Thursday, May 2, 2024

టీకాల రాజధాని తెలంగాణ

- Advertisement -
- Advertisement -

The Vaccine capital is Telangana

 

త్రి ఐ విధానంతో అద్భుత
ఫలితాలు, పిఎఎఫ్‌ఐ
సదస్సులో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ తీసుకొచ్చే విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. రాబోయే తరానికి చిన్నారులు వ్యాక్సిన్ తీసుకుంటే, ఆ టీకాలు హైదరాబాద్ నుంచే ఉంటాయన్నారు. దీంతో వ్యాక్సిన్‌లకు త్వరలోనే క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్‌గా తెలంగాణ రాష్ట్రం మారనుందన్నారు. దేశ వ్యాప్తంగా 35శాతం బల్క్‌డ్రగ్స్ తెలంగాణలోనే ఉత్పత్తి జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఎరోస్పేస్, ఢిపెన్స్ వంటి రంగాల్లోనూ విశేషంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్శిస్తోందన్నారు.

శుక్రవారం నాడిక్కడ పబ్లిక్ అఫైర్స్ ఆఫ్ ఇండియా (పిఎఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ సదస్సులో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకపోతున్నదన్నారు. ముఖ్యంగా త్రిఐ మంత్రంతో పనిచేస్తుండడంతో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. ఇందులో తెలంగాణకు దరిదాపుల్లో మరే రాష్ట్రం కూడా లేదన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రమే అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే అభివృద్ధిలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందన్నారు. నూతన ఆవిష్కరణలు, మౌళికసదుపాయాల కల్పన, సమగ్రాభివృద్ధిపై (ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్…. త్రిఐ) ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించడం వల్ల ఈ ఫలితాలను సాధిస్తోందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇండియన్ యూనియన్‌లో యంగెస్ట్ స్టేట్ అని అన్నారు. ఈ రాష్ట్రానికి సిఎం కెసిఆర్ నిర్ణయాత్మక లీడర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యంగా ప్రజలకు ఎంతో నమ్మకం, విశ్వాసంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దీని కారణంగా సిఎం కెసిఆర్‌పై రాష్ట్ర ప్రజలు అచెంచలమైన విశ్వాసాన్ని చూపుతున్నారన్నారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి కూడా ప్రభుత్వ పక్షాన ఒక భరోసా ఇస్తున్నామన్నారు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేవారికి సెల్ఫ్ సర్టిఫికెట్ ఇస్తున్నామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఎటువంటి క్లియరెన్స్ లేకుండా వ్యాపారం చేసుకునే వెసలుబాటును టిఎస్ ఐపాస్‌తో కల్పించామన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకొచ్చామన్నారు. దీంట్లో 23 శాతం ప్రస్తుతమున్న పారిశ్రామిక వేత్తల నుంచి వచ్చినట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా ప్రపంచంలోనే ఐదు టాప్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు పనిచేస్తున్నాయన్నారు. వాటిల్లో ఆపిల్, గూగుల్, అమెజాన్, మెక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు చెందిన ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. కేవలం ఐటి విభాగంలోనే కాకుండా లైఫ్ సైన్స్‌స్‌లోనూ కూడా రాష్ట్రం అద్భుతంగా రాణిస్తోందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News