Thursday, May 2, 2024

తెలంగాణ ఆత్మ గౌరవ, అస్తిత్వ చిహ్నం టిఆర్ఎస్ భవన్: కెటిఆర్

- Advertisement -
TRS Bhavan costruct in Delhi
ఢిల్లీ: రెండు దశాబ్దాల క్రితం జలదృశ్యం వద్ద ఉద్యమ నాయకుడు సిఎం కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఊపిరి పోసుకున్న టిఆర్ఎస్ పార్టీ, గురువారం అదే నాయకుడి చేతుల మీదుగా దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ జరగడం ఒక చారిత్ర సన్నివేశమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రతోపాటు టిఆర్ఎస్ పార్టీ చరిత్రలోనూ శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. ఢిల్లీలో టిఆర్ఎస్ భవన్ శంకుస్థాపన సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. రెండు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చరిత్రతో పాటు రాష్ట్ర పునర్ నిర్మాణ ప్రయాణాన్ని మంత్రి కెటిఆర్ ప్రస్తావించారు.
14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, తెలంగాణ పదమే నిషిద్ధమైన రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం ఉన్న జలదృశ్యం నుండి సామాన్లు అన్నీ రోడ్డున పడేసిన చంద్రబాబు కక్షపూరిత పాలన, తదనంతరం తెలంగాణ ఆశను చిదిమేయాలని చూసిన వైఎస్సార్‌ పాలన వరకు ఎదురైన అన్ని అడ్డంకులన్నీ ఒక్కటొక్కటిగా తొలగించుకుంటూ టిఆర్ఎస్ ముందుకు సాగిందన్నారు. రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంటూ, చిక్కుముళ్లని విప్పుకుంటూ, తెలంగాణ గల్లీలో ఉద్యమాన్ని సజీవంగా ఉంచుతూనే అటు ఢిల్లీ పవర్ కారిడార్లలో లాబీయింగ్ ద్వారా తెలంగాణ ఆకాంక్షకు కెసిఆర్ విస్తృతంగా మద్ధతు కూడగట్టారని ప్రశంసించారు.
తన తొలి అడుగే త్యాగంతో మొదలు పెట్టిన ఆయన నేతృత్వంలో టిఆర్ఎస్ నాయకులు ఎన్నో సార్లు పదవులను పూచిక పుల్లల్లా విసిరేశారన్నారు. అటు కాంగ్రెస్, ఇటు బిజెపి రెండు జాతీయ పార్టీలు తెలంగాణ అంశంపై ఎన్ని దాగుడుమూతలు ఆడినా, మడమతిప్పకుండా ఉద్యమాన్ని కొనసాగించి, చివరికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి చివరికి డిల్లీ మెడలువంచి ఆరు దశాబ్దాల ఆకాంక్షను కెసిఆర్ నెరవేర్చారని ప్రశంసించారు.
గత ఏడేళ్ల స్వయం పాలనలో కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అప్రతిహతంగా పురోగమిస్తున్నదని, తెలంగాణ భాష, సంస్కృతులకు పెద్ద పీట వేస్తూ, ఉమ్మడి పాలనలో జరిగిన విధ్వంసం నుంచి ఒక మహత్తరమైన పునర్ నిర్మాణ ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు. ఉద్యమానికి ముందు ప్రత్యేక రాష్ట్రానికి తర్వాత సైతం రెండు దశాబ్దాలుగా తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పర్యాయపదంగా తెలంగాణ రాష్ట్ర సమితి నిలిచిందంటే అతిశయోక్తి కానే కాదన్నారు.
తెలంగాణ సాధన, పునర్ నిర్మాణం అనే రెండు చారిత్రక కర్తవ్యాలను విజయవంతంగా నెరవేర్చిన టిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు దేశ రాజధానిలో ఒక గొప్ప కార్యాలయం నిర్మించడానికి గురువారం ముఖ్యమంత్రి కెసిఆర్ చేతులమీదుగా భూమిపూజ జరిగిందని, తెలంగాణ నుండి వచ్చిన వందలాది మంది నాయకులు, కార్యకర్తల నడుమ ఒక పండుగలా ఈ వేడుక జరిగిందని కెటిఆర్ తెలిపారు. పార్టీ ఏర్పడిన తొలినాళ్లలో నిర్వహించిన కార్ల ర్యాలీ నుంచి మొదలుకొని తెలంగాణ ఏర్పాటు కోసం నిరంతరం ఢిల్లీకి చేసిన అనేక ప్రయాణాలను ఉద్వేగంతో స్మరించుకున్న విషయాన్ని కెటిఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న ప్రొఫెసర్ జయశంకర్ సర్ మాటలాగ, ఇవ్వాళ తెలంగాణ గులాబీ పతాకం ఢిల్లీ గడ్డ మీద రెపరెపలాడటం ప్రతి తెలంగాణ బిడ్డకు ఒక గొప్ప భరోసాను ఇస్తుందని కొనియాడారు. దక్షిణ భారత దేశం నుంచి ఒక ప్రాంతీయ పార్టీ ఢిల్లీలో ఒక కార్యాలయం స్థాపించడం ఇది రెండవది కావడం, టిఆర్ఎస్ శ్రేణులకు గర్వకారణమన్నారు. సందర్భంగా పార్టీ కోసం అనునిత్యం పాటుపడుతున్న పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News