Thursday, May 2, 2024

ఐటి కంపెనీలు తెరవాలి

- Advertisement -
- Advertisement -

Third wave when new variant arrives:Dr Srinivas

కొత్త వేరియంట్ వస్తేనే థర్డ్‌వేవ్ రాష్ట్రంలో కొవిడ్ పూర్తిగా కేంద్రం ని యంత్రణలో ఉంది పిల్లలను ధైర్యం గా స్కూళ్లకు పంపించొచ్చు స్థానం ఆదేశాలతో కేంద్రం గురుకు లాల ప్రారంభం గ్రామీణ ప్రాంతాల్లో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ : మీడియాతో డిహెచ్ డా.శ్రీనివాస రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్త వేరియంట్ వస్తే తప్పా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే కరోనా ముప్పు తొలగిపోయిందని అనుకోవద్దని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. అలాగే అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని పనులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీహెచ్ మాట్లాడారు. రాష్ట్రంలో 0.4 శాతం మాత్రమే పాజిటివిటీ రేట్ ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ పూర్తి నియంత్రణలో ఉందని అన్నారు. దేశంలో కేరళ, మహారాష్ట్రలలో మాత్రమే కేసులు ఎక్కువ ఉన్నాయని, మొత్తం కేసులలో 70 శాతం కేసులు కేరళలోనే ఉన్నాయని తెలిపారు. విద్యాసంస్థలు పునఃప్రారంభం అయిన తర్వాత ఇప్పటివరకు 1.15 లక్షల మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 55 మందికి వైరస్ సోకినట్లు తేలిందని తెలిపారు.

తల్లిదండ్రులు వారి పిల్లలను ధైర్యంగా పాఠశాలలకు పంపవచ్చని భరోసా ఇచ్చారు. పరిస్థితులను విశ్లేషిస్తే వచ్చే మార్చి వరకు థర్డ్ వేవ్ రాదని డీహెచ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆర్ ఫ్యాక్టర్ 0.5శాతం , ఇన్ఫెక్షన్ రేట్ .0.4 శాతం మాత్రమే ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థల్లో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, గురుకులాలను కూడా ప్రారంభించవచ్చని తాము ప్రభుత్వానికి సూచించామని అన్నారు. అయితే ప్రస్తుతం గురుకుల పునఃప్రారంభం అంశంపై న్యాయస్థానంలో ఉన్నందున కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలకు వైద్యం సేవలు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు 613 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని డీహెచ్ తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ , సీజనల్ వ్యాధులపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్షించినట్లు డీహెచ్ తెలిపారు. రాష్ట్రంలో హైదరాబాద్, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోనే వైరల్ వ్యాధులు, డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. 2019లో రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 4 వేలు రిపోర్ట్ కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 10 నాటికి 3 వేల కేసులు నమోదైనట్లు చెప్పారు. వైరల్ జ్వరాలు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. డెంగ్యూ ప్లేట్ లెట్స్‌పై కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ మొదలు పెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లేట్‌లెట్స్ 10 వేల కంటే తక్కువగా ఉంటేనే ఎక్కించాలని అన్నారు. వైరల్ జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వ్యాధులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన సదుపాయాలు సమకూర్చామని చెప్పారు.

నిబంధనలకు అనుగుణంగానే డెంగ్యూ వైద్య పరీక్షలు, చికిత్స అందించాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డెంగ్యూ చికిత్స విషయంలో ఏమైనా ఇబ్బందులు ప్రజలు ఆయా జిల్లాల డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో లేదా 104కి ఫిర్యాదు చేయవచ్చునని డీహెచ్ సూచించారు. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలో చాలా తక్కువగా కేసులు నమోదవుతున్నాయని, సెప్టెంబర్ చివరి నాటికి లేదా అక్టోబర్ రెండవ వారం నాటికి వైరల్ జ్వరాలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులకు దాదాపుగా ఒకే రకమైన లక్షణాలు ఉంటాయని అన్నారు. ఈ సీజన్‌లో ప్రతి నెల 2 లక్షల వరకు… వైరల్ ఫీవర్ వస్తుంటాయని వివరించారు. ప్రజలు సీజనల్ వ్యాధులు, కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా వ్యాధులు సంక్రమిస్తాయని, అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలు రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.

ముందు జాగ్రత్తగా చిన్నారుల కోసం పడకల ఏర్పాటు

భవిష్యత్‌లో ఆక్సిజన్ అవసరం ఉంటే మనమే ఉత్పత్తి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీనివాసరావు వెల్లడించారు. కరోనా కట్టడికి రూ.132 కోట్ల వ్యయంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27 వేల పడకలను ఆక్సిజన్ బెడ్లుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో ఇప్పటికే 21 వేల బెడ్లు ఆక్సిజన్ బెడ్లుగా మార్చామని అన్నారు. థర్డ్ వేవ్‌లో పిల్లలపై ఎక్కువగా ప్రభావం ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రాష్ట్రంలో పిల్లల కోసం ప్రత్యేకంగా 3,200 పడకలను సిద్ధం చేశామని తెలిపారు. నీలోఫర్ ఆసుపత్రితోపాటు జిల్లా ఆసుపత్రుల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా బెడ్లు సిద్ధంగా ఉంచామని అన్నారు.

ఐటీ కంపెనీలు తెరవాలి

హైదరాబాద్‌లో ఇప్పటికీ ఐటీ కంపెనీలు పూర్తి తెరవలేదని, ఇంకా వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉన్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు పూర్తి స్థాయిలో ఓపెన్ చేయాలని సూచించారు. ఆర్థికవ్యవస్థను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు తెరవాలని కోరారు. ఐటీ కంపెనీలపై చాలా రంగాలు ఆధారపడి ఉన్నాయని అన్నారు. ఐటీ కంపెనీలు పూర్తిగా తెరవడం వల్ల ఈ రంగంపై పరోక్షంగా ఆధారపడి ఉన్న లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.

జిహెచ్‌ఎంసిలో 97 శాతం వ్యాక్సినేషన్

గ్రేటర్ హైదరాబాద్‌లో వంద శాతానికి చేరువలో సుమారు 97 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇందుకోసం 180 వాహనాలలో వాక్సినేషన్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో నగరంలోని ప్రతి ప్రాంతంలో వ్యాక్సినేషన్ చేశామని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలలో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1.43 లక్షల మంది సింగిల్ డోస్ తీసుకున్న వారు ఉంటే, 54 లక్షల మంది డబుల్ డోస్ తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు మొత్తం 2.80 కోట్ల మంది అర్హులు ఉండగా, అందులో 51 శాతం వ్యాక్సిన్ తీసుకున్నారని, మరో 49 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోని వారు ఉన్నారని పేర్కొన్నారు. వీరి కోసం స్పెషన్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నిత్యం 3 లక్షల వ్యాక్సిన్ డోసులు అందించేందుకు సమాయత్తం అవుతున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 20 లక్షల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని, ఈ నెలలో మరో 25 లక్షల డోసులు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News