Sunday, April 28, 2024

టిఎంసికి ఎంపి శతాబ్ది రాయ్ గుడ్‌బై?

- Advertisement -
- Advertisement -
TMC MP Satabdi Roy hints at problems with party
బెంగాల్‌లో తృణమూల్‌కు వరుస ఎదురుదెబ్బలు

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి వలసల పర్వం ఆగడం లేదు. తాజాగా.. తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు శతాబ్ది రాయ్ సొంత పార్టీలో తనకు సమస్యలు ఎదురవుతున్నాయని, శనివారం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటానని శుక్రవారం సూచనప్రాయంగా తన తదుపరి కార్యాచరణను వెల్లడించారు. బీర్భమ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు టిఎంసి ఎంపిగా గెలుపొందిన సినీ నటి శతాబ్ది రాయ్ శుక్రవారం ఫేస్‌బుక్ పోస్టింగ్‌లో పార్టీపై తన అసంతృప్తిని బయటపెట్టారు.

తన నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాల గురించి తనకు సమాచారం ఇవ్వడం లేదని, ఇది తనకు మానసిక వేదనకు గురిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటే శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రజలకు తెలియచేస్తానని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఆమె ఇక్కడ నుంచి న్యూఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. కాగా..ఆమె ఫేస్‌బుక్ పోస్టింగ్ తృణమూల్ కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తోంది. శతాబ్ది రాయ్‌ను బుజ్జగించే చర్యలు పార్టీలో మొదలైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీర్భమ్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అనుబ్రత మోండల్‌తో ఆమెకు విభేదాలు తలెత్తినట్లు వర్గాలు తెలిపాయి. కాగా..ఈ విషయమై ఎంపిని విలేకరులు వివరణ కోరగా ఫేస్‌బుక్ పోస్టింగ్‌లో పేర్కొన్న అంశాలు వాస్తవమేనని ఆమె ధ్రువీకరించారు. పార్టీ నాయకత్వాన్ని కలుసుకోవడానికి తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆమె చెప్పారు. ప్రజలకు పనిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు ఆ పదవిలో ఉండడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. బిజెపిలో చేరే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి శతాబ్ది రాయ్ నిరాకరించారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తారా అన్న ప్రశ్నకు తెలిసిన వ్యక్తులను కలుసుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుందని, అయితే ఇప్పుడు అలాంటిదేమీ ఉండకపోవచ్చని ఆమె నర్మగర్భంగా సమాధానమిచ్చారు.

ఇదిలా ఉండగా మరో సీనియర్ టిఎంసి నాయకుడు, రాష్ట్ర మంత్రి రజీబ్ బెనర్జీ కూడా పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన శనివారం మధ్యాహ్నం ఫేస్‌బుక్ లైవ్‌లో తన తదుపరి అడుగును ప్రకటిస్తానని ఆయన సోషల్ మీడియాలో శుక్రవారం వెల్లడించారు. మరో మూడు నాలుగు నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో జరుగుతున్న ఈ వలసలు టిఎంసి నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News