Thursday, May 2, 2024

ప్యాసింజర్ పాట్లు.. దొరకని సీట్లు

- Advertisement -
- Advertisement -

Trouble for regular trains or passengers

హైదరాబాద్: కరోనా కారణంగా నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లు పట్టాలు ఎప్పుడెక్కుతాయా అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. రోజువారీ పనులు, ఉద్యోగాలు, పండుగలు, శుభకార్యాల సమయంలో అతి తక్కువ టికెట్ ధరతో నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లాలనుకున్న, వివిధ ప్రాంతాల నుంచి జంట నగరాలకు వచ్చే ప్రయాణికులు, మిగతా ప్రాంతాలకు వెళ్లే వారు కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. అరకొరగా నడిచే సూపర్‌ఫాస్ట్ రైళ్లలో అధిక చార్జీలు భరించలేక, అత్యవసర సమయంలో ఆన్‌లైన్ రిజర్వేషన్ లభించక ఆందోళనకు గురవుతున్నారు. రైల్వే ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపి కొవిడ్ 19 ఆంక్షల మేరకు డిసెంబర్ చివరి వారం, కొత్త సంవత్సరంలోనైనా ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు.

సికింద్రాబాద్ నుంచి రోజుకు 120 రైళ్లు

కరోనా వ్యాప్తి కంటే ముందు దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంకతల్లు, నాందేడ్ డివిజన్ల పరిధిలో ప్రతి రోజు 750 రైళ్లు రాకపోకలు సాగించేవి. ఇందులో సికింద్రాబాద్ నుంచి రోజుకు 120 రైళ్లు నడిచేవి. అయితే కృష్ణా, గోల్కొండ, శాతవాహన, చార్మినార్, హౌరా, జమ్ముతావి, గోదావరి, గౌతమి, అండమాన్, ఫలక్‌నుమా, తెలంగాణ, రాజధాని, తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు కాకతీయ, పుష్‌పుల్ రైళ్లు ఇక్కడి నుంచి కాజీపేట, వరంగల్ మీదుగా కొత్తగూడెం వరకు వెళ్లేవి. సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సింగరేణి ప్యాసింజర్ రైలు ప్రయాణించేది. వరంగల్, కాజీపేట నుంచి వచ్చే కాకతీయ, పుష్‌పుల్ రైళ్లలో ఎక్కువ మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు నగరానికి వచ్చేవారు. టికెట్ ధర కేవలం రూ.25, రూ.30 మాత్రమే ఉండడంతో ఎక్కువ మంది ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించేవారు.

పరిమితంగానే ఎక్స్‌ప్రెస్‌లు

అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా జూన్ నుంచి 8 నుంచి 10 వరకు రైళ్లను నడిపిస్తుండగా, దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగల నేపథ్యంలో స్పెషల్ రైళ్లను దక్షిణమధ్య రైల్వే నడిపిస్తోంది. తాజాగా 15 రోజులుగా మరికొన్ని రైళ్లను పట్టాలెక్కించారు. అయితే సామాన్యులకు సౌకర్యంగా ఉండే ప్యాసింజర్ రైళ్లను నడపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో స్పెషల్ ట్రెయిన్లు మినహా రెగ్యులర్ ట్రెయిన్లు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు.

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, బెంగళూరు, విశాఖపట్నం….

ప్రస్తుతం క్రిస్మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ ప్రతిరోజు ఓ బోగీ చూసినా ప్రయాణికుల రద్దీతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, బెంగళూరు, విశాఖపట్నం రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. దాదాపు ప్రతి రైళ్లలోనూ వెయిటింగ్ లిస్టింగ్ కనబడుతోంది. కోవిడ్ 19 అధికంగా ఉన్న సమయంలో చాలా రైళ్లలోని బోగీలు ఖాళీగా దర్శనమిచ్చేవి. ప్రస్తుతం ఏసి బోగీలతో పాటు రిజర్వేషన్ బోగీలన్నీ వెయిటింగ్ లిస్ట్‌తో దర్శనమిస్తున్నాయి.

ఆర్‌ఏసి పేరుతో అదనం

అక్టోబర్ నెలలో, నవంబర్ నెలలో పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకొని వెయిటింగ్ లిస్ట్ ఉన్నా ప్రయాణికులకు సీట్లను మించి అనుమతివ్వడంతో చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కో బోగీలో 80 నుంచి 85 మంది వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. స్లీపర్ బోగీల్లో 72 బెర్తులుంటాయి. సైడ్ బెర్త్‌లను ఆర్‌ఏసి పేరుతో మరో 8 మందికి అదనంగా రైల్వే శాఖ జారీ చేస్తోంది. నలుగురు లేదా ఆరుగురు కలిసి ఒకే పిఎన్‌ఆర్ తీసుకున్నప్పుడు అందులో కొందరికీ రిజర్వేషన్ ఖరారై మిగిలిన వారికి వెయిటింగ్ లిస్ట్ వచ్చినా టికెట్ జారీ చేస్తూ అందరినీ ప్రయాణానికి రైల్వే శాఖ అనుమతి ఇస్తోంది. ఒక వరుసలో సైడ్ లోయర్, అప్పర్ రెండు బెర్తులు ఉంటాయి.

ఆర్‌ఏసి పేరుతో ముగ్గురికి టికెట్లు ఇస్తున్నారు. దీంతో పగటి వేళ ముగ్గురు ప్రయాణికులు ఆనుకొని కూర్చోవాల్సి వస్తోంది. ప్రస్తుతం నడిచేవి దాదాపు దూరప్రాంత రైళ్లే అయినందున 20 నుంచి 30 గంటలు ఇరుగ్గా ప్రయాణం చేయాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమయిన నేపథ్యంలో ప్రయాణికుల కోసం మరిన్ని రైళ్లను అదనంగా వేసి వారిని రక్షించాలని ప్రయాణికులు కోరుతున్నారు. లాక్‌డౌన్ సడలింపులు ఎత్తివేత తరువాత రైళ్లలో ప్రయాణించడానికి ప్రయాణికుల సంఖ్య ఎక్కువకావడంతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయని రైల్వే శాఖ అధికారులు పేర్కొనడం గమన్హారం.

రెండు నెలల ముందుగానే రిజర్వేషన్

బీహార్‌లోని దర్భంగ నుంచి సికింద్రాబాద్‌కు రోజు రెండు రైళ్లున్నా రిజర్వేషన్ దొరడకం లేదు. విశాఖపట్నం టు సికింద్రాబాద్ ప్రయాణానికి సికింద్రాబాద్ టు విశాఖపట్నం ప్రయాణం చేయాలంటే రెండు నెలల ముందుగా రిజర్వేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లోనైనా మరిన్ని రెగ్యులర్ ట్రెయిన్లు నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుతం కోవిడ్ 19 నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో ప్రయాణికుల కోసం అనేక చర్యలు చేపట్టింది. ప్రయాణికులను తప్ప ఎవరినీ స్టేషన్ లోపలికి రాకుండా పటిష్టమైన బందోబస్తును చేపట్టింది.

Trouble for regular trains or passengers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News