Sunday, April 28, 2024

‘సిఎస్‌కెకు’ ఎదురుందా?

- Advertisement -
- Advertisement -

Tomorrow match between CSK vs SRH

రేపు సన్‌రైజర్స్‌తో పోరు

షార్జా: వరుస విజయాలతో జోరుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్ గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో చెన్నై కనిపిస్తోంది. ఇక కిందటి మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించిన హైదరాబాద్ కూడా గెలుపే లక్షంగా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్ రేసుకు దూరమైన సన్‌రైజర్స్ ఇకపై ఆడే నాలుగు మ్యాచుల్లోనూ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఎలాంటి ఒత్తిడి లేక పోవడంతో హైదరాబాద్ టీమ్‌లో ఆత్మవిశ్వాసంతో నెలకొంది.

బ్యాటింగ్, బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తే చెన్నైని ఓడించడం సన్‌రైజర్స్‌కు పెద్ద సమస్యేమీ కాదు. అయితే నిలకడ లేమీ జట్టును వెంటాడుతోంది. బౌలర్లు బాగానే రాణిస్తున్నా బ్యాటింగ్ వైఫల్యంతో స్వల్ప లక్ష్యాన్ని సయితం ఛేదించలేక ఓటమి పాలవుతోంది. దీనికి పంజాబ్‌తో జరిగిన మ్యాచే నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక ఈ సీజన్‌లో చెన్నైకు ఎదురే లేకుండా పోయింది. ఒక్కో జట్టును చిత్తు చేస్తూ ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు సొంతం చేసుకుందనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో ఓడినా వచ్చే ఇబ్బందేమీ లేదు. అయితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న సిఎస్‌కె ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ పోరులో కూడా గెలిస్తే ప్లేఆఫ్ బెర్త్‌ను దక్కించుకుంటుంది.

రాయ్‌పై భారీ ఆశలు..

ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే కీలక ఇన్నింగ్స్‌తో అలరించిన ఓపెనర్ జాసన్ రాయ్‌పై సన్‌రైజర్స్ భారీ ఆశలు పెట్టుకుంది. రాజస్థాన్‌పై రాయ్, వృద్ధిమాన్ సాహాలు మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు. ఈసారి కూడా వీరి నుంచి జట్టు ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. సాహా బాగానే ఆడుతున్నా భారీ స్కోర్లను సాధించలేక పోతున్నాడు. కీలక సమయంలో వికెట్‌ను పారేసు కోవడం అలవాటుగా మార్చుకున్నాడు. కనీసం ఈసారైనా భారీ స్కోరు సాధించాల్సిన అవసరం ఉంది. ఇక రాయ్ రాజస్థాన్‌పై దూకుడైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝులిపించాడు. ఈ మ్యాచ్‌లో కూడా మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. రాయ్, సాహాలు శుభారంభం అందిస్తే తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి లేకుండా ఉంటుంది.

విలియమ్సన్ జోరు సాగాలి..

రాజస్థాన్‌పై అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈసారి కూడా అలాంటి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. కిందటి మ్యాచ్‌లో కేన్ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు విజయం అందించాడు. అతను ఫామ్‌లోకి రావడం జట్టుకు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కేన్‌కు ఉంది. ప్రస్తుతం జట్టులో అతనొక్కడే సీనియర్ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాల్సిన బాధ్యత కేన్‌పై ఉంది. రాజస్థాన్ మ్యాచ్‌కు ముందు వరకు కేన్ పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపింది. ఇకపై జరిగే మ్యాచుల్లో అతను మెరుగైన బ్యాటింగ్ కనబరచక తప్పదు. ఇక యువ ఆటగాళ్లు ప్రియమ్ గార్గ్, సమద్, అభిషేక్ శర్మ, జేసన్ హోల్డర్‌లు కూడా తమ బ్యాట్‌కు పని చెప్పాలి. ఇక బౌలింగ్‌లో సన్‌రైజర్స్ బాగానే ఉంది. రషీద్, సందీప్, భువనేశ్వర్, హోల్డర్, సిద్ధార్థ్ తదితరులతో బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. ఈసారి కూడా బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఇటు బ్యాట్స్‌మెన్, అటు బౌలర్లు తమవంతు పాత్ర పోషిస్తే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు విజయం ఖాయం.

ఒకటి గెలిస్తే..

ఇక చెన్నై ఈ సీజన్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆడిన పది మ్యాచుల్లో ఏకంగా ఎనిమిది పోటీల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు డుప్లెసిస్, రుతురాజ్‌లతో పాటు సురేశ్ రైనా, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, కెప్టెన్ ధోనీలు నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నారు. ఈసారి కూడా వీరు మెరుగైన ప్రదర్శన చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక బౌలింగ్‌లో కూడా చెన్నై చాలా బలంగా ఉంది. బ్రావో, జడేజా, దీపక్ చాహర్, శార్దూల్ తదితరులతో బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది. రెండు విభాగాల్లో కూడా బలంగా ఉన్న చెన్నై ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News