Tuesday, April 30, 2024

15లోగా టిఆర్‌ఎస్ గ్రామ కమిటీలు

- Advertisement -
- Advertisement -

TRS Village Committees within sep 15

పార్టీ ప్రధాన కార్యదర్శులతో భేటీలో కెటిఆర్ ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్టీ సంస్థాగత కార్యక్రమాల పురోగతిపై టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరా తీశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు మొదలైన గ్రామ కమిటీల ఏర్పాటు ఏ మేరకు జరిగింది? జిల్లాల వారిగా జరిగిన కమిటీ నిర్మాణాలపై సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యదర్శులతో కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గత రెండు వారాలుగా జరుగుతున్న కమిటీల నిర్మాణంపైన ఆయన సమీక్షించారు. ఇప్పటికే దాదాపుగా 80 శాతం పైగా పూర్తయిన గ్రామ కమిటిల నిర్మాణ వివరాలను వారు కెటిఆర్‌కు అందజేశారు.

మిగిలిన 20 శాతం కమిటీలకు సంబంధించి కూడా నిర్మాణ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చాయని వివరించారు. కొన్ని జిల్లాల్లో అసాధారణ వర్షాలు, ఇతరత్ర కారణాల వల్ల గ్రామ కమిటీల ఏర్పాటులో ఒకటి, రెండు రోజుల పాటు కాలయాపన జరిగిందన్న విషయాన్ని కూడా వారు కెటిఆర్ దృష్టికి తీసుకొచ్చారు. కాగా ఈనెల 15వ తేదీ నాటికి అన్ని గ్రామ కమిటీల నిర్మాణం పూర్తి చేసి ఆ వివరాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి అందించాలని జనరల్ సెక్రటరీలకు ఆయన సూచించారు. ఈనెల 20వ తేదీ నాటికి అన్ని మండల కమిటీలు నిర్మాణం పూర్తి కావాలన్నారు. మండల కమిటీల నిర్మాణం,కూర్పుకు సంబంధించి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. మండల కమిటీల నిర్మాణం పూర్తయిన వెంటనే జిల్లా అధ్యక్షుల ఎంపికను ముఖ్యమంత్రి ప్రకటిస్తారన్నారు.

జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తయిన తర్వాత జిల్లా కమిటీల ఏర్పాటుపైన జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని జిల్లా కమిటీల నిర్మాణం పూర్తిచేస్తామని ఈ సందర్భంగా కెటిఆర్ పేర్కొన్నారు. సంస్థాగత కార్యక్రమాల పురోగతితో పాటు పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఆయన అడిగి తెలుసుకున్నారు. పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు సీనియర్ నాయకులు సైతం ఈ సంస్థాగత నిర్మాణం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని కెటిఆర్‌కు జనరల్ సెక్రటరీలు తెలిపారు. కాగా ఈ సంస్థాగత కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త్త ఉత్సాహం నెలకొందన్నారు. ఇప్పటికే పార్టీ నిర్ణయించిన 51 శాతం కనీస పరిమితిని మించి బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు కమిటీలో చోటు దక్కిందని వివరించారు.

పార్టీ కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత సంపూర్ణ గణాంకాలు అందజేయాలని కెటిఆర్ సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న మహిళా కార్యకర్తలకు పార్టీ కమిటీల కూర్పులో ప్రాధాన్యత ఇవ్వాలని ఈ విషయంలో ప్రధాన కార్యదర్శులు ప్రత్యేక చొరవ చూపించాలని కెటిఆర్ ఆదేశించారు. కాగా పార్టీ కమిటీల నిర్మాణానికి సంబంధించి వారం రోజుల్లో మరోసారి సమీక్షించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News