Sunday, April 28, 2024

తప్పిపోయిన బాలికను 24 గంటల్లో అప్పగించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : తప్పిపోయిన బాలికను క్షేమంగా వెతికపట్టి 24 గంటల్లో తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఫలక్‌నుమా పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర కథనం ప్రకారం… ఫలక్‌నుమా నవాబ్ సాహబ్ కుంట, సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన సయ్యద్ అక్బర్ అలీ ప్రైవేటు ఉద్యోగి. ఇతనికి కుమారుడు, ఒక కుమార్తె సయ్యద్ ముహమ్మది బేగం (4) ఉన్నారు. ముహమ్మది రిలయన్స్ గ్రామర్ పాఠశాలలో చదువుతుంది. ఈనెల 16వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో అతని కుమార్తె సయ్యద్ ముహమ్మది బేగం (4)తో కలిసి సమీపంలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. కొద్ది సేపటి తరువాత కూతురు ముహమ్మది బేగం తల్లి వద్దే వదిలి అలీ ఒక్కడే తన ఉంటున్న ఇంటికి వచ్చాడు.

నానమ్మ వద్ద ఉన్న ముహమ్మది బస్తీ పిల్లలతో ఆడుకోవటం కోసం ఇంట్లోంచి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన బాలిక నానమ్మ వెంటనే కుమారుడు అలీకి ఫోన్‌చేసి ముహమ్మది బేగం కనిపించటం లేదని తెలిపారు. ఆందోళన చెందిన బాలిక తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి తప్పిపోయిన ముహమ్మది కోసం గాలించారు. ప్రయోజనం లేక పోవటంతో పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర తప్పిపోయిన నాలుగేళ్ళ బాలిక ఆచూకి కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఆ బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా గల సీసీ కెమెరాల ఫూటేజీని శోధించారు. బాలికను 24 గంటల్లో వెతికిపట్టి ఆమెను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. అందుకు తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News