Sunday, April 28, 2024

నాపైనే టీకాల ఎగుమతి భారం

- Advertisement -
- Advertisement -

The burden of exporting vaccines on myself:Poonawalla

టీకాల కోసం శక్తిమంతుల నుంచి బెదిరింపులు
భారత్ బయట ఉత్పత్తి కేంద్రాలు
సీరమ్ ఇనిస్టిట్యూట్ సిఇఒ అదార్‌పూనావాలా

లండన్ : కొవిడ్19 నియంత్రణ వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయంలో తనపై ఎంతో భారం పడిందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) సిఇఒ అదార్‌పూనావాలా(40) తెలిపారు. ఓవైపు కొవిడ్ ఉధృతితో ఉక్కిరిబిక్కిరవుతున్న భారత్‌తోపాటు, బ్రిటన్‌సహా 68 దేశాలకు ఎగుమతి చేయాల్సిన భారం తనపైనే పడిందని ఒకింత ఆవేదనతో ఆయన తెలిపారు. ప్రస్తుతం కుటుంబసభ్యులతో లండన్‌లో ఉంటున్న పూనావాలా అక్కడి పత్రిక ‘ది టైమ్స్’కు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయంలో తాను ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి వివరించారు.

బ్రిటన్ ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్ టీకాలను భారత్‌లోని సిఐఐ ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. కొవిషీల్డ్ టీకాలను తమకు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ భారత్‌లోని కొందరు శక్తిమంతుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు ఆయన వెల్లడించారు. భార్యా, పిల్లలతో తాను లండన్ వెళ్లడానికి ఆ ఒత్తిడి కూడా ఓ కారణమని తెలిపారు. అలాంటి పరిస్థితిలో తనకు ఇండియాకు వెంటనే వెళ్లాలని కూడా లేదని, మరికొంత కాలం అక్కడే ఉంటానని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఎదురుకాని పరిస్థితుల్లో ఎవరైనా తమ విధులు ఎలా నిర్వహించగలరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తన ప్రయాణానికి వ్యాపార ప్రణాళికలు కూడా మరో కారణమని పేర్కొన్నారు. యుకెసహా భారత్‌కు బయటి దేశాల్లోనూ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. మరికొన్ని రోజుల్లో దీనిపై ప్రకటన చేస్తానన్నారు.

జనవరిలో కొవిషీల్డ్‌కు భారత్‌లో అనుమతి లభించిన తర్వాత ఏడాదికి 250 కోట్ల డోసులు ఉత్పత్తి చేయాలని ఎస్‌ఐఐ తన లక్షంగా ప్రకటించింది. మరోవైపు ఉత్పత్తి అనంతరం వ్యాక్సిన్లను నిల్వ చేసే సౌకర్యాల సామర్థాన్ని ఐదు కోట్ల డోసులస్థాయికి పెంచాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన సహాయం తనకు అందుతుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. అయితే, ఇటువంటి చెడు పరిస్థితిని దేవుడు కూడా ఊహించి ఉండరంటూ వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News