Saturday, April 27, 2024

ప్రతి ఆరు నెల్లకో డిఎ

- Advertisement -
- Advertisement -

5.25% DA increase for state staff

 

కేంద్రం నిర్ణయంలో జాప్యం వల్లే రాష్ట్రంలో ఆలస్యం జరుగుతోంది
మంత్రివర్గంలో నిర్ణయించి విధానపరమైన నిర్ణయం త్వరలో అన్ని
సమస్యలపై చర్చిద్దాం : ఉద్యోగ సంఘాల నేతలతో సిఎం కెసిఆర్
రాష్ట్ర సిబ్బందికి 5.25% డిఎ పెంపు, ఉత్తర్వులు
దసరా తెల్లవారి (26న) సెలవు దినం, ఇకపై ప్రతి ఏడాది అమలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుతం అనుసరిస్తున్న డిఎ విషయంలో విధానం మార్చాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. డిఎ ఎంత చెల్లించాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నదన్నారు. దీనినే రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం అంచనాలు తయారు చేసి నిర్ణయం తీసుకునే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది.

శుక్రవారం ప్రగతిభవన్‌లో తనను కలిసి ఉద్యోగ సంఘాల నేతలతో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, ఉద్యోగులకు డిఎను సాధ్యమైనంత త్వరగా చెల్లిస్తామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సముఖంగా ఉందన్నారు. అయితే డిఎ ఎంత చెల్లించాలనే అంశంపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. దీని కారణంగానే ఆలస్యమవుతోందన్నారు. ప్రస్తుతం మూడు డిఎలు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉందని సిఎఁ కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఇందులో రెండు డిఎల విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయంలో జాప్యం వల్ల రాష్ట్రాలు జాప్యం చేయాల్సి వస్తున్నదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఫలితంగా బకాయిలు పేరుకుపోతున్నాయన్నారు.

దీంతో ఉద్యోగులకు సకాలంలో డిఎ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక సారి గడువు తేదీ రాగానే రాష్ట్రంలో చెల్లించాల్సిన డిఎ నిర్ణయించాలన్నారు. కేంద్రం అంచనాలు అందిన తర్వాత అవసరమైతే దాన్ని సవరించాలని అధికారులను ఆదేశించారు. ఉదాహరణకు రాష్ట్రం 3 శాతం డిఎ ప్రకటించి అమలు చేయాలన్నారు. దీనిని కేంద్రం 3.5 శాతం అని ప్రకటిస్తే మిగిలిన 0.5 శాతం చెల్లించాలని, అలాగే కేంద్రం 2.5 శాతంగా గా నిర్ణయిస్తే 0.5 శాతం తగ్గించి వెంటనే చెల్లించాలనారు. ఈ విషయంలో వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. దీనిపై కేబినెట్లో చర్చించి విధాన నిర్ణయం తీసుకుంటామని సిఎం వెల్లడించారు. కాగా 2019 జూలై 1 నుంచి రావాల్సిన ఒక డిఎను వెంటనే ఉద్యోగులకు చెల్లించాలని ఈ సందర్భంగా ఆర్థిక శాఖను సిఎం ఆదేశించారు.

వరద బాధితులకు ఉద్యోగ సంఘాల చేయూత

వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలకు చేయూత అందించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని సహాయంగా అందించాలని నిర్ణయించారు. మొత్తం రూ.33 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి సహాయంగా అందించే కాన్సెంట్ లెటర్ ను ఉద్యోగ సంఘాల నాయకులు ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌కు అందించారు. తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు, నాల్గవ తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు తమ ఒక రోజు వేతనాన్ని అందించనున్నారు. సిఎంను కలిసిన వారిలో టిజివో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.మమత, ఎ.సత్యనారాయణ, టిఎన్‌జిఒల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ ఉన్నారు.

బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష

కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గినందున 202021 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గిందన్నారు. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కూడా పెద్దఎత్తున కోత పడిందన్నారు. కేంద్ర జిడిపి కూడా మైనస్ 24 శాతానికి పడిపోయిందన్నారు. దీని ప్రభావం రాష్ట్రాలపై పడుతుందన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వాస్తవానికి ఎన్ని నిధులు అందుబాటులో ఉంటాయో అంచనా వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయిందన్నారు. ఏఏ శాఖలకు ఎన్ని నిధులు విడుదల చేసే వెసులుబాటు ఉంటుందో నిర్ణయించాలని అధికారులను సూచించారు. మొత్తం బడ్జెట్‌పై సమీక్ష నిర్వహించి, ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

కెసిఆర్‌కు ఉద్యోగుల జెఎసి ధన్యవాదాలు

ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యల పరిష్కారానికి మార్గం చూపిన సిఎం కెసిఆర్‌కు ఉద్యోగుల జేఏసి (టిజిఓ, టిఎన్జీఓ, డ్రైవర్స్, నాలుగవ తరగతి) పక్షాన ధన్యవాదాలను తెలియచేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సెక్రటరీ జనరల్ వి.మమత, ఉద్యోగుల జేఏసి చైర్మన్ మామిళ్ల రాజేందర్‌లు మాట్లాడుతూ తమ జేఏసిలో టీచర్ల, పెన్షనర్ల సంఘాలు లేవని వారు తెలిపారు. వరద బాధితులకు ప్రకటించిన మూలవేతనం గురించి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం కోసం తమను వివరాలను అడిగి తెలుసుకున్నారని వారు తెలిపారు. తమ సమస్యలపై సానుకూలంగా సిఎం కెసిఆర్ స్పందించారని త్వరలో దీనిపై సమావేశాన్ని నిర్వహిస్తానని తమకు మాట ఇచ్చారని వారు తెలిపారు.

తాము పేర్కొన్న సమస్యల్లో భాగంగా ముఖ్యమైనది 1.7.2019 నుంచి బకాయిపడ్డ డిఏను వెంటనే విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని వారు తెలిపారు. ఆంధ్రాలో పనిచేస్తున్న ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకురావడానికి సిఎం సుముఖత వ్యక్తం చేసినట్టు వారు పేర్కొన్నారు. దీంతోపాటు పదోన్నతుల విషయంలో మూడు సంవత్సరాలుగా ఉన్న సర్వీసు నిబంధనలు రెండు సంవత్సరాలకు కుదిస్తూ వెంటనే ఆదేశాలు జారీ చేయాలని అధికారులకు సిఎం సూచించినట్టు వారు తెలిపారు. దీంతోపాటు సోమవారం సెలవు దినంగా పాటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. అయితే పలు జిల్లాలో జేఏసి నాయకులపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్టుగా వారు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News