Sunday, April 28, 2024

మంచి పని చేసేవారికి గుర్తింపు దక్కదు

- Advertisement -
- Advertisement -

ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగేది అదే
తప్పులు చేసేవారు తరచు శిక్ష తప్పించుకుంటున్నారు
హాస్యస్ఫూరకంగానే ఇలా అంటుంటా : గడ్కరీ

న్యూఢిల్లీ : ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, చక్కగా పని చేసేవారికి ఎన్నటికీ సముచిత గుర్తింపు దక్కదని, తప్పులు చేసేవారు తరచు శిక్ష తప్పించుకుంటున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాస్యస్ఫూరకంగా వ్యాఖ్యానించారు. ఎవరినీ ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయలేదు. ‘ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే మంచి పని చేసే వ్యక్తికి ఎన్నటికీ గౌరవం దక్కదని, తప్పుగా వ్యవహరించినవారు ఎన్నటికీ శిక్షకు లోను కారని తరచు జోకింగ్‌గా అంటుంటాను’ అని గడ్కరీని ఉటంకిస్తూ ‘పిటిఐ’ పేర్కొన్నది. అవకాశవాద నేతలు అప్పటికి అధికారంలో ఉన్న పార్టీతో కలసి సాగాలని కోరుకుంటుంటారని గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు.

తమ సిద్ధాంతానికి నిబద్ధమైన రాజకీయ నాయకులు ఉన్నారని, కానీ వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నదని ఆయన అన్నారు. అటువంటి ‘సిద్ధాంతం క్షీణత’ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. విశిష్ట సేవల నిమిత్తం పార్లమెంటేరియన్లకు అవార్డుల ప్రదానానికి మరాఠీ వార్తా సంస్థ ‘లోక్‌మత్ మీడియా గ్రూప్’ ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అభిప్రాయ భేదాలు చర్చల్లో సమస్య కాదని ఆయన ఉద్ఘాటించారు. ‘మన సమస్య అభిప్రాయాలు లేకపోవడమే’ అని బిజెపి సీనియర్ నేత గడ్కరీ అన్నారు. ‘తమ సిద్ధాంతం ఆధారంగా దృఢ నమ్మకంతో కొనసాగేవారు ఉన్నారు.

కాని అటువంటి వ్యక్తులు సంఖ్య కుంచించుకుపోతున్నది. సిద్ధాంతంలో ఈ క్షీణత ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’ అని ఆయన అన్నారు. ‘రైటిస్ట్ గాని లెఫ్టిస్ట్ గాని కాదు. అవకాశవాదులుగా మమ్మల్ని పేర్కొంటుంటారు. కొంత మంది అలా రాస్తుంటారు. అందరూ అధికార పార్టీతో సంబంధం కొనసాగాలని వాంఛిస్తుంటారు’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీని గడ్కరీ ఉటంకిస్తూ, భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి అని అన్నారు. ‘ఈ ప్రత్యేకత కారణంగానే మన ప్రజాస్వామిక పాలన వ్యవస్థ తక్కిన ప్రపంచానికి ఆదర్శప్రాయంగా ఉన్నది’ అని గడ్కరీ చెప్పారు. జనాదరణ, ప్రచారం ముఖ్యమని, తమ తమ నియోజకవర్గాలలో పార్లమెంటరీవేత్తలు సాగించిన కృషి కూడా కీలకమేనని, ప్రజల నుంచి వారికి అది గౌరవం తీసుకువస్తుందని గడ్కరీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News