Thursday, May 2, 2024

ముంబైకి ‘సవాల్’

- Advertisement -
- Advertisement -

Tomorrow match between MI vs PBKS

రేపు పంజాబ్‌తో కీలక పోరు

అబుదాబి: వరుస ఓటములతో సతమతమవుతున్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే పోరు సవాల్‌గా మారింది. హ్యాట్రిక్ ఓటములతో ముంబై ఆత్మవిశ్వాసం దెబ్బతింది. మరోవైపు కిందటి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై అద్భుత విజయం సాధించిన పంజాబ్ ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. సన్‌రైజర్స్‌పై స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని పంజాబ్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ముంబైని కూడా ఓడించి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇక ముంబైకి కూడా గెలుపు తప్పనిసరిగా మారింది. కీలక ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు తమ స్థాయికి తగ్గ ఆటను కనబరచ లేక పోతున్నారు. ఇది ముంబైకి ప్రతికూలంగా మారింది. బౌలింగ్‌లో బాగానే రాణిస్తునన్నా బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది.

శుభారంభం లభిస్తున్నా..

ఇక ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లోనూ ముంబైకి మంచి ఆరంభమే లభించింది. డికాక్, రోహిత్ శర్మలు ఫామ్‌లో ఉన్నారు. రోహిత్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. డికాక్ కూడా నిలకడైన ఆటతో అలరిస్తున్నాడు. వీరిద్దరూ రాణిస్తున్నా తర్వాత వచ్చే ఆటగాళ్లు విఫలం అవుతుండడంతో ముంబైకి ఆశించిన స్థాయిలో స్కోరు నమోదు కావడం లేదు. దీని ప్రభావం మూడు మ్యాచుల్లోనూ కనిపించింది.

ఇద్దరు రాణించాల్సిందే..

మరోవైపు యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్‌లు రెండో దశ మ్యాచుల్లో ఘోరంగా విఫలమవుతున్నారు. ఇద్దరు మూడు ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా కనీసం 15 పరుగుల స్కోరును అందుకోలేక పోయారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వీరి వైఫల్యం ముంబైను వెంటాడుతోంది. సూర్యకుమార్‌లో సిఎస్‌కెపై మూడు, కోల్‌కతాపై ఐదు పరుగులు చేశాడు. ఇక బెంగళూరుతో జరిగిన కిందటి మ్యాచ్‌లో కూడా 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మూడు ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా డబుల్ డిజిట్ స్కోరుకు చేరుకోలేక పోయాడు. దీన్ని బట్టి అతని బ్యాటింగ్ వైఫల్యం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇక ఇషాన్ కిషన్‌ది కూడా ఇదే పరిస్థితి. సిఎస్‌కెపై 11, కోల్‌కతాపై 14 పరుగులు మాత్రమే చేశాడు. బెంగళూరుతో జరిగిన కిందటి మయాచ్‌లో 9 పరుగులకే ఔటయ్యాడు. ఇటు సూర్యకుమార్ అటు ఇషాన్ కిషన్ వైఫల్యం ముంబైకి ప్రతికూలంగా మారింది.

అంతేగాక స్టార్‌ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు. అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇక పాండ్య సోదరులు కృనాల్, హార్దిక్‌లు కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నారు. కృనాల్, హార్దిక్‌లు పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నారు. ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ ఆట తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బౌలింగ్‌లో కూడా ముంబై ప్రదర్శన అంతంత మాత్రమే. రాహుల్ చాహర్ వైఫల్యం చవిచూస్తున్నాడు. బౌల్ట్ ఒక్కడే మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. బుమ్రా వికెట్లు తీస్తున్నా భారీగా పరుగులు ఇచ్చుకుంటున్నాడు. మిల్నే కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యాలు ముంబైకి సమస్యగా మారాయి. ఈ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం జట్టు ఆటగాళ్లపై నెలకొంది. లేకుంటే ఈసారి ప్లేఆఫ్‌కు అర్హత సాధించడం కష్టమనే చెప్పాలి.

రాహుల్ సేనకు పరీక్ష

ఇక రాహుల్ సారథ్యంలోని పంజాబ్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన ఒత్తిడి పంజాబ్‌పై నెలకొంది. పంజాబ్‌ను కూడా బ్యాటింగ్ వైఫల్యం వెంటాడుతోంది. అంతేగాక ఒత్తిడిని తట్టుకోలేక చేజేతులా వికెట్లను పారేసుకుంటున్నారు. ఓపెనర్లు మయాంక్, రాహుల్ మెరుగైన ఆరంభాన్ని ఇస్తున్నారు. అయితే తర్వాత వచ్చే బ్యాట్స్‌మన్ తేలిపోతుండడంతో పంజాబ్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది. చేతిలో 8 వికెట్లు ఉన్నా ఆఖరి ఓవర్‌లో 4 పరుగులు చేయలేక పోయింది. ఇక హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతి కష్టం మీద విజయంతో గట్టెక్కింది. ఇలాంటి స్థితిలో పటిష్టమైన ముంబైని ఓడించాలంటే అనుకున్నంత తేలిక కాదు. అయితే రాహుల్, గేల్, మయాంక్, పూరన్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్న పంజాబ్‌ను తక్కువ అంచనా వేయలేం. సమష్టిగా రాణిస్తే ముంబైని ఓడించడం పంజాబ్‌కు అసాధ్యం కాదనే చెప్పాలి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News