదయ కవి ఎస్ వి సత్యనారాయణ. ఆయన కవిత్వంలోని కొత్త కోణాలను ఆవిష్కరించిన వ్యాసం ’ సమాంతర స్వాప్నికుడు కవి యస్ వి.’
వస్తువులో, భాషలో తెలంగాణ సంస్కృతికి పట్టం కట్టిన కవి అన్నవరం దేవేందర్.

వీరి సాహిత్య ప్రయాణాన్ని పరామర్శించిన వ్యాసం ’ఆత్మగలకవి అన్నవరం ’. తెలంగాణ వాదిగా, బహుజన వాదిగా అన్నవరం దేవేందర్ ను నిరూపించిన వ్యాసమిది. ఆచార్య ఎన్ గోపి కవిత్వ విలక్షణతను చాటిన వ్యాసం ’వెనుదిరిగి చూడని ఆ అడుగులో’. ఆచార్య ఎన్ గోపి కవిత్వం అనేక భాషల్లోకి అనువాదం అయింది. ఈ నేపథ్యంలో అనువాద రచయితల స్పందన వుటంకిస్తూ రాసిన వ్యాసం ఇది. మూడు దశాబ్దాలకు పైగా అస్తిత్వ స్పృహతో కవిత్వం రాస్తున్న కవి బాణాల శ్రీనివాసరావు. వారి కుంపటి కవిత్వాన్ని పరామర్శిస్తూ ఒక కవిత ఇరవై కోణాలు వ్యాస సంకలనంలో రాసిన వ్యాసం ’కవిత్వమై వెలిగిన కుంపటి – బాణాల’. ఇటీవల కాలంలో రుబాయీ ప్రక్రియలో తెలుగులో వచ్చిన విశిష్ట గ్రంథం తెలంగాణ రుబాయిలు. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి రాసిన ఈ గ్రంథంపై అనేక విశ్లేషణ వ్యాసాలు వచ్చాయి. వాటిలో చెప్పుకోదగ్గ వ్యాసం కాంచనపల్లి రాసిన ’ఏనుగు నరసింహారెడ్డి రుబాయిలు – ఒక పరిశీలన’ రుబాయిల లక్షణాలు, తెలంగాణ రుబాయీల నేపథ్యం, సామాజిక వాస్తవికత, ప్రకృతి వర్ణనలు సాంస్కృతిక చిత్రణ తదితర అంశాలు ఈ వ్యాసంలో సవివరంగా కనిపిస్తాయి. గజేంద్ర మోక్షం ఘట్టాన్ని వైవిధ్యమైన కోణంతో రాసిన గ్రంథం మకర హృదయం.

అనుమాండ్ల భూమయ్య రాసిన ఈ పద్య కావ్యం లోని మానవీయ కోణాలను కాంచనపల్లి హృద్యంగా చూపించారు. పద్యాన్ని ధారాశుద్దిగా నడిపించగల నేటి పద్య కవులలో అగ్రశ్రేణికి చెందిన కవి ఆచార్య ఫణీంద్ర. వీరి తెలంగాణ మహోదయం పద్య కావ్యాన్ని పరిచయం చేస్తూ ఫణీంద్ర కవిత్వ పద్య నిర్మాణ నిపుణతను చాటి చెప్పారు. తెలంగాణ జీవద్భాషలో కవిత్వం రాస్తున్న కవి పొన్నాల బాలయ్య. దళిత బహుజన జీవితాలను చిత్రిస్తున్న బాలయ్య కవిత్వాన్ని, జీవద్భాషా సొగసులను తెలియజేపిన వ్యాసం ’ దళిత కవిత్వపు కొత్త నిట్టాడి – పొన్నాల బాలయ్య’. అద్దంకి గంగాధర కవి రాసిన తపతి సంవరణోపాఖ్యానం కాలంనాటి అభివ్యక్తిని, కథన వైశిష్ట్యాన్ని గురించి రాసిన వ్యాసం కాంచనపల్లికి ప్రాచీన సాహిత్యం పై గల సాధికారతను నిరూపిస్తున్నది. ఈ సంపుటిలో అత్యంత లోతైన తాత్వికత కలిగిన వ్యాసం ’కవి అతని దుఃఖంతో నేను ’. బిఎస్ ఎం కుమార్ కవిత్వ సంపుటి దేవుడు చనిపోయిన టి టేబుల్ అనే పుస్తకానికి రాసిన ముందుమాట ఇది. కవిత్వము లోతులు తెలిసిన పాఠకులు మాత్రమే దీనిని అవగాహన చేసుకుంటారు అనిపిస్తుంది. వాసర చెట్ల జయంతి కవిత్వం పై రాసిన వ్యాసం, దేవనపల్లి వీణా వాణి కవిత్వం పై రాసిన వ్యాసం చదివించేవిగా ఉన్నాయి. ఈ వ్యాసాలు చదవడం ద్వారా ఆ కవిత్వం చదవాలన్న ఆసక్తిని పాఠకులలో కలిగించేవిగా ఉన్నాయి.

ఇటీవల కాలంలో చక్కని అభివ్యక్తితో రాస్తున్న ఓరుగల్లు యువకవి డాక్టర్ మడత భాస్కర్. ఈ కవిలోని వస్తు స్పృహను కాంచనపల్లి చక్కని వ్యాసంగా రాశారు. విలాసాగరం రవీందర్ నది పలికిన వాక్యం, వనపట్ల సుబ్బయ్య మశాల్ దీర్ఘకావ్యం కవిత్వ విశిష్టతను ప్రకటించే వ్యాసాలు ఈ సంపుటిలో ఉన్నాయి. విప్లవ కవిత్వ నేపథ్యంలో వచ్చిన అజ్ఞాత కవిత వికాసం వ్యాసం ద్వారా విప్లవ కవిత్వ ఉద్యమ నేపథ్యం, సామాజిక అవగాహన భౌతిక ఆచరణ తదితరాంశాలను చర్చించారు. యెన్నం ఉపేందర్ నారుమడి పై రాసిన వ్యాసం దళిత బహుజన అస్తిత్వ స్పృహను ప్రకటిస్తున్నది. ఆశారాజు కవిత్వం వెన్నెల దర్పణంలో ప్రతిఫలించిన హైదరాబాద్ సంస్కృతిని మరొక వ్యాసంలో చిత్రించారు.

మానేపల్లి కవిత్వం ’ఓడిపోతానని తెలిసి కూడా ’ ప్రపంచీకరణ నేపథ్యంలో కవి స్పందనను చూపిస్తున్నది. అటల్ బిహారీ వాజపేయి రాసిన కవిత్వాన్ని జలజం సత్యనారాయణ శిఖరం పేరుతో అనువదించారు. వాజపేయి కవితాత్మను జలజం ఆవిష్కరించిన రీతిని కాంచనపల్లి మరో వ్యాసంలో వివరించారు. తెలంగాణ ఉద్యమ కవిత్వం రాసిన వేణు శ్రీ ని అభినందించారు. ప్రముఖ సామాజికవేత్త నిర్మల కవిత్వాన్ని, బంగారు తెలంగాణ ఆకాంక్షను ప్రశంసించారు. జ్వలిత కవిత్వం అగ్ని లిపిని అభినందించారు. అమ్మంగి వేణుగోపాల్ కవిత్వ నిర్మాణ పటిమను కొనియాడారు. విశ్రాంత విద్యాధికారి రామేశ్వర రాజు కవిత్వంలోని సామాజిక అంశాలను స్పృశించారు. ఇట్లా కాంచనపల్లి వ్యాసాలు సాహిత్య విద్యార్థులకు విమర్శ ఎలా రాయాలో మార్గ నిర్దేశం చేస్తాయి. పరిశోధక విద్యార్థులకు తెలియని ఎన్నో లోతైన విషయాలను తేల్చి చెబుతాయి. రసజ్ఞులైన పాఠకులకు ఆయా గ్రంధాలు చదవాలన్న ఉత్సుకతను రేకెత్తిస్తాయి . ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ సాహిత్యాన్ని తూచిన తరాజు ఈ వ్యాస సంపుటి.

సాగర్ల సత్తయ్య
7989117415

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News