Tuesday, April 30, 2024

ఎక్కువ పని గంటలతో గుండెకు ముప్పు

- Advertisement -
- Advertisement -

Threat to Heart with longer working hours:WHO study

ప్రపంచ ఆరోగ్యసంస్థ సర్వే వెల్లడి

జెనీవా : సాధారణ పని గంటల కంటే అత్యధికంగా పని చేసే ఉద్యోగుల్లో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం వెల్లడించింది. ఈ అధ్యయన నివేదికను ఆరోగ్య సంస్థ విడుదల చేసింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా దీనిపై సర్వే నిర్వహించాయి. ఈ నివేదికలో తెలిపిన ప్రకారం వారానికి 55 గంటల కంటే ఎక్కువ పని గంటలు చేసిన ఉద్యోగుల్లో సుమారు 7,45,000 మందికి పైగా, 2016 గుండెపోటు, గుండెకు సంబంధించిన వ్యాధుల కారణంగా మరణించారని వెల్లడించింది. ఇది గత పదేళ్లలో 30 శాతం పెరిగిందన్నారు. ఈ విధంగా సుదీర్ఘ పనిగంటల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిలో దక్షిణాసియా, పసిఫిక్ ప్రాంత వాసులు ఎక్కువగా ఉన్నట్టు నివేదిక తెలియచేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఈ మరణాల సంఖ్య మరింత ఆందోళనకరంగా ఉండే ప్రమాదం ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

ఈ ముప్పునకు గురౌతున్న వారిలో 72 శాతం మంది నడివయస్కులైన పురుషులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్విరాన్‌మెంట్, వాతావరణ మార్పులు, ఆరోగ్య విభాగ అధిపతి మారియా నైరా తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. 2000 నుంచి 2016 వరకు మొత్తం 194 దేశాల్లో ఈ సర్వే జరిగింది. వారానికి 55 గంటలు కంటే ఎక్కువ పనిచేసే వారిలో 35 శాతం ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నట్టు పరిశోధనలో వెల్లడైంది. ఇక గుండె సంబంధిత ఇతర రుగ్మతలతో 17 శాతం మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నట్టు నివేదిక వివరించింది. వారానికి 35 నుంచి 40 గంటలు పనిచేసేవారితో పోలుస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికను తయారు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రతి రంగంలో వచ్చిన ఒడుదొడుకులను ఎదుర్కోడానికి ప్రస్తుతం ఎక్కువ మంది ఎక్కువ పనిగంటలు పనిచేస్తున్నట్టు గుర్తించామని చెప్పారు.

లాక్‌డౌన్ వల్ల కంపెనీలు పనిగంటలు దాదాపు పదిశాతం వరకు పెంచినట్టు డబ్లుహెచ్‌ఒ టెక్నికల్ ఆఫీసర్ ఫ్రాంక్‌పెగా తెలిపారు. దీనివల్ల ఉద్యోగులపై అదనపు పనిభారం పడుతుందని, దాంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. దీని కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News